
సాక్షి, తాడేపల్లి: ‘‘వైఎస్సార్‌సీపీకి 18 నుంచి 20 లక్షల మంది క్షేత్రస్థాయి క్రియాశీల నాయకత్వం ఉంది.. పార్టీ సంస్థాగత నిర్మాణంపై వైఎస్ జగన్ ఆలోచనలు, బ్లూ ప్రింట్‌ను మనం అమలు చేయాలి’’ అని వైఎస్సార్‌సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాలన్నీ చిత్తశుద్ధిగా పనిచేయాలన్నారు. ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం.. అనుబంధ విభాగాల అధ్యక్షుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శులు లేళ్ళ అప్పిరెడ్డి, ఆలూరు సాంబశివారెడ్డి సహా ఇతర నాయకులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ‘‘మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల ఏపీలోని అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురిచేసేలా చంద్రబాబు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనిపై ప్రజల్లో విస్తృతంగా చర్చ జరగాలి, ఈ దుర్మార్గాలను ఆపగలగాలి. ఇందులో భాగంగా మనం రచ్చబండ, కోటి సంతకాల సేకరణ కార్యక్రమాలు చేస్తున్నాం. పార్టీ అనుబంధ విభాగాలు అన్నీ దీనిపై చిత్తశుద్దిగా పనిచేయాలి. పార్టీ సంస్ధాగత నిర్మాణంలో ప్రధానంగా అనుబంధ విభాగాలు పటిష్టంగా ఉండాలని వైఎస్ జగన్ ఆలోచించి అందుకు అనుగుణంగా స్ట్రక్చర్ నిర్మించారు

..క్షేత్రస్థాయిలో కూడా మన అనుబంధ విభాగాలు ఫోకస్డ్‌గా పనిచేయాలి. ప్రధానంగా 7 అనుబంధ విభాగాలు కీలకపాత్ర పోషించాలి. పార్టీ లైన్‌ను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి అనుబంధ విభాగాలదే ప్రధాన పాత్ర. మన సొసైటీకి ఎలా మంచి చేయాలని తపన పడే నాయకుడు జగన్. మనం ఎక్కడా అబద్దాలు చెప్పాల్సిన అవసరం లేదు. మన పార్టీకి కోట్లాది మంది సైన్యం సిద్ధంగా ఉంది. అందరినీ సంఘటితం చేయాలన్న ప్రయత్నంలో భాగంగా ఈ కసరత్తు చేస్తున్నాం. మనం ఇప్పటికే మండల స్ధాయి కమిటీలలో ఉన్నాం. ఇక గ్రామస్థాయికి వెళ్ళబోతున్నాం. డేటా ప్రొఫైలింగ్ చేస్తూ ముందుకెళుతున్నాం. దీనిపై అందరూ సీరియస్‌గా దృష్టిపెట్టాలి.
..వైఎస్సార్‌సీపీ అంటే 18 నుంచి 20 లక్షల క్రియాశీల క్షేత్రస్థాయి నాయకత్వం ఉంటుంది. వీరందరి డేటా ప్రొఫైలింగ్‌ను మనం సరిగా నమోదు చేయగలిగినప్పుడే మనం అనుకున్న ఫలితాలను అందుకోగలుగుతాం. అందుకు అందరూ సిద్ధంగా ఉండాలి, ఈ ప్రక్రియకు అవసరమైన సపోర్ట్ సిస్టమ్‌ను మనం అందుబాటులోకి తెచ్చుకోవాలి. అన్ని విభాగాల మధ్య సమన్వయం చేసుకోవాలి. పార్టీ అనుబంధ విభాగాల కమిటీల నిర్మాణంలో అలసత్వం వద్దు. ఉత్సాహం, తపన, బాధ్యతతో పనిచేయాలని ముందుకొచ్చేవారిని గుర్తించి వారికి కమిటీలలో ప్రాధాన్యతనివ్వాలి.
..ఏపీలో నకిలీ మద్యం ఏరులై పారుతుంది. వైఎస్ జగన్ హయాంలో డెలివరీ సిస్టమ్, డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ చక్కగా ఏర్పాటు చేసి ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేస్తే చంద్రబాబు మాత్రం రివర్స్ పాలన సాగిస్తున్నారు. గతంలో బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని చక్కగా చేశాం. ఇప్పుడు జరుగుతున్న రచ్చబండ, కోటి సంతకాల సేకరణ కార్యక్రమాలతో పాటు కమిటీల నియామకాలు కూడా పూర్తి చేద్దాం. కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో అనుబంధ విభాగాలు క్రియాశీలకంగా ఉండాలి. పార్టీ కేంద్ర కార్యాలయంతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలి’’ అని సజ్జల పేర్కొన్నారు.