కుంటనక్కలు..! | TDP Leaders Illegally Occupied Pond in Andhra pradesh | Sakshi
Sakshi News home page

కుంటనక్కలు..!

Dec 12 2025 6:21 AM | Updated on Dec 12 2025 6:21 AM

TDP Leaders Illegally Occupied Pond in Andhra pradesh

20.18 ఎకరాల విస్తీర్ణంలో ఎగదాల చెరువు 

15 ఎకరాలు ఆక్రమించిన అధికార టీడీపీ నేతలు 

అందులో ఎక్కువగా ఒక టీడీపీ నాయకుడి చేతివాటం  

కుంచించుకుపోయి చెరువు కాస్తా కుంటగా మారిన వైనం 

చెరువు సమీపంలో ఎకరా రూ.80 లక్షలు  

చెరువు స్థలం సైతం ఎకరా రూ.20 నుంచి రూ.25 లక్షలకు విక్రయాలు 

చెరువును కాపాడండి మహాప్రభో అంటున్నా పట్టని అధికారులు

ఒంగోలు నగర శివారు చెరువుకొమ్ముపాలెం ఎగదాల చెరువును అధికార పార్టీ నేతలు చెరబట్టారు. ఈ చెరువు 20.18 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇందులో సుమారు 15 ఎకరాలు అధికార టీడీపీ నేతలు ఆక్రమించేశారు. ఈ చెరువు సమీపంలో పెద్దా, చిన్నా పరిశ్రమలు ఉన్నాయి. ఇక్కడ ఎకరా రూ.80 లక్షల ధర పలుకుతోంది. అయితే ఆక్రమణదారులు ఎకరా రూ.25 లక్షలకు విక్రయించేసి సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అధికార పార్టీ నాయకులు కావడంతో అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. మా చెరువును కాపాడండి మహా ప్రభో అని గ్రామస్తులు వేడుకుంటున్నా పట్టించుకునే వారే కరువయ్యారు.  

ఒంగోలు సబర్బన్‌: 
ఒంగోలు నగర పాలక సంస్థ పరిధి 18వ డివిజన్‌ చెరువుకొమ్ముపాలెం గ్రామంలోని ఎగదాల చెరువు ఉంది. ఆర్‌ఎస్‌ఆర్‌లో ఆ చెరువు పేరు రెడ్డివాని కుంటగా రికార్డుల్లో నమోదై ఉంది. కానీ చెరువుకొమ్ము పాలెం గ్రామానికి పై వైపున ఉండటంతో పాటు మరికొన్ని కుంటలు చెరువులు ఉండటంతో ఆ చెరువును గుర్తుగా ఉండటం కోసం ఎగదాల చెరువుగా పిలుచుకుంటుంటారు. చెరువుకొమ్ముపాలెం గ్రామ సర్వే నెం. 243లో కుంట పోరంబోకుకు చెందిన దాదాపు 20.18 ఎకరాల విస్తీర్ణంలో చెరువు ఉంది. ఇందులో దాదాపు 15 ఎకరాలు పైగా ఆక్రమణలకు గురైంది.

కుంచించుకుపోయి చెరువు ప్రస్తుతం 5 ఎకరాలలోపునకు చేరింది. చెరువు కాస్తా కుంటగా మారిపోయింది. ఈ చెరువు తరాల నుంచి ఆ గ్రామస్తుల సాగు నీటి అవసరాలు తీరుస్తూ వస్తోంది. అదేవిధంగా పశువుల దాహార్తిని తీర్చుకోవటానికి కూడా ఈ చెరువును వినియోగించేవారు. గ్రామస్తుల వ్యవసాయ పనులకు ఉపయోగకరంగా ఉండేది. పంట పొలాలకు ఆ చెరువులోని నీటిని ఇంజన్ల ద్వారా, తాగాణీల ద్వారా, ఎత్తిపోసుకోవడం ద్వారా రైతులు వినియోగించుకునేవారు. ఈ చెరువు చుట్టూ దాదాపు 100 ఎకరాలకు సాగు నీరు అందుతోంది.  

రూ.20 నుంచి రూ.25 లక్షలకు అమ్ముకుంటున్న టీడీపీ నేత... 
ఎగదాల చెరువు ఆక్రమించుకొని యథేచ్ఛగా అమ్ముకుంటున్నారు. దొంగ సర్వే నంబర్లు వేసి రిజి్రస్టేషన్లు కూడా చేస్తున్నారు. గ్రామానికి చెందిన ఒక టీడీపీ నేత 4.5 ఎకరాలు కబ్జా చేశాడు. అందులో ఇటీవల ఎకరా రూ.25 లక్షలకు విక్రయించాడన్న ఆరోపణలు ఉన్నాయి. అతనిని చూసి మరికొందరు కబ్జాదారులు కూడా ఇటీవల ఎకరా రూ.20 లక్షలకు బేరం పెట్టినట్లు సమాచారం. 

ఆ చెరువు పరిసర ప్రాంతాల్లో పెద్దా, చిన్నా పరిశ్రమలు రావడంతో ఆ ఎగదాల చెరువు స్థలాలకు కూడా గిరాకీ పెరిగింది. దాంతో అధికార టీడీపీ నేత చెరువు పోరంబోకు స్థలాలను విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. చెరువుకొమ్ముపాలెం నుంచి కొణిజేడు వెళ్లే రోడ్డు ఫేస్‌లో ఇటీవల ఎకరా రూ.80 లక్షలు పలికింది. ఇప్పటికే దాదాపు ఐదు ఎకరాలకు పైగా స్థలం పలు చేతులు కూడా మారాయి. చెరువు ఆక్రమించుకుని దర్జాగా విక్రయించేస్తున్నా మామూళ్లు తీసుకున్న అధికారులు పట్టించుకోవడంలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  

కబ్జాదారుల నుంచి చెరువును రక్షించాలి 
గ్రామానికి ఎంతో ప్రయోజనకరంగా ఉండే ఎగదాల చెరువును కబ్జా కోరల నుంచి రక్షించాలి. కొందరు స్వార్థపరులు యథేచ్ఛగా ఆక్రమించుకున్నారు. ఆక్రమించుకున్న కబ్జాదారులు ఎకరా రూ.25 లక్షలకు పైగా అమ్ముకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు మేలుకొని కబ్జా చెరనుంచి చెరువును కాపాడాల్సిన అవసరం ఉంది. లేకుంటే భవిష్యత్తు తరాలకు నీటి నిల్వ కుంటలు, చెరువులు లేకపోతే ప్రజలకు ముప్పువాటిల్లే ప్రమాదం ఉంది. దానికి తోడు అభివృద్ధి చెందుతున్న ఒంగోలు నగర పాలక సంస్థకు ఆ చెరువు సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకు మాదిరిగా కూడా ఉపయోగపడుతుంది. – పూసపాటి సమర సింహా రెడ్డి, వైఎస్సార్‌ సీపీ నాయకులు, చెరువుకొమ్ముపాలెం. 

సర్వే చేసి చెరువును పునరుద్ధరించాలి  
ఎగదాల చెరువు మొత్తాన్ని సర్వేచేసి రెవెన్యూ రికార్డుల ప్రకారం నిర్ధారించాలి. తద్వారా చెరువు పాత పద్ధతిలో మాదిరిగా పునరుద్ధరించాలి. ఆక్రమణ చెర నుంచి కాపాడకపోతే భవిష్యత్తులో ఉద్యమాలు చేసి అయినా చెరువును కాపాడుకుంటాం. చెరువుకు హద్దులు వేసి ఫెన్సింగ్‌ ఏర్పాటు చేసి చెరువుకొమ్ముపాలెం ప్రజలు, రైతులను ఆదుకోవాలి. చుట్టూ ఉన్న రైతుల అవసరాలను తీర్చేలా చెరువును తయారు చేయాలి. గ్రామంలోని పశువులకు కూడా తాగునీటి సమస్యను తీర్చాలి. కొందరు స్వార్ధపరులు చెరువును తమ కబంద హస్తాల్లోకి తీసుకొని నిలువునా అమ్ముకుంటున్నారు. దానిని అధికారులు అడ్డుకోవాలి. – తాటిపర్తి రాగయ్య, చెరువుకొమ్ముపాలెం  

ఎగువ ప్రాంతాల నుంచి నీరు రాకుండా అడ్డుకట్ట.. 
20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువుపై అధికార టీడీపీ నేతలు కన్నేశారు. దాదాపు 15 ఎకరాల వరకూ కబ్జా చేసేశారు. ఆక్రమణదారులు కొంత మంది వీటిని వ్యవసాయ భూములుగా ఉపయోగించుకొంటున్నారు. ఎగువ ప్రాంతం నుంచి చెరువులోకి వచ్చే నీటిని కూడా రానీయకుండా ఆక్రమణదారులు అడ్డుకట్టలు వేసేశారు. అంతేకాదు చుట్టు పక్కల ఉన్న రైతులకు చెరువు నీరు రాకుండా చేసి ఇబ్బందులు పెడుతున్నారు. ఆక్రమణ దారుల నుంచి ఈ చెరువు కాపాడి అభివృద్ధి చేసి నీటి నిల్వ సామర్థ్యం పెంచాలని చెరువుకొమ్ముపాలెం గ్రామస్తులు కోరుతున్నారు.

నీటి నిల్వ సామర్థ్యం పెరిగితే భూగర్భ జలాల నీటి మట్టం పెరిగి చుట్టూ ఉన్న రైతుల బోర్లలో నీళ్లు పుష్కలంగా అందుబాటులోకి వస్తాయి. వేసవికాలంలో కూడా చుట్టు పక్కల రైతులు ఆరుతడి పంటలు సాగు చేసుకోవటానికి ప్రయోజనకరంగా ఉంటుంది. చెరువును పరిరక్షించాలని గ్రామస్తులు అధికారులను వేడుకుంటున్నా పట్టించుకున్న దాఖలాల్లేవు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement