పింఛన్లలో ‘కోత’లా..? | Pension cash deductions in the name of house tax and property tax arrears | Sakshi
Sakshi News home page

పింఛన్లలో ‘కోత’లా..?

Feb 1 2026 5:29 AM | Updated on Feb 1 2026 5:29 AM

Pension cash deductions in the name of house tax and property tax arrears

ఇంటి పన్ను, ఆస్తి పన్ను బకాయి పేరిట కోతలు 

ఇదేం చోద్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్న లబ్ది దారులు 

రాజానగరం: బోడి గుండుకు... మోకాలికి ముడి వేయడమంటే ఇదేనేమో..!! చంద్రబాబు సర్కారు వ్యవహరిస్తున్న తీరు అదే రీతిలో ఉంది. సర్కారు సాయం కోసం ఎదురు చూసే అభాగ్యులను కూడా చంద్రబాబు ప్రభుత్వం వదలడం లేదు. ఆస్తి పన్ను బకాయిల పేరిట ఎన్టీఆర్‌ భరోసా సామాజిక పింఛన్ల నగదులో కోత పెడుతున్నారు. లబ్ది దారులకు పింఛను సొమ్ము పూర్తిగా అందజేయకుండా పన్ను బకాయి మినహాయించుకుని మిగిలిన మొత్తం వారి చేతుల్లో పెడుతున్నారు. 

తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం కలవచర్ల గ్రామంలో శనివారం  పింఛన్ల పంపిణీ చేపట్టారు. ఈ క్రమంలో ఇంటి పన్ను బకాయిలున్న వారికి సిబ్బంది పూర్తి పింఛను చెల్లించలేదు. దీనిపై లబ్ది దారులు, స్థానికులు ప్రశ్నించడంతో పై అధికారులు చెప్పిన విధంగా తాము చేస్తున్నామని సిబ్బంది చెప్పారు. మరోవైపు గ్రామంలో ఒకచోట కూర్చుని లబ్ది దారులను తమ వద్దకు రప్పించుకుంటున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

పన్ను కడితేనే పింఛను ఇస్తామన్నారు 
ఇంటి పన్ను, కుళాయి పన్ను కడితేనే పింఛను ఇవ్వాలని ఆదేశాలు ఉన్నాయని  సిబ్బంది చెప్పారు. తమ డ్యూటీ తాము చేస్తున్నామని పింఛన్లు ఇచ్చిన వారు చెబుతున్నారు. నా దగ్గర ఇంటి పన్ను బకాయి పేరుతో రూ.270 మినహాయించి మిగిలిన పింఛను అందించారు.  – పి.దుర్గారావు, కలవచర్ల 

Advertisement
 
Advertisement
Advertisement