
సాక్షి, పార్వతీపురం మన్యం: సూపర్ సిక్స్ అంటూ బోలెడన్ని ఎన్నికల హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం(Kutami Prabhutvam).. వాటిని ఎగ్గొట్టే ప్రయత్నంలో డైవర్షన్ పాలిటిక్స్‌కు తెర తీస్తోంది. అయితే జనాలు మాత్రం ఆ కుట్రలను పసిగడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో.. జనసేన ఎమ్మెల్యే ఒకరు అసంతృప్తితో ఉండడం తీవ్ర చర్చనీయాంశమైంది.
అన్నదాత సుఖీభవ పథకం(annadata sukhibhava)పై టీడీపీ మాజీ నేత, పాలకొండ జనసేన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ అసంతృప్తి వ్యాఖ్యలు చేశారు. గత వైఎస్సార్‌సీపీ హయాంలో రైతు భరోసా అందిన రైతులకు.. ఇప్పుడు అన్నదాత సుఖీభవ జమ కావడం లేదని అంటున్నారు. ఈ క్రమంలో.. వండవ గ్రామంలో 600 మంది రైతులకు నగదు జమ కాకపోవడాన్ని ప్రమఖంగా ప్రస్తావించారు.

‘‘అన్నదాత సుఖీభవపై అధికారులకు ఫిర్యాదు చేశాం. పరిష్కరిస్తారేమో చూడాలి. న్యాయం జరగకపోతే సీఎం దృష్టికి, వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకు వెళ్తా. వాళ్లకు న్యాయం జరిగే దాకా పోరాడతా’’ అని నిమ్మక అన్నారు.
ఏడాదిన్నర దాటినా కూటమి పాలనలో సంక్షేమం ఊసే లేకుండా పోయింది. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ పథకాల అమలు అలసత్వం, వాటిలో కొన్నింటిని ఎగవేయడంపై వైఎస్సార్‌సీపీ ప్రజా పోరాటాలు చేస్తోంది. అదే సమయంలో కూటమి నేతలే ఇలా బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తుండడం గమనార్హం.
ఇదీ చదవండి: బాబూ.. ఇంటింటా దీపాల వెలుగు ఎక్కడ?