సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు.. ఈ ఏడాది ఇప్పటివరకు విమానాల అద్దెకు రూ.40.96 కోట్లు
మరోవైపు లోకేశ్, పవన్‌కళ్యాణ్ కూడా ప్రత్యేక హెలికాప్టర్లలోనే చక్కర్లు
వాటి లెక్కలు తేలాల్సి ఉంది
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక హెలికాప్టర్, విమాన ప్రయాణాల అద్దె కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో మరో రూ.10.92 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు ఏపీ ఏవియేషన్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు పరిపాలన అనుమతినిస్తూ సాధారణ పరిపాలనశాఖ (రాజకీయ) ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో ఏ జిల్లాకు వెళ్లినా ప్రత్యేక హెలికాప్టర్ లేదా ప్రత్యేక విమానం వినియోగిస్తున్న విషయం తెలిసిందే. అలాగే తరచూ ప్రత్యేక విమానంలో హైదరాబాద్–విజయవాడ మధ్య ప్రయాణిస్తున్నారు.
ఇప్పటికే ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ప్రత్యేక హెలికాప్టర్, విమాన చార్జీల అద్దె చెల్లింపుల కోసం మే నెల 22వ తేదీన రూ.19.12 కోట్లకు అనుమతి మంజూరు చేస్తూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది సెపె్టంబర్ 18న రెండో త్రైమాసికంలో ప్రత్యేక హెలికాప్టర్, విమాన చార్జీల అద్దె చెల్లింపునకు మరో రూ.10.92 కోట్లకు అనుమతిస్తూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులిచ్చింది. తాజాగా మూడో త్రైమాసికంలో అనుమతిచ్చిన రూ.10.92 కోట్లతో కలిపితే ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు సీఎం చంద్రబాబు ప్రత్యేక హెలికాప్టర్, విమానాలకు అద్దె రూపంలో రూ.40.96 కోట్లను చెల్లించినట్లు అవుతోంది.
చినబాబు, పవనూ ప్రత్యేక విమానాల్లోనే చక్కర్లు
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు లోకేశ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా రూ.కోట్లాది రూపాయల ప్రజాధనం ఉపయోగించి ప్రత్యేక విమానాలు, హెలికాఫ్టర్లలోనే చక్కెర్లు కొడుతున్నారు. అయితే వీరు తిరుగుతున్న విమానాల అద్దె లెక్కలు తేలాల్సి ఉంది.


