అక్రమ అరెస్టులు చేసేందుకే పోలీసులా?
రాజకీయ కక్ష సాధింపు చర్యలకే పరిమితమైన పోలీసులు
పిన్నెల్లి సోదరులకు సంఘీభావం తెలిపే హక్కు లేదా?
మీడియా సమావేశంలో వైఎస్సార్ సీపీ జిల్లా, నగర అధ్యక్షులు అంబటి రాంబాబు, నూరి ఫాతిమా
గుంటూరు ఎడ్యుకేషన్: రాష్ట్రంలో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను అక్రమ అరెస్టులు చేసేందుకే పోలీసులు యంత్రాంగం పని చేస్తోందని వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకే పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం గుంటూరులోని అంబటి రాంబాబు కార్యాలయంలో వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షురాలు షేక్ నూరిఫాతిమా, తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాల వజ్రబాబుతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
అంబటి రాంబాబు మాట్లాడుతూ.. మాచర్లలో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి సుప్రీంకోర్టు ఆదేశాలతో మాచర్ల కోర్టులో లొంగిపోయేందుకు వెళుతుండగా గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని వైఎస్సార్ సీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేశారని చెప్పారు. కోర్టులో లొంగిపోయేందుకు వెళుతున్న మాజీ ఎమ్మెల్యేకు సంఘీభావంగా వెళ్లి, పరామర్శించే హక్కు తమకు లేదా అని ప్రశ్నించారు. పోలీసు వ్యవస్థ మొత్తం వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలను అరెస్టులు చేసేందుకే పని చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగసారా కాస్తున్న వారిని, గంజాయి విక్రయించేవారిని పట్టుకునే ఉద్దేశం లేదన్నారు. నేరాలను అరికట్టి, శాంతిభద్రతలను పరిరక్షించడం కంటే వైఎస్సార్ సీపీ నేతల అరెస్టులపైనే పోలీసులు దృష్టి పెడుతున్నారని దుయ్యబట్టారు. గతంలో చంద్రబాబును అరెస్టు చేసిన సమయంలో పవన్ కళ్యాణ్ హడావుడిగా వచ్చారని, 144 సెక్షన్‌తో పాటు యాక్ట్ 30 అమల్లో ఉందని పోలీసులు నోటీసు ఇస్తే రోడ్డుపై పడుకుని గందరగోళం చేశారని చెప్పారు. అంతే కాకుండా ఇది ప్రజాస్వామ్యమా? పోలీసులు ఈ విధంగా అడ్డుకుంటారా? అని పెద్ద ఎత్తున గొడవ చేశారని అన్నారు. మాజీ ఎమ్మెల్యే కోర్టుకు హాజరవుతుండగా, గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని నియోజకవర్గ సమన్వయకర్తలను మాచర్ల వెళ్లనీయకుండా ఉదయమే హౌస్ అరెస్టులు చేసి అడ్డగించారని గుర్తుచేశారు. దీనిపై పవన్ కళ్యాణ్ ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. వారికో న్యాయం... తమకో న్యాయమా అని అన్నారు.
వర్గాల మధ్య కొట్లాటలే కారణం
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిపై మోపిన హత్యానేరం పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగమేనని అంబటి స్పష్టం చేశారు. టీడీపీలోని రెండు వర్గాల మధ్య నెలకొన్న కొట్లాటలతోనే జంట హత్యలు జరగాయని, ఈ విషయాన్ని నాడు హత్యలు జరిగిన రోజున సంఘటనాస్థలానికి వచ్చిన అప్పటి పల్నాడు ఎస్పీ స్వయంగా చెప్పారని అన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎలాగైనా కేసులో ఇరికించాలని మాచర్ల టీడీపీ ఎమ్మెల్యేతోపాటు చంద్రబాబు, లోకేష్ ప్రోద్బలంతో నిందితులుగా చేర్చారని ఆరోపించారు. దీనిపై హైకోర్టుకు వెళ్లి, అక్కడ బెయిల్ తెచ్చుకున్నారని అన్నారు. బెయిల్ రద్దు కోవడంతో కోర్టులో హాజరుకావాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను గౌరవించి పిన్నెల్లి సోదరులు గురువారం మాచర్ల కోర్టులో లొంగిపోయేందుకు వెళ్లారని చెప్పారు. దీనిపై ప్రభుత్వం పోలీసు యంత్రాగాన్ని ఉపయోగించి ఎందుకు రాద్ధాంతం చేయాలని అని ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలో లోకేష్ రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం ఇంత నీచస్థితికి దిగజారాలా అని అన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న వైసీపీ నేతలను అక్రమ అరెస్టులు చేసి జైళ్లకు పంపుతున్నారని, ప్రజల కోసం ఎన్ని కేసులనైనా ఎదుర్కొంటామని, చంద్రబాబు ప్రభుత్వంపై పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. టీడీపీ రాజ్యంలో వైసీపీ నేతలను అజ్ఞాతంలోకి పంపుతున్నారని, తరువాత అధికారంలో వచ్చాక వారి సంగతి తేలుస్తామని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వంలో ఎన్నో లొసుగులు ఉన్నాయని, దందాలు, దోపిడీలతో అక్రమ సంపాదనతో టీడీపీ నేతలు విచ్చలవిడిగా దోచుకుంటున్నారని అన్నారు. రాష్ట్రలో 18 నెలల క్రితం కూటమి ప్రభుత్వం అధికారంలోకి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని చెప్పారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణలో కోటి మందికి పైగా ప్రజలు స్పందించి వ్యతిరేకతను స్పష్టం చేశారని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో 60వేలకు పైగా సంతకాలు సేకరణ జరిగిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.
ప్రజాస్వామ్యంలో ఉన్నామా ?.
వైసీపీ నగర అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా మాట్లాడుతూ కూటమి పాలనలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు. ఇండిగో విషయంలో టీడీపీకి చెందిన కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడుపై దేశ వ్యాప్తంగా దుమ్మెత్తి పోస్తున్న పరిస్థితులను డైవర్ట్ చేసేందుకు వైసీపీ నేతలను హౌస్ అరెస్టులు చేయిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు సర్కారు తప్పులన్నింటికీ రానున్న కాలంలో వడ్డీ సహా చెల్లిస్తామని స్పష్టం చేశారు. 2029లో ప్రజలు టీడీపీకి గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. సమావేశంలో మిర్చియార్డు మాజీ చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ తదితరులు పాల్గొన్నారు.


