
ఈ సర్కారుపై ప్రజలకు భ్రమలు పూర్తిగా తొలగిపోయాయి: మాజీ సీఎం వైఎస్ జగన్
ఏది చూసినా దోపిడీయే.. వ్యవస్థలన్నీ నిర్వీర్యం.. విద్య, వైద్యం, వ్యవసాయం అస్తవ్యస్థం
ఉద్యోగులకు బాబు దగా
సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి సర్కారు వ్యవహరిస్తున్న తీరు, కళ్లార్పకుండా ఆడుతున్న అబద్ధాలు, ఏమాత్రం జంకూ బొంకూ లేకుండా పొడుస్తున్న వెన్నుపోట్లు చూసి ప్రజలకు భ్రమలు పూర్తిగా తొలగిపోయాయని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులతో నిర్వహించిన సమావేశంలో పలు అంశాలపై వైఎస్ జగన్ మాట్లాడారు.
ముఖ్యమంత్రి ఎందుకు ఉన్నారు?
ఈ రోజు వ్యవస్థలన్నీ పూర్తిగా నిర్వీర్యమైపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎలా పని చేస్తోందని ఒకసారి సామాన్యుడిగా ఆలోచిస్తే.. అసలు పాలన మీద ధ్యాస లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు ఉన్నారు? ఈ రోజు ఎంత ఆదాయం వచ్చింది? రేపటికి ఇంకా ఎంత పెంచుకోవాలి? సొంత ఆదాయాలు ఎలా పెంచుకోవాలి? అన్న వాటిపైనే వారికి ధ్యాస. ఈరోజు ఎక్కడ చూసినా అవినీతి, అరాచకమే. రాష్ట్ర ఆదాయాలు తగ్గుతున్నాయి.
అది పక్కదారి పట్టి.. చంద్రబాబు, ఆయన కుమారుడు, బినామీలు, ఆయన మనుషుల జేబుల్లోకి పోతోంది. దోచుకో పంచుకో తినుకో (డీపీటీ) అన్నది ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఏది చూసినా దోపిడీయే. ఇసుక చూస్తే మన హయాంలో కన్నా రెండింతలు ఎక్కువ రేటుకు అమ్ముతున్నారు. కానీ రాష్ట్ర ఖజానాకు డబ్బులు రావడం లేదు. మట్టి, క్వార్ట్జ్, సిలికా, లేటరైట్.. ఏదైనా అంతే. మద్యం అన్నది ఏ స్థాయిలోకి వెళ్లిపోయిందో మనం చూస్తున్నాం.
ప్రతి నియోజకవర్గంలో పేకాట క్లబ్బులు కనిపిస్తున్నాయి. తమకు సంబంధించిన వారికి పావలా, అర్ధ రూపాయి, రూపాయికి భూములు పంచి పెడుతున్నారు. మన హయాంలో.. ప్రజలకు, రైతులకు మంచి జరగాలి.. మరో 30 ఏళ్లు ప్రభుత్వంపై భారం పడకూడదని యూనిట్‌ని రూ.2.49 చొప్పున విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుంటే నానా యాగీ చేసిన వారు ఈరోజు యూనిట్ ఏకంగా రూ.4.60 చొప్పున పీపీఏ చేసుకుంటున్నారు. డబ్బుల కోసం వీళ్లు ఏ స్థాయికి దిగజారారనేది చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది.
మోసాలుగా మారిన హామీలు..
మరోవైపు చూస్తే చంద్రబాబు ష్యూరిటీ పోయి మోసం గ్యారెంటీ అయ్యింది. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ల పేరుతో ఎన్నికలకు ముందు ఈనాడులో ఆయనిచ్చిన యాడ్స్ ఇప్పటికే చాలాసార్లు చూపించా. మొన్న అనంతపురంలో విజయోత్సవ సభ నిర్వహించి అన్నీ చేసేశామని చెబుతూ ఇచ్చిన యాడ్స్ కూడా చూపించా. ఆ హామీలు ఎలా మోసాలుగా మారిపోయాయో వివరించా. ఆడబిడ్డ నిధి పేరుతో ప్రతి మహిళకు ఏటా రూ.18 వేల చొప్పున ఇస్తామని ఎన్నికలకు ముందు హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక ఎగ్గొట్టారు.
నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3 వేల చొప్పున ఏడాదికి రూ.36 వేలు ఇస్తామన్నారు. విజయోత్సవ సభ అడ్వర్టైజ్‌మెంట్లో నిరుద్యోగ భృతి హామీ తీసేశారు. ఎన్నికలకు ముందు కనిపించిన 50 ఏళ్లకే పింఛన్ – ఏడాదికి రూ.48 వేలు హామీ ప్రకటన విజయోత్సవ సభకు వచ్చేసరికి మాయమైంది. ఆ పార్ట్ అంతా కటింగే. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ పోయి.. బాబు ష్యూరిటీ అనేది మోసం గ్యారెంటీగా మిగిలిన పరిస్థితులు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.
విద్యా వ్యవస్థ నిర్వీర్యం.. పేదింటి చదువులపై కుట్రలు
రాష్ట్రంలో విద్యారంగాన్ని ఏ విధంగా నాశనం చేస్తున్నారో చూస్తుంటే బాధాకరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. జగన్ అనే వ్యక్తి ఇంకో ఐదేళ్లు పరిపాలన చేసుంటే.. ప్రతి గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చిన పిల్లాడు, ఒకటో తరగతి నుంచి టెన్త్ వరకు మన హయాంలో చదివిన వారు ఇంగ్లిష్ మీడియం, ఐబీ సర్టిఫికెట్‌తో పాసయ్యేవారు. మూడో తరగతి నుంచే టోఫెల్ క్లాసులు అటెండ్ అవుతూ పదో తరగతి పూర్తయ్యే నాటికి వెస్ట్రన్ యాక్సెంట్ (అమెరికన్ యాక్సెంట్)తో అనర్గళంగా ఇంగ్లిష్ మాట్లాడేవాడని నేను కచ్చితంగా చెప్పగలను.
ఇక ఎనిమిదో తరగతి పిల్లాడు మనమిచ్చే ట్యాబ్‌లతో ఐబీ చదువులు, టోఫెల్‌లో ఉత్తీర్ణత సాధించేవాడు. ట్యాబ్‌లతో ఇంటర్నెట్‌తో అనుసంధానమై సాఫ్ట్‌వేర్‌పై అవగాహన వచ్చేది. మనం సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ తీసుకొచ్చాం. ఇవన్నీ కలిసి ఆ పిల్లాడు ఏ స్టేజ్‌కి వచ్చే వాడంటే.. ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ గేట్‌వేగా నిలిచేది. అటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్, నాలెడ్జ్ బేస్డ్ ఎడ్యుకేషన్‌ను రాష్ట్రంలో ప్రతి పేద, మధ్యతరగతి పిల్లలకు మనం అందుబాటులోకి తెచ్చాం.
చంద్రబాబు, రామోజీ, ఆంధ్రజ్యోతి ఎండీ మనవళ్లు ఈ ఐబీ చదువులు చదివారు. వాళ్లలో ఎవరూ తెలుగు మీడియం చదవడం లేదు. మన దగ్గరకి వచ్చేసరికి వీళ్లంతా కుట్ర పన్ని పేదవాడి మీద, మిడిల్ క్లాస్ వారి మీద రాక్షసుల మాదిరిగా యుద్ధం చేసి విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఇంగ్లిష్ మీడియంలో ఐబీ నుంచి సీబీఎస్‌ఈ వరకు పేద పిల్లల ప్రయాణాన్ని అడ్డుకున్నారు. టోఫెల్ క్లాసులు పూర్తిగా రద్దయి పోయిన పరిస్థితి. 8వ తరగతి పిల్లలకు ట్యాబులు ఇవ్వకపోగా ఆ పేరెత్తే ధైర్యం కూడా వీరికి లేదు. సబ్జెక్టు టీచర్ కాన్సెప్టు ఊసే లేదు.
దారుణంగా గవర్నమెంట్ స్కూళ్లు.. 5 లక్షల మంది విద్యార్థుల తగ్గుదల
ప్రభుత్వ విద్యా సంస్థల్లో నాడు–నేడు పనులు పూర్తిగా ఆగిపోయాయి. చివరకు నిర్వహణ కూడా చేయలేని అధ్వాన్న స్థితిలోకి విద్యా వ్యవస్థను నెట్టేశారు. ఆర్వో ప్లాంట్ల నిర్వహణ కూడా సరిగా చేయకపోవడంతో కురుపాంలో ఇద్దరు పిల్లలు చనిపోయారు. 143 మంది పిల్లలకు పచ్చకామెర్లు సోకాయి. 30 మంది ఇంకా ఆస్పత్రుల్లోనే ఉన్నారు. నెలరోజుల క్రితం జాండిస్ కేసులు బయటపడితే కనీసం పట్టించుకున్న నాథుడే లేడు. మన మాజీ ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి వెళితే గానీ ప్రభుత్వంలో కదలిక రాలేదు.
రోజుకొక మెనూతో గొప్పగా అందించిన గోరుముద్ద కనుమరుగైంది. మన హయాంలో గవర్నమెంట్ స్కూళ్లలో నో వేకెన్సీ బోర్డులు చూశాం. గవర్నమెంట్ స్కూల్‌లో సీటు కోసం ఏకంగా ఎమ్మెల్యేల రికమండేషన్ లెటర్స్ కోసం వచ్చిన పరిస్థితులు చూశాం. అదే ఈరోజు గవర్నమెంట్ స్కూళ్లలో 5 లక్షల మంది విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. అమ్మ ఒడి పేరుతో మనం తీసుకొచ్చిన పథకానికి తల్లికి వందనం అని పేరు మార్చారు.
ఎంతమంది పిల్లలుంటే అంత మందికి ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని చెప్పి గత ఏడాది పూర్తిగా ఎగరగొట్టేశారు. రెండో ఏడాది తూతూమంత్రంగా అమలు చేసి 30 లక్షల మంది పిల్లలకు ఎగరగొట్టేశారు. రూ.15 వేలు కాస్తా రూ.13 వేలు చేశారు. అది కూడా ఇవ్వకుండా కొందరికి రూ.9 వేలు, కొందరికి రూ.8 వేలు, కొందరికి రూ.10 వేలు ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు.
విద్యాదీవెన, వసతి దీవెన బకాయిలు.. ఆగుతున్న పిల్లల చదువులు..
ఫీజురీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి ఏప్రిల్‌లో వెరిఫికేషన్ చేసి మేలో ఇస్తుంటాం. కానీ 2024 మార్చి 16న ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఇవ్వలేకపోయాం. 2024 జనవరి, ఫిబ్రవరి, మార్చి త్రైమాసికానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్.. ఇప్పుడు 2025 సెప్టెంబర్ నాటికి 7 త్రైమాసికాలు పెండింగ్‌లో ఉన్నాయి. దాదాపు రూ.4,500 కోట్లకుగానూ ఇచ్చింది కేవలం రూ.700 కోట్లు మాత్రమే.
మిగతాదంతా గాలికొదిలేశారు. వసతి దీవెన కింద మన హయాంలో ఏటా ఏప్రిల్‌లో రూ.1,100 కోట్లు ఇచ్చేవాళ్లం. 2024లో ఎలక్షన్ కోడ్ కారణంగా ఆగిపోయింది. రెండేళ్లకు కలిపి రూ.2,200 కోట్లు ఇవ్వాల్సినా ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా పూర్తిగా నిలిపేశారు. దీంతో పిల్లలు చదువులు మానుకుంటున్న దుస్థితి.
వ్యవసాయం.. నిస్సహాయ పరిస్థితుల్లో
పంటల పరిస్థితి ఇక చెప్పాల్సిన పని లేదు. రైతులకి మనమిచ్చిన ఉచిత క్రాప్ ఇన్సూరెన్స్ గాలికి ఎగిరిపోయింది. ఇన్‌పుట్ సబ్సిడీ గురించి పట్టించుకునే నాథుడే లేడు. ఈ–క్రాప్ అనేది కనపడకుండా పోయింది. మన హయాంలో సీఎం–యాప్ ద్వారా ఎప్పటికప్పుడు గ్రామ స్థాయిలో ధరలను పర్యవేక్షించాం. ఏ పంటకు గిట్టుబాటు ధర లేకపోయినా వెంటనే ఆర్బీకేలో అలెర్ట్ వచ్చేది. ఇప్పుడు అన్నీ పోయాయి. రైతు భరోసాగా మనం పెట్టుబడి సహాయం కింద ఏటా రూ.13,500 చొప్పున ఇచ్చి రైతుకు అండగా నిలిస్తే కళ్లబొల్లి మాటలతో భ్రమలు కల్పించారు.
