అ'ధర'గొట్టాలి | Use of mushini seeds in medicine | Sakshi
Sakshi News home page

అ'ధర'గొట్టాలి

Feb 1 2026 5:39 AM | Updated on Feb 1 2026 5:39 AM

Use of mushini seeds in medicine

ఔషధ తయారీలో ముషిణి పిక్కల వినియోగం

వనసీమల్లో ముమ్మరంగా సేకరణ

కిలోకు గిరిజనులకు దక్కుతున్నది రూ.100

ఆన్‌లైన్‌లో 100 గ్రాములు రూ.218

మరింత ధర కల్పిస్తే అడవి బిడ్డలకు ప్రయోజనం  

రాజవొమ్మంగి: కీళ్ల నొప్పులు, నరాల బలహీనత, జీర్ణక్రియ సమస్యల నివారణకు తయారు చేసే ఆయుర్వేద ఔషధాల్లో వాడే ముషిణి పిక్కల సేకరణలో పోలవరం జిల్లాలో గిరిజనులు ప్రస్తుతం తలమునకలుగా ఉన్నారు. వీటి సేకరణ ద్వారా అడవి బిడ్డలు రోజువారీ ఆదాయం పొందుతున్నారు. సాధారణంగా నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో ఈ పిక్కలు లభిస్తూంటాయి. చెట్టుపై ఉండే ముషిణి పండ్లు కాషాయ వర్ణంలో కనిపిస్తూ.. తీయని కమలా ఫలాలను గుర్తుకు తెస్తాయి. 

అయితే, ఈ పండ్లు, పిక్కలు ఎంతో విషపూరితమైనవని అంటారు. ముషిణి గింజలను ఇంగ్లిషులో నక్స్‌–వోమికా అని, పాయిజన్‌ నట్స్‌ అని పిలుస్తారు. ఈ గింజల్లో స్ట్రైక్నైన్, బ్రూసిన్‌ వంటి విషపూరిత ఆల్కలాయిడ్లు ఉంటాయి. వీటిని విష రహితంగా శుద్ధి చేసిన తర్వాతే ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. 

జీసీసీ సేకరణ లక్ష్యం 450 క్వింటాళ్లు 
లోతట్టు గ్రామాల గిరిజనుల నుంచి గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ముషిణి పిక్కలు సేకరిస్తోంది. కిలో పిక్కలకు రూ.100 చెల్లిస్తోంది. రంపచోడవరం డివిజన్‌లో ఈ ఏడాది జీసీసీ ద్వారా రూ.45 లక్షల విలువైన 450 క్వింటాళ్ల ముషిణి పిక్కలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే 300 క్వింటాళ్లు కొనుగోలు చేశారు. ప్రస్తుతం సీజన్‌ దాదాపు ముగిసిపోవడంతో కొనుగోలు కేంద్రాలకు ముషిణి పిక్కలు రావడం తగ్గిపోయింది. 

మరోవైపు చింతూరు డివిజన్‌లో ఇంకా ముషిణి పిక్కలు కొనుగోలు చేస్తున్నట్లు అక్కడి జీసీసీ డివిజనల్‌ మేనేజర్‌ దేవరాజు తెలిపారు. గుత్తికోయ సామాజిక వర్గానికి చెందిన ఆదివాసీలు లోతట్టు అటవీ ప్రాంతాల నుంచి కొనుగోలు కేంద్రాలకు ముషిణి పిక్కలు తీసుకుని వస్తున్నారని చెప్పారు. ఇప్పటి వరకూ 80 క్వింటాళ్ల పిక్కలు కొనుగోలు చేశామన్నారు. 

కనీసం రూ.150 ఇవ్వాలి 
ముషిణి పిక్కల సేకరణ ఎంతో కష్టంగా ఉంటుంది. మేం పడుతున్న శ్రమకు తగిన ధర రావడం లేదు. కిలో ధర రూ.150కి పెంచితే కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది.  – అప్పన్నబాబు, దూసరపాము గ్రామం,రాజవొమ్మంగి మండలం 

మార్కెట్లో ధర లేదు 
గిరిజనుల నుంచి సేకరించిన ముషిణి పిక్కలను మందుల కంపెనీకు లేదా కంపెనీ మధ్యవర్తులకు విక్రయిస్తున్నాం. గిరిజనుల నుంచి కిలో రూ.100కు కొనుగోలు చేస్తున్నాం. వీటిని గోడౌన్లకు తరలించేందుకు రవాణా తదితర ఖర్చులు అధికంగా ఉంటున్నాయి.  వీటిని తిరిగి రూ.135కు అమ్మితేనే జీసీసీకి గిట్టుబాటు అవుతుంది. మందుల కంపెనీలు కిలోకు రూ.110 మాత్రమే ఇస్తామని అంటున్నాయి. దీంతో ముషిణి పిక్కల కొనుగోళ్లు, విక్రయాలు కష్టసాధ్యంగా మారాయి.  – విజయలక్ష్మి, జీసీసీ డివిజనల్‌ మేనేజర్, రంపచోడవరం

కోత.. అంత సులువు కాదు 
ముషిణి గింజల సేకరణ అంత సులువేం కాదు. ఎత్తుగా ఉండే ఈ చెట్టు నిండా ముళ్ల వంటి పదునైన కొమ్మలుంటాయి. దీంతో వీటిని సేకరించండం ఎంతటి వారికైనా కత్తిమీద సామే. అయితే, గిరిజనులు డొంకెన (చివరన హుక్‌ వంటి ఆకారంతో ఉండే పొడవైన కర్ర) ఉపయోగించి ఈ పండ్లను ఎంతో చాకచక్యంగా కోస్తారు. లేదా చెట్టుకొమ్మలు, ఒక్కోసారి చెట్లనే నేల కూల్చి ఈ పండ్లు సేకరిస్తారు. 

ధర గిట్టుబాటు కాకపోవడంతో ఇలా చెట్టు కొమ్మలు నరకాల్సి వస్తోందని వారు చెబుతున్నారు. ఒకసారి కత్తి వేటుకు గురైన చెట్టు మరో రెండు మూడేళ్లకు కానీ తిరిగి కాపు కాయదు. దీనివలన ఈ పిక్కల దిగుబడి తగ్గి ధర పెరిగే అవకాశం ఉంటుందని చాలా మంది భావిస్తారు. అయితే, ఈ పద్ధతి వల్ల అడవుల్లో ముషిణి చెట్లు రానురానూ అంతరించిపోయే ప్రమాదం కూడా ఉంటుంది.

పిక్కలు వేరు చేయడమూ కష్టమే.. 
చెట్ల నుంచి ముషిణి కాయలు కోయడం ఎంత కష్టమో, వాటి నుంచి పిక్కలు వేరు చేయడం కూడా అంతే కష్టమని గిరిజనులు చెబుతున్నారు. బస్తా కాయలు కోశాక, వాటిని అడవి నుంచి తలపై మోసుకొని ఇంటికి తీసుకువస్తారు. ఇంటి వద్ద వీటిని ఓ గుంతలో వేసి రోకలితో కుమ్ముతారు. జిగురు జిగురుగా తెల్లని గుజ్జుతో కలసి పోయి ఉండే పిక్కలను ఓ తొట్టెలో వేసి, నీరు పోసి, పిక్కలు వేరు చేస్తారు. 

ఈ కాయలు ఎంతో చేదుగా ఉంటాయి. పిక్కలు వేరు చేసే పని పూర్తయిన తరువాత ఆ చేతితో భోజనం చేయడం కూడా కష్టంగా ఉంటుందని గిరిజనులు చెబుతారు. చేతికి అంటిన చేదు రెండు రోజుల వరకు పోదని అంటారు. ఇంతా కష్టపడితే బస్తా కాయల నుంచి ఒకటి లేదా రెండు కిలోల పిక్కలు మాత్రమే వస్తాయి. ఇలా రోజంతా కష్టపడితే రూ.200 మాత్రమే వస్తాయి. దీంతో, కూలీ గిట్టుబాటు కావడం లేదని ఆదివాసీలు వాపోతున్నారు. ముషిణి పిక్కల ధర పెంచాలని కోరుతున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement