బాబూ.. ఇదేం 'బ్యాగు'? | Chandrababu Naidu government has failed miserably in executing student kit distribution scheme, bags are torn in just two months | Sakshi
Sakshi News home page

బాబూ.. ఇదేం 'బ్యాగు'?

Dec 12 2025 3:38 AM | Updated on Dec 12 2025 3:38 AM

Chandrababu Naidu government has failed miserably in executing student kit distribution scheme, bags are torn in just two months

విద్యార్థి కిట్‌లో చంద్రబాబు సర్కారు ఘోరంగా ఫెయిల్‌ 

కేవలం రెండు నెలల్లోపే బ్యాగులు చిరిగిపోయిన వైనం 

పూర్తిగా డ్యామేజ్‌.. కుట్టించుకోలేక విద్యార్థుల తిప్పలు 

హైస్కూల్‌ వారికి రెండో తరగతి విద్యార్థుల బూట్లు 

ఒక్కోటి రూ.2,279 విలువతో 35.60 లక్షల కిట్ల కొనుగోలు 

ఈ విద్యా సంవత్సరంలో రూ.800 కోట్లకుపైగా వ్యయం 

జగనన్న విద్యా కానుక పథకానికే విద్యార్థి మిత్రగా పేరు మార్పు

కానీ, గత ప్రభుత్వంలో కంటే 7 లక్షలమంది విద్యార్థులకు కోత 

అయినప్పటికీ ఇచ్చిన కిట్‌లు పూర్తిగా నాసిరకం 

నాణ్యతను గాలికొదిలేసి ఖర్చు తగ్గించామంటూ 

ప్రచారం.. విద్యా సంవత్సరం 7 నెలలు 

ముగిసినా బ్యాగులు అందనివారూ ఉన్నారు 

వైఎస్సార్‌సీపీ హయాంలో నాణ్యమైన ‘జగనన్న విద్యా కానుక’ 

బ్యాగులు సహా కిట్‌లోని ప్రతి వస్తువును పరిశీలించిన వైఎస్‌ జగన్‌ 

ఏటా సగటున 43 లక్షల మందికి బడి తెరిచిన రోజే పంపిణీ 

కేంద్ర ప్రభుత్వ సంస్థ క్వాలిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాతో తనిఖీ 

ప్రస్తుత ప్రభుత్వంలో పరిస్థితి దీనికి పూర్తిగా భిన్నం

సాక్షి, అమరావతి, సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: భుజాలకు తగిలించుకునే బందులు ఊడిపోయాయి.. జిప్పులు పనిచేయడం మానేశాయి.. కుట్టించి వాడుకున్నా మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలింది.. విసుగు చెంది కొన్ని రోజుల్లోపే మూలనపడేసే పరిస్థితి వచ్చింది..! 

ఇదీ విద్యార్థి మిత్ర పేరుతో చంద్రబాబు సర్కారు అందజేసిన కిట్లలోని స్కూల్‌ బ్యాగుల దుస్థితి..! రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేసిన  బ్యాగ్‌లు పూర్తిగా డ్యామేజ్‌ అయ్యాయి. విద్యా సంవత్సరం ఏడు నెలలు ముగిసినా ఇంకా కిట్లు అందాల్సినవారు ఉండడం గమనార్హం. 

ఇదంతా చూస్తుంటే ప్రభుత్వ విద్యకు సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఏమాత్రం ప్రాధాన్యం ఇస్తున్నదో అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో నాటి సీఎం వైఎస్‌ జగన్‌ అందించిన విద్యా కానుక నాణ్యతను విద్యార్థుల తల్లిదండ్రులు గుర్తు చేస్తున్నారు. 

అప్పట్లో ఇచ్చిన కిట్‌లోని బ్యాగులు సహా ప్రతి వస్తువును వైఎస్‌ జగన్‌ ఆసాంతం పరిశీలించిన వైనాన్ని ప్రస్తావిస్తున్నారు. ఈ ప్రభుత్వంలో మూడంచెల తనిఖీ తర్వాత బ్యాగులు ఇచ్చామని విద్యా శాఖ మంత్రి లోకేశ్‌ చెబుతున్నారు. 

కానీ, ఏమాత్రం నాణ్యత లేని బ్యాగులను చూశాక ఆయన పరిశీలించింది ‘కమీషన్ల కోసం’ అనే ఆరోపిస్తున్నారు. ఇక బాబు సర్కారు ఇచ్చిన కిట్లలోని బూట్లు కూడా  నాసిరకంగా ఉన్నాయి. సైజు తీసుకోకుండా ఇష్టారీతిన పంపిణీ చేసేశారు. దీంతో హైస్కూల్‌ వారికి రెండో తరగతి విద్యార్థుల బూట్లు వచ్చాయి. చాలాచోట్ల సాక్సులు ఇవ్వకపోవడంతో వాటిని పక్కన పెట్టేశారు.

కాపీ కొట్టి.. ఎగ్గొట్టి...
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చక్కగా అమలు చేసిన ‘జగనన్న విద్యాకానుక’ పథకాన్ని చంద్రబాబు సర్కారు కాపీ కొట్టింది. డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్ర అని పేరుతో అమలు చేస్తోంది. అయితే, వైఎస్‌ జగన్‌ సీఎంగా ఉండగా ఏటా సగటున 43 లక్షల మందికి బడి తెరిచిన రోజే కిట్‌లను పంపిణీ చేశారు. ప్రస్తుతం బాబు ప్రభుత్వం 35.60 లక్షల మంది విద్యార్థులకే కిట్లనే కొనుగోలు చేసింది. 

అంటే, విద్యార్థుల సంఖ్యలో ఏడు లక్షల మందికిపైగా కోతపెట్టింది. ఇక రూ.800 కోట్లకు పైగా ఖర్చు చేసి ఒక్కోటి రూ.2,279 విలువతో 35.60 లక్షల కిట్లను కొనుగోలు చేసింది. కానీ, ఈ పథకంలో గోల్‌మాల్‌ జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

లాబీయింగ్‌తో పెద్దఎత్తున అవినీతికి పాల్పడడంతో బ్యాగుల నాణ్యత అత్యంత నాసిరకంగా ఉన్నట్లు విద్యార్థుల బ్యాగుల సాక్షిగా స్పష్టమవుతోంది. మూడు దశల్లో తనిఖీ చేసిన బ్యాగులు కనీసం రెండు నెలలు కూడా మనలేదు. ఇక పాఠశాలలు పునఃప్రారంభమైన రోజే కిట్లు అందజేశామని గొప్పలు పోయారు. కానీ, అవినీతి కారణంగా నాణ్యత లేని బ్యాగులు అందాయి. చిరిగిపోయిన వాటికి అతుకులు వేసుకుని వెళ్లాల్సి వస్తోందని విద్యార్థులు వాపోతున్నారు.

ఒకటి ఉంటే మరొకటి లేదు
‘గత ప్రభుత్వం విద్యా కానుక పేరుతో నిధులు దుర్వినియోగం చేసింది. మా సర్కారులో విద్యార్థి కిట్ల ఖర్చు తగ్గించి ప్రజాధనం ఆదా చేశాం’ అని విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ గొప్పలు పోయారు. తీరా కిట్‌లోని బ్యాగులు చూస్తే అత్యంత నాసిరకంగా ఉన్నాయి. బూట్లు సైజు సరిపోవడమే లేదు. కిట్‌లో ఒక వస్తువు ఇస్తే మరో వస్తువు లేదు. 

బ్యాగులతో పాటు చాలా జిల్లాల్లో డిక్షనరీలు, యూనిఫాం, సాక్సులు తదితరాలను విద్యా­ర్థుల తల్లిదండ్రులు సొంతంగా కొనివ్వాల్సి వచ్చింది. దీంతో జగనన్న విద్యా కానుక కిట్లకు చంద్రబాబు విద్యా మిత్రకు పూర్తి వ్యత్యాసం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏ ప్రభుత్వ పాఠశాలలో చూసినా చిరిగిన బ్యాగులు గుట్టలుగా పడి ఉన్నాయి.

బ్యాగును మూటలా మోయాల్సిందే 
బాపట్ల జిల్లా కొల్లూరు జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో చదువుతున్నా. ప్రభుత్వం ఇచి్చన బ్యాగ్‌ కొద్ది రోజులకే చిరిగిపోయింది. జిప్పు మొత్తం పాడైంది. భుజాలకు తగిలించుకునే బందులూ ఊడిపోయాయి. బ్యాగ్‌ను ధాన్యం బస్తాను మోసినట్లు భుజంపై పెట్టుకుని పాఠశాలకు వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది.  – చొప్పర అక్షయ్‌కుమార్, కొల్లూరు, బాపట్ల జిల్లా

ఈ చిత్రంలో ఉన్నవారంతా శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మున్సిపాల్టీ బ్రాహ్మణ స్ట్రీట్‌ పురపాలక ప్రాథమిక పాఠశాల విద్యార్థులు. బాబు సర్కారు ఇచ్చిన బ్యాగులు వెంటనే చిరిగిపోవడంతో మార్కెట్‌లో కొనుక్కున్న వాటితో రోజూ పాఠశాలకు వస్తున్నారు.

4,300 మంది విద్యార్థులు.. 3 వేల బ్యాగులు చిరిగాయి.. ప్రకాశం జిల్లా కురిచేడు మండలంలోని పాఠశాలల్లో 4,326 మంది చదువుతున్నారు. వీరికిచ్చిన బ్యాగులు 2 నెలలు కూడా నిలవలేదు. 3 వేల బ్యాగులు చిరిగి­పోయాయి. విద్యార్థులు సొంత డబ్బు పెట్టి మార్కెట్లో కొనుక్కు­న్నారు. కొనలేనివారు చిరిగినవాటినే కుట్టుకుని పాఠశాలకు తెచ్చుకుంటున్నారు.

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇస్తున్న నాణ్యమైన బ్యాగులివి అంటూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ అసెంబ్లీలో చెప్పినవి ఇవే. ప్రత్యేక జాగ్రత్తలు పాటిస్తూ, హ్యాండిల్స్‌ ఊడిపోకుండా బాగా స్టిచ్చింగ్‌ చేసినట్టు గొప్పలు పోయారు. కానీ, ఆయన చెప్పినదానికి ఇచ్చిన బ్యాగులకు పొంతన లేదు. కొన్ని రోజులకే చిరిగిపోయాయి. కుట్టే వారి వద్దకు కుప్పలు తెప్పలుగా చేరుతున్నాయి.

20 రోజులకే చిరిగిపోయింది
ఐదో తరగతి చదువుతున్న మా అబ్బాయి ప్రదీప్‌నకు చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన బ్యాగ్‌ 20 రోజులకే చిరిగిపోయింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఇచ్చిన బ్యాగ్‌ రెండేళ్ల పాటు మన్నికగా ఉంది. ప్రస్తుతం నాణ్యత లేని బ్యాగు, సైజ్‌ తక్కువ ఉన్న బూట్లు పంపిణీ చేశారు. –ముప్పాళ్ల ఎస్తేరు, కొత్తపేట, కంచికచర్ల మండలం, ఎన్టీఆర్‌ జిల్లా

పీచులు పీచులుగా ఊడిపోయింది...
మా అమ్మాయి 7వ తరగతి చదువుతోంది. ఈ ఏడాది జూన్‌ 17న ఇచ్చిన బ్యాగు 20 రోజులైనా గడవక ముందే కుట్లు పీచులుగా పీచులుగా ఊడిపోయింది. పలుసార్లు కుట్టినా లాభం లేకపోయింది. మార్కెట్లో కొని స్కూల్‌కు పంపుతున్నాం. జగనన్న ఇచ్చిన బ్యాగులు ఎంతో నాణ్యంగా ఉండేవి. నీటిలో కడిగినా చెక్కుచెదరలేదు. మూడేళ్ల పాటు ఉపయోగించాం. – భాగ్యమ్మ, విద్యార్థిని తల్లి, తిరుపతి

నాలుగైదు సార్లు కుట్లు వేయించినా...
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులను చిన్నచూపు చూడడం సరికాదు. నా ఇద్దరు పిల్లలకు ఇచ్చిన బ్యాగులు కొన్ని నెలలు కూడా ఉపయోగపడలేదు. బ్యాగులను నగరి వెళ్లి నాలుగు సార్లు కుట్లు వేయించా. అయినా నిలువలేదు. చివరికి కొత్తవి కొనిచ్చా. – రామ్మూర్తి, విద్యార్థి తండ్రి, నగరి మండలం, చిత్తూరు జిల్లా

కొనుక్కోవడానికి డబ్బులు లేవు
నేను 8వ తరగతి చదువుతున్నాను. బడిలో ఇచ్చిన బ్యాగు కొద్ది రోజులకే పాడైంది. కుట్టుకొని వాడుకుంటున్నా. కొత్త బ్యాగు కొనుక్కోవాలంటే డబ్బులు కావాలి. మాది పేద కుటుంబం కావడంతో తల్లిదండ్రులను అడగలేకపోతున్నా. – మాలతీ బెహరా, 8వ తరగతి, ఈదుపురం, ఇచ్ఛాపురం

ఈ విద్యా సంవత్సరంలో బాబు సర్కారు ఇచ్చిన బ్యాగు ఇది... ఇదేమో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం రెండేళ్ల కిందట ఇచ్చిన బ్యాగు 

ఆసాంతం నాణ్యమైన ‘జగనన్న విద్యా కానుక’
వైఎస్‌ జగన్‌ సీఎంగా ఉన్న సమయంలో ప్రభుత్వ విద్యకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. పేద పిల్లలు చదువుకునే పాఠశాలలను కార్పొరేట్‌ స్థాయిలో తీర్చిదిద్దారు. తల్లిదండ్రులకు రూపాయి ఖర్చు ఉండకూడదని తపించారు. 

