
సాక్షి, తాడేపల్లి: అన్నమయ్య జిల్లాలో కల్తీ మద్యం సిండికేట్ వ్యవహారంపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ స్పందించారు. కల్తీ మద్యం కేసులో అసలు సూత్రధారులను కాపాడేందుకు సీఎం చంద్రబాబు స్కెచ్ వేసి.. ఆయన ఆదేశాల మేరకు రాత్రికి రాత్రే కేసు మార్చేశారని ఆరోపించారు. టీడీపీ నేతల సొంత ఆదాయాలకోసం ఇలా ప్రజల ఆరోగ్యంతో చెలగాటం న్యాయమేనా?’ అని ప్రశ్నించారు. నకిలీ లిక్కర్ వ్యవహారంలోనూ రాష్ట్రాన్ని నంబర్ వన్‌గా తీర్చిదిద్దాలని చంద్రబాబు కంకణం కట్టుకున్నట్టున్నారు అంటూ విమర్శించారు.

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘చంద్రబాబు.. మద్యానికి బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన మీరు, ఇప్పుడు నకిలీ లిక్కర్ వ్యవహారంలోనూ రాష్ట్రాన్ని నంబర్ వన్‌గా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నట్టున్నారు. అన్నమయ్య జిల్లా ములకలచెరువులో మీ పార్టీ నాయకులు ఏకంగా కల్తీ మద్యం తయారీ ఫ్యాక్టరీయే పెట్టి సప్లై చేసిన ఘటన రాష్ట్రంలో మద్యం అక్రమాలకు నిదర్శనంగా నిలుస్తోంది. రాష్ట్రానికి సంపద పెరగడం సంగతేమోకాని, లిక్కర్ సిండికేట్లతో, నకిలీ మద్యం తయారీల ద్వారా, ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి మీ పార్టీ నాయకులు గడించిన అక్రమ సంపాదనను పైనుంచి కింది వరకూ వీరంతా పంచుకుంటున్నారు. వ్యవస్థీకృతంగా ఈ దందా కొనసాగుతోంది.
మీ లిక్కర్ సిండికేట్లకు, గ్రామస్థాయి వరకూ విస్తరించిన బెల్టుషాపుల మాఫియాలకు, కల్తీ మద్యం వ్యాపారానికి అడ్డు రాకూడదనే ఉద్దేశంతోనే ఒక వ్యూహం ప్రకారం మీరు ప్రభుత్వ మద్యం దుకాణాలపై విష ప్రచారం చేశారు. ఉద్దేశపూర్వకంగా వాటిని తీసివేసి, వాటి స్థానంలో మీ సిండికేట్లకు అప్పగించారు. మద్యం దుకాణాలు టీడీపీ వాళ్లవే. బెల్టు షాపులు టీడీపీ వాళ్లవే. ఇల్లీగల్ పర్మిట్ రూమ్‌లు టీడీపీ వాళ్లవే. అక్రమ మద్యం తయారీ దారులు కూడా టీడీపీ నేతలే. వాళ్లు తయారుచేస్తారు, ఆ తయారు చేసిన దాన్ని మీ వాళ్లే, మీ షాపులద్వారా, మీ బెల్టు షాపుల ద్వారా అమ్ముతారు. అలా వచ్చిన డబ్బును వాటాలు వేసుకుని పంచుకుంటారు. రాష్ట్రంలో ప్రతి మూడు బాటిళ్లలో ఒకటి కల్తీ మద్యమేనన్న వార్తలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి.
లిక్కర్ వ్యవహారంలో మీ వ్యవస్థీకృత నేరాల ద్వారా ప్రజల ప్రాణాలకు తీవ్ర ప్రమాదం ఏర్పడ్డమే కాదు, ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన డబ్బును మీరు దోచుకుంటున్నారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ మద్యం దుకాణాలను రద్దుచేసి విచ్చలవిడిగా మద్యం విక్రయాలను పెంచారు. మార్ట్‌లు పెట్టారు, తిరిగి మళ్లీ ఇల్లీగల్ బెల్టుషాపులు తెరిచారు, ప్రతి వీధిలోనూ పెట్టారు, రాత్రిపగలు తేడాలేకుండా లిక్కర్ అమ్మడం మొదలుపెట్టారు. ఇల్లీగల్ పర్మిట్ రూమ్‌లు తెరిచారు.

.@ncbnగారూ.. మద్యానికి బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన మీరు, ఇప్పుడు నకిలీ లిక్కర్ వ్యవహారంలోనూ రాష్ట్రాన్ని నంబర్ వన్ గా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నట్టున్నారు. అన్నమయ్య జిల్లా ములకలచెరువులో మీ పార్టీ నాయకులు ఏకంగా కల్తీ మద్యం తయారీ ఫ్యాక్టరీయే పెట్టి సప్లై చేసిన ఘటన… pic.twitter.com/t329MJtbLe
— YS Jagan Mohan Reddy (@ysjagan) October 5, 2025
ఇంత విచ్చలవిడిగా తాగిస్తున్నా సరే, CAG నివేదికల ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొదటి ఐదునెలల్లో, అంటే ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారానే లిక్కర్ అమ్మకాలు ఉన్నప్పుడు రాష్ట్ర ఎక్సైజ్ ఆదాయం ₹6,782.21 కోట్లు కాగా, 2025-26 ఆర్థిక సంవత్సరంలోని మొదటి ఐదు నెలల్లో, విచ్చలవిడిగా లిక్కర్ అమ్మినా సరే ఆదాయం ₹6,992.77 కోట్లు మాత్రమే వచ్చింది. కేవలం 3.10% వృద్ధి మాత్రమే. ఎక్కడైనా ప్రతిఏటా సహజంగా వచ్చే 10% పెరుగుదల కూడా రాలేదు. అంటే దీని అర్థం, ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయాన్ని, సిండికేట్ల రూపంలో, కల్తీ లిక్కర్ తయారీ రూపంలో మీ ముఠా కొట్టేస్తున్నట్టేగా అర్థం.
కల్తీ లిక్కర్ వ్యవహారాలు కొన్ని నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా వెలుగుచూస్తున్నాయి. ఉత్తరాంధ్రలోనూ, గోదావరి జిల్లాల్లోనూ, ఇప్పుడు రాయలసీమలోనూ ఈ ఘటనలు బయటకు వచ్చాయి. కాని విచారణ, దర్యాప్తు తూతూమంత్రంగానే సాగుతున్నాయి. కారణం, ఈ అక్రమాల వెనుక ఉన్నది మీ బినామీలు అయిన మీ టీడీపీవాళ్లే. దీన్ని అరికట్టాలన్న చిత్తశుద్ధి ఉండి ఉంటే, ఇవాళ ములకలచెరువు ఘటన తర్వాత సప్లై చేసిన మద్యం షాపుల్లోనూ, బెల్టు షాపుల్లోనూ విస్తృతంగా తనిఖీలు జరిగి, కల్తీ బాటిళ్లను పట్టుకునేవారు. కాని అలా జరగలేదు.

పైగా దీనికి కారకులైన వారిని రక్షించే ప్రయత్నం చేశారు. అన్నమయ్య జిల్లా స్థాయి ముఖ్యనేత, టీడీపీ ఇన్‌ఛార్జి కనుసన్నల్లో ఈ కల్తీ మద్యాన్ని తయారు చేస్తే, వీరిని తప్పిస్తూ తూతూ మంత్రంగా కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితుడు, టీడీపీ ఇన్‌ఛార్జి అనుచరుడు మద్యం దుకాణంవైపు అధికారులెవ్వరూ కన్నెత్తిచూడలేదు. ఈ నేరాన్నంతటినీ విదేశాల్లో ఉన్న మరో వ్యక్తిపైకి తోసేసే ప్రయత్నం చేస్తున్నారు. అసలు సూత్రధారులను కాపాడేలా స్కెచ్ వేసి, మీరు ఇచ్చిన ఆదేశాల మేరకు, మీ కార్యాలయ డైరెక్షన్‌లో రాత్రికి రాత్రే కేసు మార్చేశారు. దీనికి కారణం, ఈ దందాకు మీ నుంచి, మీ చెప్పు చేతల్లో ఉన్న వ్యవస్థల నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉన్నాయి కాబట్టే. మీ సొంత ఆదాయాలకోసం ఇలా ప్రజల ఆరోగ్యంతో చెలగాటం న్యాయమేనా?’ అని ప్రశ్నించారు.