
తాడేపల్లి: అన్నదాతల ఆగ్రహంలో కూటమి ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయమని హెచ్చరించారు వైఎస్సార్‌సీపీ నేత, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి,. కూటమి ప్రభుత్వంపై అన్నదాతలు మండిపోతున్నారని స్పష్టం చేశారు. ఈరోజు(మంగళవారం, సెప్టెంబర్ 9వ తేదీ) తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన లేళ్ల అప్పిరెడ్డి.. ‘రైతులకు ఉపయోగపడే ఒక మంచి పని కూడా చంద్రబాబు చేయలేదు. సమాజానికి అన్నం పెట్టే రైతన్న సంతోషంగా లేడు. రైతులు ఉసురు తగిలిన ప్రభుత్వాలు ఉండవు. కూటమి ప్రభుత్వం కుట్రలు, నోటీసులు రైతన్నలను ఆపలేవు. కూటమి ప్రభుత్వ సమీక్షలు ఎవరి ప్రయోజనాల కోసం?, లక్షలాది మంది రైతన్నలు రోడ్డెక్కారు. టీడీపీ నేతలు బ్లాక్ మార్కెట్‌లో యూరియా అమ్ముకుంటున్నారు.
అన్నదాత పోరు సక్సెస్ అయింది. ఇది అంతం కాదు ఆరంభం మాత్రమే. రాష్ట్రంలో 74 ప్రాంతాల్లో చేసిన నిరసన కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. చంద్రబాబు రైతు వ్యతిరేకి. ఆయనకు రైతులంటే ఎప్పుడూ చిన్నచూపే. అందుకే వ్యవసాయం దండుగ అని నిస్సిగ్గుగా మాట్లాడారు. రోడ్డు మీదకు వస్తే రైతుల కష్టాలు కనడతాయి నిజంగా రైతులకు కష్టాలు లేకపోతే కేంద్రంతో ఎందుకు మాట్లాడలేదు?, 4 సార్లు సీఎం అని చెప్పుకునే చంద్రబాబు ఏనాడైనా రైతుల మేలు కోసం పని చేశారా?, ఈ 15 నెలుగా రాష్ట్రంలో ఏ పంట సాగు చేసిన రైతయినా ప్రశాంతంగా ఉన్నాడా?, చంద్రబాబు వలన రైతులకు రూపాయి ప్రయోజనం కూడా లేదు.
గంటల తరపడి యూరియా కోసం నిత్యం క్యూలో నిలపడుతున్నా చంద్రబాబుకు కనపడటం లేదు. రైతులు ఏడ్చిన రాజ్యాలు ఏనాడూ నిలపడలేదు. ఇది చరిత్ర చెప్తున్న వాస్తవం. కూటమి ప్రభుత్వం రైతుల ఆగ్రహంలో కొట్టుకుపోక తప్పదు. వైఎస్సార్ సీపీ నిరసనల ప్రకటన తర్వాతనే చంద్రబాబు హడావుడి చేస్తున్నారు. యూరియా మొత్తం టీడీపీ నేతలు బ్లాక్ మార్కెట్ కి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అన్నదాత పోరులో పాల్గొంటే కేసులు పెడతామని బెదిరిస్తారా?, అరెస్టులు చేస్తామని హెచ్చరిస్తారా?, ఇలాంటి బెదిరింపులను లెక్క చేయకుండా రైతులు రోడ్డు మీదకు వచ్చారు. ధర్మాన, రామసుబ్బారెడ్డి, జోగి రమేష్, జక్కంపూడి రాజా, పిన్నెళ్లి లాంటి అనేకమంది నేతలను హౌస్ అరెస్టు చేశారు.
ఇదేనా ప్రజాస్వామ్యం అంటే?, ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు ఏం చేయదలచుకున్నారు?, జగన్ హయాంలో ఏనాడైనా ఏ రైతైనా రోడ్డు ఎక్కాడా?, ఇప్పుడే ఎందుకు ఇలాంటి పరిస్థితి తలెత్తింది?, సమస్యలు రాకముందే జగన్ ముందుగానే పసిగట్టి పాలన చేశారు. అందుకే రైతులు సంతోషంగా ఉన్నారు. చంద్రబాబు పట్టించుకోనందునే రైతులు రోడ్ల మీద ఆందోళనకు దిగుతున్నారు. ఈరోజు 74 చోట్ల చేసిన నిరసనలు సక్సెస్ అయ్యాయి. రైతులు కదం తొక్కటం చూసి డీజీపి మాట మార్చారు. నిరసనలకు అనుమతి లేదని మొదట నోటీసులు ఇచ్చి మధ్యాహ్నం తర్వాత అనుమతులు ఇస్తున్నామని ఎందుకు ప్రకటించారు?, అంటే రైతుల ఆందోళనలు చూసి చంద్రబాబు ప్రభుత్వం భయపడింది’ అని పేర్కొన్నారు.
కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎరువుల బ్లాక్ మార్కెటింగ్, కృత్రిమ కొరత.. అధిక ధరలతో రైతన్నలను దగా చేయటాన్ని నిరసిస్తూ ‘అన్నదాత పోరు’ పేరుతో వైఎస్సార్ సీపీ రణభేరి మోగించింది. పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని ఆర్డీవో కార్యాలయాల ఎదుట రైతులతో కలిసి వైఎస్సార్ సీపీ శ్రేణులు, రైతు సంఘాలు పెద్ద ఎత్తున శాంతియుత నిరసన చేపట్టాయి. వైఎస్సార్‌సీపీ తలపెట్టిన అన్నదాత పోరు కార్యక్రమానికి రాష్ట్రంలోని రైతులు కదం తొక్కారు.