రేషన్‌ డీలర్ల ఎంపిక ఆపండి | Stop the selection of ration dealers says High Court | Sakshi
Sakshi News home page

రేషన్‌ డీలర్ల ఎంపిక ఆపండి

Feb 1 2026 5:32 AM | Updated on Feb 1 2026 5:32 AM

Stop the selection of ration dealers says High Court

డీలర్ల ఎంపిక ప్రక్రియపై హైకోర్టు ధర్మాసనం కీలక తీర్పు 

కొత్త మార్గదర్శకాలు వచ్చే వరకు డీలర్ల ఎంపిక వద్దంటూ ఆదేశాలిచ్చినా అమలు చేయకపోవడంపై ఆక్షేపణ 

హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగానే ఎంపిక చేపట్టాలని ఆదేశం 

సాక్షి, అమరావతి: రేషన్‌ దుకాణాల డీలర్ల ఎంపిక విషయంలో హైకోర్టు ధర్మాసనం కీలక తీర్పునిచి్చంది. డీలర్ల ఎంపిక నిమిత్తం నిర్వహిస్తున్న ఇంటర్వ్యూకు రాత పరీక్షతో సమానంగా 50 మార్కులను నిర్ణయించడాన్ని తప్పుపట్టింది. కొత్త మార్గదర్శకాలు జారీ చేసేంత వరకు డీలర్ల ఎంపికను ఖరారు చేయవద్దంటూ గతంలోనే ఆదేశాలిచ్చినా ప్రభుత్వం అమలు చేయకపోవడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. 

ఇంటర్వ్యూలో 50 మార్కులను నిర్ధేశిస్తూ 2011లో జారీ చేసిన జీవో–4ను హైకోర్టు కొట్టేసినప్పటికీ ప్రభుత్వం 50 మార్కులతోనే ఎంపిక ప్రక్రియను కొనసాగించడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. ఇది కోర్టు ఆదేశాలను ధిక్కరించడమే అవుతుందని స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా జరిగిన డీలర్ల ఎంపిక ప్రక్రియ మొత్తం చట్టరీత్యా చెల్లదని తేల్చిచెప్పింది. 

హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా మార్కులను నిర్ణయించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రస్తుత కేసులో పిటిషన్‌ను కొట్టేస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేస్తున్నట్టు ధర్మాసనం తెలిపింది. హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా కొత్తగా ఎంపిక ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్‌ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం శుక్రవారం కీలక తీర్పునిచి్చంది. 

50 శాతం మార్కులపై పిటిషన్‌ 
విజయనగరం జిల్లా సాలూరులోని షాపు నంబర్‌–15కు రేషన్‌ డీలర్‌ నియామకం కోసం 2012 ఫిబ్రవరి 9న పార్వతీపురం ఆర్డీవో నోటిఫికేషన్‌ జారీ చేశారు. 50 మార్కుల రాత పరీక్ష, 50 మార్కుల ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుందని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. కోట నాగమణి అనే మహిళ 2012 ఫిబ్రవరి 26న జరిగిన రాతపరీక్షకు హాజరై 50కి 50 మార్కులు సాధించారు. 

అయితే.. ఇంటర్వ్యూలో అర్హత సాధించలేదు. దీంతో నాగమణి రేషన్‌ డీలర్‌ ఎంపిక ప్రక్రియలో భాగంగా ఇంటర్వ్యూకు 50 మార్కులను నిర్ధేశిస్తూ 2011లో ప్రభుత్వం జారీ చేసిన జీవో 4ను సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి ఈ పిటిషన్‌ను కొట్టేశారు. దీనిని సవాల్‌ చేస్తూ నాగమణి ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు అప్పీల్‌ దాఖలు చేశారు. 

దీనిని విచారించిన ధర్మాసనం తీర్పునిస్తూ.. సాధారణ పరిస్థితుల్లో అయితే పిటిషనర్‌ నాగమణి ఓసారి అవకాశం తీసుకున్న తర్వాత ఎంపిక ప్రక్రియను సవాల్‌ చేయలేరంది. అయితే, ఇంటర్వ్యూకు 50 మార్కుల విషయంలో కొత్త మార్గదర్శకాలు జారీ చేయాలని గతంలోనే హైకోర్టు ఆదేశించినా.. జీవో–4ను కొట్టేసినా అధికారులు డీలర్ల ఎంపిక ప్రక్రియ విషయంలో ముందుకెళ్లారని ఆక్షేపించింది. 

ఇది కోర్టు ఆదేశాలను ధిక్కరించడమే అవుతుందని తెలిపింది. కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా జరిగిన ఈ మొత్తం ఎంపిక ప్రక్రియ చట్టరీత్యా చెల్లదని తేల్చి చెప్పింది. కాబట్టి నాగమణి పిటిషన్‌ను కొట్టేస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేస్తున్నట్టు తెలిపింది. కొత్తగా ఎంపిక ప్రక్రియ ప్రారంభించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

Advertisement
 
Advertisement
Advertisement