పేరు మార్చి అన్నదాతా సుఖీభవ అన్నారు. పీఎం కిసాన్ కింద ఇచ్చే రూ.6 వేలు కాకుండా తామే సొంతంగా రూ.20 వేలు ఇస్తామన్నారు. రెండేళ్లకు కలిపితే ఒక్కో రైతుకు రూ.40 వేలకుగాను విదిల్చింది కేవలం రూ.5 వేలు. ఇవాళ ఏ పంట తీసుకున్నా గిట్టుబాటు ధర లేదు. ధాన్యం కొనుగోలు దగ్గర్నుంచి మొదలుపెడితే మిర్చి, పొగాకు, అరటి, మామిడి, టమాటా, సజ్జలు, పెసలు, మినుములు, చీని, ఉల్లి రైతుల పరిస్థితి దారుణంగా ఉంది.
ఎక్కడ చూసినా దళారీ వ్యవస్థ, కల్తీ విత్తనాలు, కల్తీ ఎరువులు, కల్తీ పురుగు మందులే. ఎరువులను ఆర్బీకేల ద్వారా రైతులకు సరఫరా చేయాల్సింది పోయి ప్రైవేటుకి ఎక్కువగా కేటాయించి దళారీలతో డీల్ కుదుర్చుకుంటున్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో ఏ రోజైనా రైతులు ఎరువుల కోసం రోడ్డెక్కడం చూశామా?
ప్రజారోగ్యం నేడు గాలికి..
వైద్య రంగం గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మన హయాంలో గ్రామాల్లో విలేజ్ క్లినిక్స్ కనిపించేవి. 14 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేసేవారు. 105 రకాల మందులు అందుబాటులో ఉండేవి. అక్కడే ఏఎన్‌ఎంలు రిపోర్టింగ్ చేసేవారు. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఉండేవారు. తొలిసారిగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తెచ్చాం. ప్రతి పీహెచ్సీలో ఇద్దరు డాక్టర్లు సేవలందించేవారు. అన్ని ఆస్పత్రుల్లో జీరో వేకెన్సీ పాలసీ అమలు చేసి నియామకాలు చేపట్టాం.
దేశంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత 61% ఉంటే.. మన హయాంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత 4% మాత్రమే. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.25 లక్షల వరకు పెంచాం. 1,000 ప్రొసీజర్లను 3,300 వరకు తీసుకెళ్లాం. ఆరోగ్య ఆసరా తెచ్చి కోలుకునే సమయంలో జీవన భృతికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నాం. ఇప్పుడు అవన్నీ తెరమరుగైపోయాయి. ఆరోగ్యశ్రీ కోసం నెలకు రూ.300 కోట్లు కావాలి. ఈ 16 నెలలకు గాను రూ.4,800 కోట్లు అవసరం.
కానీ ఈ పెద్ద మనిషి రూ.1,000 కోట్లు కూడా ఇవ్వలేదు. రూ.3,800 కోట్లు పెండింగ్ పెట్టడంతో నెట్‌వర్క్ ఆస్పత్రులు సేవలు నిలిపేశాయి. 108, 104 సర్వీసుల నిర్వహణ స్కాములమయం. కనీసం రూ.5 కోట్ల టర్నోవర్ కూడా లేని, టీడీపీ ఆఫీస్ బేరర్‌గా ఉన్నవారికి 108, 104 సర్వీసుల నిర్వహణ కాంట్రాక్ట్ అప్పగించారు. ఇక అది కుయ్.. కుయ్ అని ఏమంటుంది? బుయ్.. బుయ్ అంటుంది.
ఉద్యోగులకు తోడుగా వైఎస్ జగన్
ఐఆర్, పీఆర్సీ, నాలుగు డీఏలు పెండింగ్ తదితర సమస్యలపై ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. సచివాలయ ఉద్యోగులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. నాడు మనం సీపీఎస్ స్థానంలో జీపీఎస్ తీసుకువచ్చి ఉద్యోగులకు తోడుగా నిలబడే కార్యక్రమం చేస్తే వారు దానిపై దుష్ప్రచారం చేశారు.
ఓపీఎస్ ఇస్తామని చెప్పి మోసం చేశారు. వీటన్నింటిపైనా.. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకు సంఘీభావంగా మన వంతు కార్యక్రమాన్ని నిర్వహించాలి. ఉద్యోగులకు మనం తోడుగా ఉన్నామన్న భరోసాను కల్పించడంతో పాటు ఆ విషయాన్ని రాష్ట్ర ప్రజలందరికీ చాటేలా కార్యక్రమాలు నిర్వహించాలి.