ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు శిక్ష
గుంటూరు లీగల్: ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు శిక్ష విధిస్తూ జిల్లా ఒకటవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు తీర్పు చెప్పారు. గుంటూరు ఆర్టీసీ బస్టాండ్‌లో 2019 జనవరి 6న జరిగిన ప్రమాదంలో వృద్ధుడు మోతుకూరి కోటేశ్వరరావు (70) మృతి చెందాడు. ఈ కేసులో నిందితుడైన ఆర్టీసీ బస్సు డ్రైవర్ కమ్మిలి వెంకట శివనారాయణకు గుంటూరు జిల్లా ఒకటవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు జడ్జి సంవత్సరం జైలుశిక్ష, రూ. 5వేలు జరిమానా విధిస్తూ గురువారం తీర్పు వెలువరించారు. డ్రైవర్ వేగంగా, నిర్లక్ష్యంగా, హారన్ కొట్టకుండా బస్సును నడిపి వెనుక నుంచి వృద్ధుడిని ఢీకొట్టాడు. బస్సు వెనుక చక్రం కింద పడి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటనపై అదే రోజు మధ్యాహ్నం ఈస్ట్ ట్రాఫిక్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మృతుని తరఫున వాదనలు వినిపించారు.
తాడికొండ: లారీ, ఆటో ఎదురెదురుగా ఢీకొని క్వారీ గుంతలోకి దూసుకెళ్లడంతో మహిళ మృతి చెందిన ఘటన తాడికొండ మండలం లాం గ్రామంలో జరిగింది. వివరాల ప్రకారం.. జొన్నలగడ్డ వైపు నుంచి ధాన్యం లోడు దించి మితిమీరిన వేగంతో వస్తున్న లారీ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టడంతో క్వారీ గుంతలోకి దూసుకెళ్లింది. అందులో ప్రయాణిస్తున్న జొన్నలగడ్డ గ్రామానికి చెందిన ఇక్కుర్తి ఉమాదేవి (50) నలిగిపోయి మృతి చెందింది. ఆటో డ్రైవర్‌తో పాటు మరో నలుగురికి తీవ్ర గాయాలు కావడంతో మరో ఆటోలో గుంటూరు ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న సీఐ కె. వాసు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. వీఆర్వో మధు, కార్యదర్శి అరుణ్ కుమార్ సిబ్బంది, స్థానికుల సాయంతో రెండు జేసీబీలతో లారీ, ఆటోలను క్వారీ గుంతలో నుంచి బయటకు తీశారు. అప్పటికే మహిళ ఆటోలో నలిగిపోయి మృతి చెందింది. లారీ డ్రైవర్ ఘటనా స్థలం నుంచి పరారీ కాగా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. మృతురాలి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. రోడ్డు పక్కనే ప్రమాదకర లోతులో ఉన్న క్వారీయింగ్ గుంతలు ప్రమాదకరంగా తయారయ్యాయి. సంబంధిత అధికారులు స్పందించి ఫెన్సింగ్ వేయించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
గుంటూరు వెస్ట్: ప్రత్తిపాడు మండలంలో గొట్టిపాడు–ఏబీ పాలెం రహదారికి ప్రభుత్వం రూ.2.17 కోట్లు మంజూరు చేసిందని జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీ గ్రామీణ రోడ్ల బలోపేత ప్రాజెక్టు గ్రాంట్ క్రింద 3.828 కిలో మీటర్ల మేర గొట్టిపాడు – ఏబీ పాలెం రహదారి బలోపేత చేయుటకు రూ.2.17 కోట్లు మంజూరు అయిందని చెప్పారు. ఈ రహదారి నిర్మాణం చేపట్టాలని సంబంధిత గ్రామ ప్రజలు అనేక సార్లు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్) లో వినతులు సమర్పించారన్నారు.
ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు శిక్ష