కార్పొరేట్‌ స్కూల్‌ వారితో సమానంగా ఆత్మవిశ్వాసంతో బడికి వెళ్లాలని ‘జగనన్న విద్యా కానుక’ కిట్‌ను అందించారు. ఏటా సగటున 43 లక్షల మంది విద్యార్థులకు బడి పునఃప్రారంభం మొదటి రోజే పంపిణీ చేశారు. 

బ్యాగ్, టెక్ట్స్‌ బుక్స్, నోట్‌ పుస్తకాలు, జత బూట్లు, రెండు జతల సాక్సులు, వర్క్‌బుక్స్‌ (ప్రాథమిక పాఠశాల వారికి), ఇంగ్లిష్‌–తెలుగు ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీ (హైస్కూల్‌), పిక్టోరియల్‌ డిక్షనరీ, మూడు జతల యూనిఫారం క్లాత్, బెల్టు, టై ఉన్న ఈ కిట్‌లోని ప్రతి వస్తువు నాణ్యతను స్వయంగా పరిశీలించారు. 

వస్తువుల నాణ్యత పరిశీలించే బాధ్యతను ‘క్వాలిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా’కు అప్పగించారు. ఇది భారత ప్రభుత్వం మద్దతుతో లాభాపేక్ష లేకుండా నడుస్తున్న సంస్థ. ఇలా నాలుగు విద్యా సంవత్సరాలు రూ.3,366.53 కోట్లతో విద్యా కానుక అందించారు. 

2024–25 విద్యా సంవత్సరానికి కూడా జగన్‌ ప్రభుత్వంలోనే ఆర్డర్‌ ఇచ్చారు. కానీ, తర్వాత వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం సరఫరాను నిర్లక్ష్యం చేసింది. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం హయాంకు పూర్తి భిన్నంగా ఇప్పుడు జరుగుతోందని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు.

ఏ విద్యార్థిని అడిగినా... ఆవేదనే

ఉత్తరాంధ్రలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో ఎవరిని కదిపినా చిరిగిన బ్యాగులు, పనికిరాని బూట్ల గురించే చెబుతున్నారు. 

అనంతపురం జిల్లాలో పదిశాతం బ్యాగులు కూడా మన్నిక లేవు. మూణ్నాళ్లు కూడా రాలేదని ఉపాధ్యాయ సంఘాల నేతలు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు.

తిరుపతి జిల్లాలో 3 లక్షల మంది విద్యార్థులకు గాను 2.42 లక్షలమందికే పంపిణీ చేశారు. ఇందులో 80 శాతం బ్యాగ్‌లు పక్కనపడేశారు. చిత్తూరు జిల్లాలో రెండు నెలల్లోపే చినిగిపోయాయి.

కర్నూలు జిల్లాలో ప్రతి స్కూల్‌లో బ్యాగ్‌లు చిరిగాయి. పాతవాటితోనే పిల్లలు పాఠశాలలకు వెళ్తున్నారు. 

నెల్లూరు జిల్లాలో 2 నెలలకే జిప్‌లు ఊడి చినిగిపోయాయి. నెల్లూరులో 30 శాతం మంది కొత్తవి కొనుక్కున్నారు. శ్రీసత్యసాయి జిల్లాలో ఏ పాఠశాలలోనూ విద్యార్థుల వద్ద బ్యాగులు లేవు. బయట కొనుక్కుని వస్తున్నారు. మంత్రులు ప్రాతినిథ్యం వహిస్తున్న ధర్మవరం, పెనుకొండలో అధ్వాన పరిస్థితులున్నాయి.

నంద్యాల జిల్లాలో మూడేళ్ల కిందట ఇచ్చిన జగనన్న విద్యాకానుకలోని వాటినే విద్యార్థులు వాడుకుంటున్నారు.

వైఎస్సార్‌ కడప జిల్లాలో 1,34,275 బ్యాగులను సరఫరా చేయగా అధిక శాతం చినిగిపోయాయి.

ఎన్టీఆర్‌ జిల్లాలో లక్షమంది విద్యార్థులకు ఇచ్చినా నాసిరకంగా ఉండడంతో చినిగిపోయాయి.

ప్రకాశం జిల్లాలో 60శాతం బ్యాగులు పూర్తిగా> పాడయ్యాయి. బాపట్ల జిల్లాలో 87 వేల మందికి బ్యాగ్‌లు ఇవ్వగా 90 శాతం మొదట్లోనే చిరుగుపట్టాయి.

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో బ్యాగ్‌లు నాసిరకంగా ఉండడంతో రెండు నెలలకే పాడయ్యాయి.

ఏలూరు జిల్లాలో 90 శాతంపైగా విద్యార్థులు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇచ్చిన బ్యాగులతోనే పాఠశాలలకు వెళ్తున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement