ఉద్యోగులకు ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీలు ఏమిటి..? చేస్తున్నది ఏమిటి..? | Ys Jagan Fires On Chandrababu For Cheating Employees: Andhra pradesh | Sakshi
Sakshi News home page

ఉద్యోగులకు ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీలు ఏమిటి..? చేస్తున్నది ఏమిటి..?

Oct 7 2025 4:26 AM | Updated on Oct 7 2025 4:37 AM

Ys Jagan Fires On Chandrababu For Cheating Employees: Andhra pradesh

ఉద్యోగులకు సీఎం చంద్రబాబు చేసిన మోసాలపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఆగ్రహం

పెండింగ్‌ డీఏలు ఇవ్వలేదు.. పీఆర్సీ వేయలేదు.. ఉద్యోగులకు దాదాపు రూ.31 వేల కోట్ల బకాయిలు పెట్టారు  

ఉద్యోగులను నడిరోడ్డుపై నిలబెడతారా? ఇందుకేనా మీరు అధికారంలోకి వచి్చంది? 

కేబినెట్‌ సమావేశాల్లో మీ శ్రద్ధంతా భూ పందేరం మీద తప్ప.. ప్రజలు, ఉద్యోగులపై కాదు

అప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా ప్రజల మీద, ఉద్యోగుల మీద మీకు ఉన్నది కపట ప్రేమే.. వారిని నమ్మించి

వెన్నుపోటు పొడవటం మీకు అలవాటే చంద్రబాబు పెట్టే బాధలు భరించలేక ఇప్పుడు వారంతా రోడ్డు మీదకు వస్తున్నారంటూ వైఎస్‌ జగన్‌ మండిపాటు

సాక్షి, అమరావతి: ఎన్నికలకు ముందు ఉద్యోగులకు మీరు ఇచ్చిన హామీలు ఏమిటి? ఇప్పుడు మీరు చేస్తున్నదేమిటి? అంటూ ముఖ్యమంత్రి చంద్ర­బాబు­నాయుడును వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిలదీశారు. తీపి తీపి మాటలతో ఉద్యోగులకు అరచేతిలో వైకుంఠం చూపి... తీరా ఇప్పుడు వారిని మోసం చేస్తారా? రోడ్డు మీద నిలబెడతారా? ఇందుకేనా మీరు అధికారంలోకి వచ్చింది? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

పీఆర్సీ, పెండింగ్‌ డీఏలు, జీపీఎఫ్, ఏపీజీఎల్‌ఐ, మెడికల్‌ రీయింబర్స్‌మెంట్, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్, సరెండర్‌ లీవ్స్‌ లేదా ఎన్‌క్యాష్‌మెంట్‌ లీవ్‌ల కింద ఉద్యోగులకు దాదాపు రూ.31 వేల కోట్ల బకాయిలు పెట్టారని ఎత్తి­చూపారు. తమకు రావా­ల్సిన వాటి కోసం ఉద్యో­గులు ఎదురుచూస్తున్నా ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇవ్వకపోవడంతో వారందరూ నరకయాతన అనుభవిస్తున్నారని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆవే­దన వ్యక్తం చేశారు.

మీరు పెట్టే బాధలు భరించలేకే ఇప్పుడు ఉద్యోగులంతా రోడ్డు మీదకు వస్తున్నాంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ఉద్యోగులకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో చేసిన మేళ్లను.. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలను జత చేస్తూ, చంద్రబాబు చేసిన మోసాలను ప్రశ్నిస్తూ తన ‘ఎక్స్‌’ ఖాతాలో సోమవారం వైఎస్‌ జగన్‌ పోస్టు చేశారు.

అందులో ఆయన ఏమన్నారంటే...
‘‘చంద్రబాబు గారూ... మంత్రివర్గ సమావేశం జరిగిన ప్రతిసారి, ఉద్యోగస్తులకు ఇచ్చిన హామీల అమలు గురించి, వారికి చెల్లించాల్సిన బకాయిల గురించి మీ నుంచి ప్రకటన వస్తుందని వారు ఆశగా ఎదురుచూడడం, చివరకు ఉసూరు మనిపించడం మీకు అలవాటుగా మారింది. కేబినెట్‌ సమావేశాల్లో మీ శ్రద్ధ అంతా భూ పందేరం మీద తప్ప, ప్రజలు, ఉద్యోగస్తుల మీద కాదు. అప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా ప్రజలు, ఉద్యోగుల మీద మీకున్నది కపట ప్రేమే. వారిని నమ్మించి వెన్నుపోటు పొడవడం మీకు అలవాటే.

మీరు పెట్టే బాధలు భరించలేక ఇప్పుడు వారంతా రోడ్డు మీదకు వస్తున్నారు. చంద్రబాబు గారూ.. మీరు అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు అవుతోంది. ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఏమిటో ఒక్కసారి మీ మేనిఫెస్టో చూడండి. అందులో ఒక్కటైనా నెరవేర్చారా? అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్‌ అన్నారు. మరి ఇచ్చారా? మెరుగైన పీఆర్సీ అంటూ ఊదరగొట్టారు. మరి దాని సంగతి ఏమైంది? మేం అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే ఉద్యోగులకు ఐఆర్‌ ప్రకటించాం. అంతేకాకుండా మా హయాంలోనే పీఆర్సీ వేసి, దానికి చైర్మన్‌ను కూడా నియమించాం.

మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత, ఐఆర్‌ ఇవ్వకపోవడం ఒక మోసమైతే, ఉద్యోగులకు జీతాలు పెంచాల్సి వస్తుందని ఉద్దేశపూర్వకంగా పీఆర్సీ చైర్మన్‌ను వెళ్లగొట్టారు. ఆ తర్వాత కొత్తగా ఎవరినీ నియమించకుండా ఉద్యోగస్తులకు తీరని అన్యాయం చేస్తున్నారు. న్యాయంగా, ధర్మంగా వారికి పెరగాల్సిన జీతాలను కావాలనే ఆపుతున్నారు.

ఇచ్చే ఆలోచన మీకు లేదనిపిస్తోంది..
ఉద్యోగస్తులకు ఇచ్చే అలవెన్స్‌ పేమెంట్స్‌ను పెంచుతామంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఇప్పుడు దానిగురించి ప్రస్తావించడమే లేదు. ఇప్పటిదాకా ఇవ్వాల్సిన 4 డీఏలు మొత్తం పెండింగ్‌. దసరా పండుగకు డీఏలు క్లియర్‌ అవుతాయని ఉద్యోగులంతా ఎంతో ఎదురుచూశారు. ఇప్పుడు దీపావళి పండుగ కూడా వస్తోంది. కానీ, ఇచ్చే ఆలోచన మీకున్నట్టు అనిపించడం లేదు.

  సీపీఎస్‌/జీపీఎస్‌లను పునఃసమీక్షించి ఆమోద­యోగ్య పరిష్కారం అంటూ కల్లబొల్లి కబుర్లు చె­ప్పారు. కానీ, మీరు అధికారంలోకి వచ్చాక ఒక్క­సారైనా దీనిమీద రివ్యూ చేశారా? మా ప్రభుత్వ పాలనలో సీపీఎస్‌కు గొప్ప ప్రత్యామ్నా­యంగా ఉద్యోగుల కోసం జీపీఎస్‌ తీసుకొచ్చాం. కేంద్ర ప్రభుత్వం సహా పలు రాష్ట్రాలు ఇప్పుడు ఇదే విధానంలో వెళ్తున్నాయి. మీరు... ఓపీఎస్‌ను తీసు­కొస్తామన్నారు. మాకంటే గొప్ప­గా చేస్తామ­న్నారు. కానీ, ఏమీ చేయకపోగా, ఉద్యోగస్తులను త్రిశంకు స్వర్గంలోకి నెట్టారు. మిమ్మల్ని నమ్మిన పాపానికి వారు తీవ్రంగా నష్టపోతున్నా, మీలో ఏ మాత్రం చలనం లేదు.

ఉద్యోగులు జీతాల కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి
ప్రతి నెల ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు ఇస్తామని చంద్ర­బాబు హామీ ఇచ్చి... ఇప్పుడు ఏ తేదీన జీతాలు, పెన్షన్లు ఇస్తారో తెలియని పరిస్థితి తెచ్చారు. ప్రతి నెల ఉద్యోగులు జీతాల కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి. కరోనా వల్ల తలెత్తిన ఆర్థిక సంక్షో­భాల సమయంలోనూ మేం ఉద్యోగులకు జీతాలు సకాలంలోనే ఇవ్వగలిగాం. కానీ, ఆ రోజు మాపై మీరు తప్పుడు ప్రచారాలు చేశారు. ఇవాళ కరోనా లాంటి దారుణమైన పరిస్థి­తులు లేకపోయినా జీతాలు ఇవ్వలేక­పోతు­న్నారు. ఔట్‌ సోర్సింగ్, కాంట్రాక్ట్‌ ఉద్యోగు­లకు ప్రభుత్వ పథకాలను వర్తింపజేస్తామని హామీ ఇచ్చి, ఇప్పటికీ అమలు చేయడం లేదు.

వాలంటీర్లకు ఎగ్గొట్టారు.. వైద్యాన్ని రోడ్డున పడేశారు
మీరు అధికారంలోకి రాగానే వాలంటీర్ల జీతాలను రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని హామీ ఇచ్చి, కుట్ర పన్ని వారి పొట్టకొట్టి ఇప్పుడు రోడ్డుమీద పడేశారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకూ మేలు చేస్తామని చెప్పి వారినీ ఇప్పుడు రోడ్డు ఎక్కేలా చేశారు. విలేజ్‌ క్లినిక్‌లు, పీహెచ్‌సీలు మొత్తంగా ప్రభుత్వ ఆస్పత్రులన్నింటినీ నిర్వీర్యం చేశారు. జీరో వేకెన్సీతో ప్రజలకు తోడుగా ఉండే వైద్య శాఖను రోడ్డున పడేశారు.

మా ప్రభుత్వ హయాంలో ఇచ్చిన మాట ప్రకారం ఆర్టీసీలో పని చేస్తున్న దాదాపు 52 వేల మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా రెగ్యులరైజ్‌ చేశాం. ఇతర శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌ను కూడా మొదలుపెట్టాం. అర్హులైన 10,117 మందిని గుర్తించాం. వీరిలో  3,400 మందికి అపాయింట్మెంట్‌ ఆర్డర్లు కూడా ఇచ్చాం. మిగిలినవారికి అన్ని ప్రక్రియలు ముగిసినా ఇప్పటివరకు అపాయింట్మెంట్లు ఇవ్వకుండా, వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు.  

మళ్లీ దళారీ వ్యవస్థ... 
ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల కష్టాన్ని దోచుకునే అరాచక విధానాలకు స్వస్తిపలుకుతూ, వారి­కోసం ఆప్కాస్‌ను తీసుకొచ్చి దళారీ వ్యవ­స్థను అంతం చేశాం. దాదాపు లక్షమందికి సకాలానికే ఎలాంటి కత్తిరింపులు లేకుండా జీతాలను క్రమంతప్పకుండా ప్రతి నెల 1వ తారీఖునే ఇచ్చేవాళ్లం. ఇప్పుడు ఆప్కాస్‌ను రద్దుచేసి మళ్లీ దళారీ వ్యవస్థను తెస్తున్నారు. ఇంతకంటే అన్యాయం ఏముంటుంది? ఔట్‌ సోర్సింగ్, కాంట్రాక్ట్‌ పద్ధతిలో పనిచేస్తున్న వారందరికీ మేం అధికారంలోకి వచ్చిన వెంటనే జీతాలు పెంచాం. మేం రాక­మునుపు వరకు వీరి జీతాల చెల్లింపుల బిల్లు నెలకు రూ.1,100 కోట్లు అయితే, మేం వచ్చాక రూ.3 వేల కోట్లకు పెంచాం.  

పేరుకే హెల్త్‌ కార్డులు... వాటితో ప్రయోజనం లేదు
ఉద్యోగులకు ఈహెచ్‌ఎస్‌ కింద ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకపోవడంతో ఆస్పత్రులన్నీ వైద్యా­న్ని నిరాకరిస్తున్నాయి. పేరుకు హెల్త్‌ కార్డు­లున్నా వాటి వల్ల ప్రయోజనం లేకుండా పోతోంది. ఈహెచ్‌ఎస్‌ కోసం ప్రభుత్వం వా­టాగా ఇవ్వాల్సిన దాన్ని ఇవ్వకపోవడమే కాదు, తమ వాటాగా ఉద్యోగులు చెల్లించిన దాన్ని­కూడా విడుదల చేయడం లేదు. ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందా? చంద్రబాబు గారూ.. దాదాపు రెండేళ్ల కాలంలో ఉద్యోగులకైనా, ప్రజలకైనా మీరు వెన్నుపోటే పొడిచారు. వారికి ఇచ్చిన హామీలన్నీ మోసాలుగా మారిపో­యాయి. అందుకే ప్రతి ఒక్కరూ రోడ్డెక్కుతూ మిమ్మల్ని ఎండగడుతున్నారు’’. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement