
వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సరికొత్త ప్రయోగానికి తెరతీశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అరాచకాలు, ప్రత్యేకించి పోలీసుల ఆగడాలను ఎదుర్కొనేందుకు పార్టీ తరఫున ప్రత్యేక యాప్ తయారీకి సిద్ధమయ్యారు. పార్టీ కార్యకర్తలు, నేతలు ఈ యాప్ సాయంతో తమపై జరుగుతున్న అకృత్యాలను, ఇబ్బంది పెడుతున్న పోలీసు, ఇతర శాఖల అధికారుల గురించి చెప్పుకోవచ్చు. వారికి జరిగిన అన్యాయానికి సంబంధించిన ఆధారాలు కూడా అందులో అప్‌లోడ్ చేయవచ్చు. ఈ ఫిర్యాదులన్నీ పార్టీ డిజిటల్ లైబ్రరీ సర్వర్‌లో భద్రంగా ఉంటాయి.
2029 శాసనసభ ఎన్నికలలో వైఎస్సార్సీపీ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే ఆ ఫిర్యాదుల ఆధారంగా ఆయా అధికారులపై చట్టపరంగా చర్య తీసుకుంటామని జగన్ విస్పష్టంగా ప్రకటించారు. ఇటీవల నిర్వహించిన రాజకీయ సలహా మండలి సమావేశంలో జగన్ ఈ యాప్ గురించి తెలిపారు. అయితే.. ఆ పార్టీ కార్యకర్తలు, నేతలపై జరుగుతున్న దౌర్జన్యాలు, దాష్టికాలు, మోపుతున్న తప్పుడు కేసులను ఎదుర్కొనేందుకు ఇప్పటివరకూ లీగల్‌సాయం మాత్రం అందిస్తోంది. కార్యకర్తల కుటుంబాలను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటోంది. బాధిత కుటుంబాలకు జగన్ స్వయంగా భరోసానిస్తున్నారు. జైల్లో ఉన్న నేతలను స్వయంగా వెళ్లి పరామర్శిస్తున్నారు.
నిన్నటికి నిన్న.. నెల్లూరు వెళ్లినప్పుడు.. అంతకుముందు పొదిలి, సత్తెనపల్లి తదితర ప్రాంతాలకు వెళ్లినప్పుడు కూడా పోలీసులు రకరకాల ఆంక్షలు, నిర్బంధాలు పెట్టిన విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. ఇకపై ఇలాంటి ఇబ్బందులు ఎదురైతే వాటిని నేరుగా యాప్‌లోనే నమోదు చేసుకునే అవకాశం వస్తుందని అంచనా. తద్వారా ఇలాంటి ఘటనలన్ని సమగ్రంగా అందుబాటులో ఉంటాయన్నమాట.
టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీలో హింస విచ్చలవిడిగా జరుగుతోంది. అధికార పార్టీ నేతలే గూండాయిజానికి బరి తెగిస్తున్నారు. పోలీసులు కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నేతల ఫిర్యాదులు తీసుకోవడానికి కూడా నిరాకరిస్తున్నారు. ఒకవేళ పిర్యాదు తీసుకున్నా కేసులు కట్టడం, కూటమి నేతలు ముఖ్యంగా టీడీపీ వారిపై చర్యలు తీసుకోవడం లేదన్నది వైఎస్సార్‌సీపీ ఆవేదన.
తన కుటుంబంపై అసభ్యకర పోస్టింగ్‌లు పెట్టిన వారి మీద మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫిర్యాదు చేస్తే పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించారు. అయితే ఆయన పట్టువదలని విక్రమార్కుడు మాదిరి పోరాడితే కొన్నింటిని నమోదు చేశారు. అదే టీడీపీ ఫిర్యాదులకు మాత్రం వాయు వేగంతో స్పందిస్తున్నట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని తాడిపత్రి వెళ్లనివ్వకుండా మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డి అడ్డుపడుతుంటే, కట్టడి చేయాల్సిన పోలీసులు పట్టించుకోవడం మానేశారు. తాడిపత్రి వెళ్లవద్దని పెద్దారెడ్డికి చెబుతూ అడ్డుకుంటున్నారు. కోర్టు ఆదేశాలు కూడా ఖాతరు చేయడం లేదు. మాచర్ల మాజీ మున్సిపల్ ఛైర్మన్ తురగా కిషోర్‌పై పలు కేసులు పెట్టి ఏడు నెలలుగా వేధిస్తూనే ఉన్నారు. పద్నాలుగు కేసులలో బెయిల్ తీసుకుని బయటకు వస్తే మళ్లీ కొత్త కేసు పెట్టి తీసుకుపోయారు. ఇదేమి ప్రభుత్వం అంటూ కిషోర్ భార్య రోదించినా కూటమి సర్కార్‌కు కనికరం కలగలేదు. సోషల్ మీడియా కార్యకర్తలు అనేక మంది ఏపీ పోలీసుల నుంచి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కున్నారు.

ఒక కార్యకర్త పోలీసులు తన చేతులకు ఎలా బేడీలు వేసి, కాళ్లకు గొలుసులు కట్టి వందల కిలోమీటర్లు తిప్పింది ఫేస్‌బుక్‌లో వివరిస్తే, అది చదివిన వారి కళ్లు చెమర్చాయి. తప్పు చేస్తే పోలీసులు ఎవరిపైనైనా కేసులు పెట్టవచ్చు. కాని అచ్చంగా టీడీపీ వారి కోసమే పోలీసు వ్యవస్థ అన్నట్లు పని చేయడమే దుర్మార్గం.
రాజకీయ సలహామండలి సమావేశంలో జగన్ మద్యం కేసును కూడా ప్రస్తావించి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి వంటి వారిని కూడా అక్రమంగా జైలులో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా ఒకటికాదు.. అనేక కేసులలో వైఎస్సార్‌సీపీ కేడర్‌ను, నేతలను వేధిస్తున్న పోలీసు అధికారుల గురించి యాప్‌లో ప్రస్తావించే అవకాశం ఉండవచ్చు. ఈ యాప్ తెస్తున్నారని తెలిసిన తర్వాత వైఎస్సార్‌సీపీ శ్రేణులకు ఒక విధమైన నమ్మకం కలిగింది. ఈ యాప్ పనిచేయడం ఆరంభిస్తే మరీ అతిగా వ్యవహరిస్తున్న పోలీసు అధికారులు కూడా కొంత నిగ్రహం పాటించవచ్చునన్న భావన ఏర్పడుతోంది.
పోలీసులు అందరూ ఇలా ఉన్నారని కాదుకాని కొందరు మరీ దారుణంగా వ్యవహరిస్తున్నారన్నది వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు. అలాంటి వారి వివరాలు యాప్‌లో నమోదు చేస్తే అప్పుడు సంబంధిత అధికారులు కాస్త జాగ్రత్తగా మసులుకునే అవకాశం ఉండవచ్చు. అదే సమయంలో యాప్‌లో ఫిర్యాదు చేస్తారా అని టీడీపీ వీర విధేయ పోలీసు అధికారులు ఎవరైనా మరింత రెచ్చిపోతారా? అన్నది కూడా చూడాలి. వైఎస్సార్‌సీపీ యాప్ విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, మంత్రి లోకేశ్‌లు ఎలా స్పందిస్తారన్నది చెప్పలేం.

2029లో కూటమి అధికారం కోల్పోయి వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే వారు కూడా ఇవే తరహా కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందన్న స్పృహ లేకుండా ప్రవర్తిస్తున్నారు అన్నది ఎక్కువ మంది విశ్లేషణ. ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు కూడా ఈ మధ్యకాలంలో తీవ్రంగానే స్పందిస్తోంది. తాజాగా ఒక హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణ సందర్భంగా గౌరవ న్యాయమూర్తులు స్పందిస్తూ తప్పుడు కేసులతో ఎలా వేధిస్తారో తమకు కూడా బాగా తెలుసునని, పోలీసులకు కౌన్సిలింగ్ ఇవ్వవలసిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.
ఇటీవలి కాలంలో పోలీసు వర్గాలలో కొంత మార్పు వచ్చినట్లు కనబడుతున్నా, పైనుంచి వచ్చే ఒత్తిడిని భరించలేక కొందరు అధికారులు వైసీపీ వారిపై వేధింపుల పర్వం కొనసాగిస్తున్నారని చెబుతున్నారు. చట్టం ప్రకారం వ్యవహరిస్తే ఫర్వాలేదు. అలాకాకుండా ఇష్టం వచ్చినట్లు కేసులు పెట్టి వైఎస్సార్‌సీపీ మద్దతుదారులను వేధిస్తే, తర్వాత కాలంలో వారు కూడా ఇబ్బంది పడతారని చెప్పడానికి ఈ యాప్ ఉపయోగపడవచ్చు. అంతేకాక వీరి ప్రవర్తనకు సంబంధించి వైఎస్సార్‌సీపీ యాప్‌లో నమోదైతే ఆ అధికారులకు కూడా అప్రతిష్టే. ఏది ఏమైనా ఎర్రబుక్ పేరుతో టీడీపీ నేతలు, కేడర్ చేస్తున్న అరాచకాలకు ఈ యాప్ గట్టి జవాబు ఇవ్వవచ్చని వైఎస్సార్‌సీపీ భావిస్తోంది. ఇకనైనా ఏపీలో పరిస్థితులు మారతాయా? చూద్దాం!

:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.