
సాక్షి,తాడేపల్లి :సీఎం చంద్రబాబుపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సెటైర్లు వేశారు. ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం దొరకగానే జోగి రమేష్ వెళ్లి ఇది నారావారి సారా అని మాట్లాడారు. దీంతో అతనిపై కక్ష కట్టి ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేశారు.
జోగి రమేష్ ఉన్నట్టు జనార్థన్‌రావుతో చందమామ కథ అల్లించారు.అందుకే ఎప్పటికీ చంద్రబాబుకు మంచి బుద్ధిరాదని అర్ధమైందని వ్యాఖ్యానించారు. మంగళవారం (అక్టోబర్14) వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో కేతిరెడ్డి మీడియాతో మాట్లాడారు. నకిలీ మద్యం కేసును సీబిఐకి అప్పగించాలి. చంద్రబాబుకు మంచి బుద్ది ఎప్పటికీ రాదని అర్ధమైంది.
లైడిటెక్టర్ పరీక్షకు జోగి రమేష్ సిద్దమని సవాల్ చేసినా స్పందన లేదు. రెండున్నర నెలల నుండి నకిలీ మద్యం తయారు చేస్తున్నట్టు ఎక్సైజ్ అధికారులే చెప్పారు. కానీ రెండు మూడేళ్లుగా తయారవుతున్నట్టు చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారు. ఈ ప్రభుత్వం మీద మా వాళ్లు ఒక్క పోస్టు పెడితేనే కేసులు పెడుతున్నారు. ఒక్క ఫ్లెక్సీ కట్టాలన్నా బెదిరిస్తున్నారు. అలాంటిది మా వాళ్లు ఏకంగా నకిలీ మద్యం కుటీర పరిశ్రమను పెట్టగలరా?
నకిలీ మద్యం వెనుక ప్రభుత్వ పెద్దలే ఉన్నారు.అందుకే కేసు విచారణ సక్రమంగా జరగడం లేదు. ఆ కేసును మిగతా పార్టీల మీదకే రుద్దుతే టీడీపీకే నష్టం. మా హయాంలో 30 వేల మంది చనిపోయారని ఆరోపించారు. దానికి తగిన ఆధారాలు, పోస్టుమార్టం రిపోర్టులు చూపించగలరా?. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సీబిఐతో విచారణ జరపాల్సిందే. ఇంత పెద్ద ఎత్తున నకిలీ మద్యం దొరికితే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు?.ఆయన బయటకు వచ్చి ఎందుకు మాట్లాడటం లేదు?. చంద్రబాబు చేసేది బురద చల్లుడు రాజకీయమే. కట్టుకథలతో ఎన్టీఆర్‌కే వెన్నుపోటు పొడిశారు.
కస్టడిలో ఉన్న జనార్ధన్ వీడియో ఎలా బయటకు వచ్చింది?. ఎవరు రికార్డు చేశారు?.సిట్ విచారణ చేస్తుందా? వీడియో లీకులు ఇస్తుందా?. ఎంపీ మిథున్‌రెడ్డితోపాటు కీలక నేతల మీద వేధింపులు ఊహించిందే. ఒక్కొక్కరి మీద పది కేసులైనా పెడతారు.అన్నిటినీ ఎదుర్కోవటానికి మేము సిద్దంగానే ఉన్నాం’అని స్పష్టం చేశారు.
