స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ హవా | YSRCP victory in by-elections held for several local bodies in AP | Sakshi
Sakshi News home page

స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ హవా

Dec 12 2025 4:26 AM | Updated on Dec 12 2025 4:26 AM

YSRCP victory in by-elections held for several local bodies in AP

బెడిసికొట్టిన టీడీపీ కుయుక్తులు 

కడప మేయర్‌ పదవి గెల్చుకున్న వైఎస్సార్‌సీపీ

మేయర్‌గా పాకా సురేష్‌ ఏకగ్రీవ ఎన్నిక 

పలు ఎంపీపీ స్థానాలు వైఎస్సార్‌సీపీ సొంతం 

పలు చోట్ల టీడీపీ దౌర్జన్యాలు.. సహకరించిన అధికారులు 

ఉమ్మడి చిత్తూరులో నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికలు

సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, కడప: రాష్ట్రంలోని పలు స్థానిక సంస్థలకు జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ హవాను చాటింది. అధికార తెలుగుదేశం పార్టీ కూటమి కుయు­క్తులు బెడిసికొట్టాయి. గురువారం జరిగిన ఉప ఎన్నికల్లో కడప మేయర్‌తో పాటు 4 ఎంపీపీ స్థానాలను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. అలాగే రెండు మండలాల్లో ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో రెండింటినీ వైఎస్సార్‌సీపీ గెల్చుకోవడం విశేషం. బాపట్ల జిల్లా వేమూరు, నంద్యాల జిల్లా దొర్నిపాడు, విజయనగరం జిల్లా మెరకముడియం, బొందపల్లి కోఆప్షన్‌ స్థానాలను వైఎస్సార్‌సీపీ గెల్చుకుంది. వరదాయపాలెం ఎంపీపీ ఎన్నిక కోర్టు స్టే కారణంగా వాయిదా పడింది. టీడీపీ కేవలం కళ్యాణదుర్గం మున్సిపల్‌ చైర్మన్‌ పదవితో సరిపెట్టుకుంది.  

కడపలో మరోమారు సత్తా చాటుకున్న వైఎస్సార్‌సీపీ  
కడప నగరపాలక సంస్థ మేయర్‌ను అనైతికంగా తొలగించిన చంద్రబాబు కూటమి సర్కారు.. మేయర్‌ పదవిని చేజిక్కించుకొనేందుకు నానా కుట్రలు పన్నింది. తెలుగుదేశం పార్టీ కుయుక్తులను వైఎస్సార్‌సీపీ తిప్పి కొట్టడంతో ఆ పదవి మరోమారు వైఎస్సార్‌సీపీ సొంతమైంది. కడప మేయర్‌గా 47వ డివిజన్‌ వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్‌ పాకా సురేష్‌ గురువారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కూటమి అధికారంలోకి వచ్చాక అధికార బలంతో, చట్టంలో ఉన్న లొసుగులను ఆసరా చేసుకొని కడప మేయర్‌గా ఉన్న సురేష్‌బాబును పదవి నుంచి తప్పించింది. దీంతో గురువారం ఎన్నిక జరిగింది. కడప కార్పొరేషన్‌లో 50 మంది కార్పొరేటర్లు ఉండగా, ఇద్దరు మృతి చెందారు. 

కడప మేయర్‌ పాకా సురేష్‌  

టీడీపీకి ఒకే కార్పొరేటర్‌ ఉన్నారు. మిగతా 47 మందిలో 8 మందిని టీడీపీ ప్రలోభాలకు గురి చేసి పార్టీలో చేర్చుకుంది. మిగతా 39 మంది కార్పొరేటర్లు వైఎస్సార్‌సీపీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి, మాజీ మంత్రి అంజద్‌ బాషా, మాజీ మేయర్‌ సురేష్‌బాబు కార్పొరేటర్లతో సమాలోచలు జరిపి, పాకా సురేష్‌ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. మెజార్టీ కార్పొరేటర్ల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకొని ఏకాభిప్రాయంతో వైఎస్సార్‌సీపీ మేయర్‌ అభ్యర్థిగా పాకా సురేష్‌ను ఎంపిక చేశారు. 

వైఎస్సార్‌సీపీకి చెందిన 39 మంది సభ్యులు పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా కార్పొరేషన్‌ కార్యాలయానికి చేరుకున్నారు. అంతా ఏకాభిప్రాయంతో ఉండటంతో టీడీపీ తోక ముడిచింది. డిప్యూటీ మేయర్‌ నిత్యానందరెడ్డి మేయర్‌గా పాకా సురేష్‌ అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించగా, కార్పొరేటర్‌ షఫీ బలపర్చారు. దీంతో సురేష్‌ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పీవో అదితిసింగ్‌ ప్రకటించారు. అనంతరం మేయర్‌ పాకా సురేష్‌ చేత కమిషనర్‌ మనోజ్‌రెడ్డి ప్రమాణం చేయించారు. 

ఏకగ్రీవంగా ఎంపీపీలు 
వైఎస్సార్‌ కడప జిల్లా ముద్దనూరు మండల ప్రజాపరిషత్‌ అ«ధ్యక్షురాలిగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వెన్నపూస పుష్పలత ఏకగ్రీవంగా ఎన్నుకయ్యారు. అలాగే అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె ఎంపీపీగా కోసువారిపల్లె వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ చిటికి శ్యామలమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తిరుపతి జిల్లా సత్యవేడు మండలం ఆంబాకం ఎంపీటీసీ సెగ్మెంట్‌ నుంచి వైస్‌ ఎంపీపీగా వైఎస్సార్‌సీపీకి చెందిన శరవణ ఎన్నికయ్యారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం ఎంపీపీ అధ్యక్షురాలిగా వైఎస్సార్‌సీపీకి అభ్యర్థి, బీసీ సామాజికవర్గానికి చెందిన జిత్తుక వెంకటలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్టీఆర్‌ జిల్లా విస్సన్నపేట ఎంపీపీగా వైఎస్సార్‌సీపీకి చెందిన ఎంపీటీసీ గద్దల మల్లయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 

నిండ్ర, విజయపురంలో దౌర్జన్యమే గెలిచింది 
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో జరిగిన రెండు ఎంపీపీ ఎన్నికల్లో అధికార పార్టీ దౌర్జన్యంగా వ్యవహరించింది. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలో మొత్తం 16 ఎంపీటీసీ స్థానాలను వైఎస్సార్‌సీపీ గెల్చుకుంది. ఎంపీపీ స్థానం ఎస్టీ మహిళకు రిజర్వ్‌ అయ్యింది. ఏర్పేడు ఎంపీపీ గీత రాజీనామా, ముసలిపేడు ఎంపీటీసీ రమణమ్మ మృతితో 14 మంది వైఎస్సార్‌సీపీ సభ్యులున్నారు. వీరిలో  పంగూరు ఎంపీటీసీ పి.ఆదిలక్ష్మి ఒక్కరే ఎస్టీ మహిళ కావడంతో ఆమెకే పదవి దక్కాలి. అయితే, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సు«దీర్‌రెడ్డి వైఎస్సార్‌సీపీకి చెందిన 9 మంది ఎంపీటీసీలను ప్రలోభాలకు, బెదిరింపులకు గురిచేసి ప్రత్యేక శిబిరంలో దాచారు. 

గురువారం ఉదయం 11 గంటలకు వారిని ఎంపీడీవో కార్యాలయానికి తీసుకొచ్చారు. వారు టీడీపీ కండువాలతో ఎన్నికలో పాల్గొన్నారు. పంగూరు ఎంపీటీసీ పి.ఆదిలక్ష్మిని స్వతంత్ర అభ్యర్థిగా పోటీలోకి దింపారు. దీంతో మిగిలిన 5 మంది వైఎస్సార్‌సీపీ సభ్యులు ప్రజాసామ్యాన్ని ఖూనీ చేశారంటూ ఎన్నిక ప్రక్రియను బహిష్కరించారు. మొత్తంగా స్వతంత్ర అభ్యర్థి పి.ఆదిలక్ష్మి ఎన్నికైనట్టు అధికారులు ప్రకటించారు. ఆ వెంటనే ఆమెకు ఎమ్మెల్యే సు«దీర్‌ రెడ్డి టీడీపీ కండువా కప్పడం గమనార్హం. 

చిత్తూరు జిల్లాలో.. 
చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలోని విజయపురం, నిండ్ర మండలాల ఎంపీపీ ఎన్నికలు పూర్తిగా అధికారబలంతోనే సాగాయి. రెండు మండలాల్లోను 8 ఎంపీటీసీ స్థానాలు చొప్పున ఉన్నాయి. ఎంపీపీగా గెలవాలంటే ఐదుగురి మద్దతు అవసరమౌతుంది. అధికార పార్టీ అంగబలం, అధికార బలం, దౌర్జన్యం ప్రదర్శించినా రెండు మండలాల్లోనూ నాలుగు ఓట్లు మాత్రమే సంపాదించగలిగింది. దీంతో అధికారులు లాటరీ పద్ధతి నిర్వహించారు. 

విజయపురంలో వైఎస్సార్‌సీపీ తరఫున మంజు బాలాజి, టీడీపీ తరఫున లక్ష్మీపతిరాజు పోటీచేశారు. నిండ్రలో వైఎస్సార్‌సీపీ తరఫున విజేష్‌, టీడీపీ మద్దతుతో ఇండిపెండెడెంట్‌ అభ్యర్థి భాస్కర్‌రెడ్డి పోటీ పడ్డారు. అధికారుల చేతివాటంతో లాటరీలో విజయపురంలో టీడీపీ అభ్యర్థి లక్ష్మీపతిరాజు, నిండ్రలో ఇండిపెండెంట్‌ అభ్యర్థి భాస్కర్‌రెడ్డి ఎంపీపీలుగా ఎంపికయ్యారు. 

నా పేరే వచ్చింది 
ఎన్నికల అనంతరం విజయపురంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మంజు బాలాజి మీడియాతో మాట్లాడుతూ.. అధికారులు పూర్తిగా పక్షపాత ధోరణిలో వ్యవహరించారని, డిప్‌లో తన పేరే వచ్చిందని, అధికారులు మాత్రం లక్ష్మీపతిరాజు గెలిచినట్లు చెప్పి వెళ్లిపోయారని తెలిపారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని, కోర్టుకు వెళతానని తెలిపారు.  

నిండ్ర, విజయపురంలో అధికారుల దుర్మార్గంపై కలెక్టర్‌కు ఫిర్యాదు 
నిండ్ర, విజయపురం ఎంపీపీ ఎన్నికల్లో రిటర్నింగ్‌ అధికారులు (ఆర్‌వోలు) కూటమి నేతల ఒత్తిళ్లతో నిబంధనలకు విరుద్ధంగా, ఏకపక్షంగా వ్యవహరించారని ఆయా మండలాల వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలు కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాం«దీకి గురువారం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఒకరు గెలిస్తే ఆర్‌వోలు మరొకరు గెలిచినట్లు ప్రకటించారన్నారు. ఎన్నికల నిబంధనలను ఏమాత్రం పాటించలేదన్నారు. 

ఎమ్మెల్యే పీఏలు ఎన్నికల కేంద్రాల్లోకి  ప్రవేశించారని, అభ్యర్థులను, ఎంపీటీసీలను మాత్రం లోనికి అనుమతించలేదని ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో పిల్లల చేత లాటరీ తీయించకూడదని, అయినా ఓ చిన్న పాపకు ముందుగా గుర్తులు చెప్పించి లాటరీ తీయించారని తెలిపారు. బహిరంగంగా నిర్వహించాల్సిన లాటరీ ప్రక్రియను గుట్టుగా చేశారని చెప్పారు. మరొక ఆర్‌వో ఒకే వ్యక్తి పేరును ఐదు చొప్పున రాసి లాటరీ తీశారని తెలిపారు. ఆర్‌వోలతో కలెక్టర్‌ ఫోన్‌లో మాట్లాడి, ఎంపీపీ ఎన్నికల వీడియోలను శుక్రవారం మధ్యాహ్నం లోగా పంపాలని ఆదేశించారు.  

బెదిరింపులకు బెదరని కళ్యాణదుర్గం కౌన్సిలర్లు 
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో అధికార టీడీపీ నేతల బెదిరింపులకు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు బెదరలేదు. కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డులుండగా 11 మంది వైఎస్సార్‌సీపీ, 11 మంది టీడీపీ సభ్యులు ఉన్నారు. వైఎస్సార్‌సీపీకి చెందిన ఆరుగురిని ఐదుగురిని టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ప్రలోభాలకు గురి చేసి ఆ పార్టీలోకి చేర్చుకున్నారు. మిగిలిన వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లను ఎమ్మెల్యే బెదిరింపులు, ప్రలోభాలకు గురిచేశారు. ఆస్తులున్నాయి జాగ్రత్త అంటూ ఫోన్లు చేసి భయపెట్టారు. అయినా వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు వెనక్కి తగ్గలేదు. చివరకు కూటమి ఎమ్మెల్యే, ఎంపీ ఎక్స్‌అఫీషియో సభ్యుల హోదాలో ఓట్లు వేయడంతో టీడీపీ గట్టెక్కింది. 

దొడ్డిదారిలో రామగిరి ఎంపీపీ స్థానం కైవసం 
శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో చంద్రబాబు కూటమి ప్రజాస్వామ్యాన్ని మంటగలిపింది. గురువారం జరిగిన ఎంపీపీ ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత కుంటిమద్ది వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యురాలు సాయిలీలను బెదిరింపులకు గురిచేసి, బలవంతంగా టీడీపీలోకి చేర్చుకుని.. ఆమెకే ఎంపీపీ పదవి అప్పగించారు. 

ఈ ఎన్నికల్లో 9 మంది సభ్యులకు గాను నలుగురే హాజరయ్యారు. మూడింట రెండు వంతుల మంది సభ్యులు ఉంటేనే ఎన్నిక నిర్వహించాలనే నిబంధనలను అధికారులు తుంగలో తొక్కారు. వచి్చన వారిలో పోటీ చేసిన అభ్యర్థికి మద్దతు ఇస్తే ఎన్నిక పూర్తవుతుందనే సరికొత్త నిబంధన తెచి్చ, ఎంపీపీ స్థానాన్ని టీడీపీ గెలుపొందింది. 

పోలీసుల అండతో మాచవరం ఎంపీపీ కైవసం 
పల్నాడు జిల్లా మాచవరం ఎంపీపీని కూడా టీడీపీ దౌర్జన్యంగా గెల్చుకుంది. టీడీపీకి తగిన బలం లేకపోయినా, పోలీసులతో వైఎస్సార్‌సీపీకి చెందిన ఎంపీటీసీ సభ్యులను బెదిరించారు.  వాస్తవంగా 15 ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీకి ఉన్న బలం నాలుగే. దీంతో గత రెండు రోజులుగా వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీల బంధువులను పోలీసులు స్టేషన్లకు పిలిపించి సభ్యుల వివరాలు తెలపాలని ఒత్తిడి తెచ్చారు. 

చెన్నాయపాలెం ఎంపీటీసీ లక్ష్మిబాయి బంధువు బాలు నాయక్‌ను దాచేపల్లి సీఐ భాస్కరరావు పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లి బెదిరించినట్లు బంధువులు ఆరోపించారు. దీంతో బాలు నాయక్‌ తన బంధువైన ఎంపీటీసీ లక్ష్మీబాయి మద్దతు టీడీపీకి ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. పిల్లుట్ల –1 ఎంపీటీసీ మంగమ్మ బాయినీ అలాగే బెదిరించి తమ వైపు తిప్పుకున్నారు. మరికొందరిని కూడా బెదిరింపులకు గురి చేసి, టీడీపీ అభ్యర్థి కొక్కెర అంజమ్మను గెలిపించుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement