
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణంలో వైఎస్ జగన్ ఆలోచనలు ముందుకు తీసుకెళ్ళడంలో ఐటీ వింగ్ క్రియాశీలక పాత్ర పోషించాలని ఆ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. వైఎస్సార్‌సీపీలో టెక్నాలజీ ప్రాముఖ్యత, సులభంగా అర్థమయ్యే రీతిలో పార్టీ లైన్ క్యాడర్‌కు, ప్రజలకు వివరించడంపై ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశంపై చర్చ జరగడం మంచి పరిణామంగా సజ్జల పేర్కొన్నారు.
బుధవారం.. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ ఐటీ వింగ్ సమావేశం జరిగింది. సజ్జలతో పాటు ఐటీ వింగ్ ప్రెసిడెంట్ పోశింరెడ్డి సునీల్, వర్కింగ్ ప్రెసిడెంట్ చిట్యాల విజయ్ భాస్కర్ రెడ్డి, అన్ని జిల్లాల ఐటీ వింగ్ అధ్యక్షులు, పార్టీ నేతలు గుడివాడ అమర్‌నాథ్, లేళ్ళ అప్పిరెడ్డి, పూడి శ్రీహరి, ఆలూరి సాంబశివారెడ్డి, తలారి రంగయ్య, టీజేఆర్ సుధాకర్ బాబు, దవులూరి దొరబాబు, పలువురు నాయకులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ‘‘సాంకేతికతను వాడుకుంటూ ఏ విధమైన మెకానిజం ఉండాలన్న దానిపై కూడా మనం చర్చిద్దాం. వైఎస్సార్‌సీపీ, వైఎస్ జగన్‌పై చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ధీటుగా ఎదుర్కొనే మెకానిజాన్ని మనం డెవలప్ చేసుకోవాలి. కమ్యూనికేషన్‌ను అనుసంధానించడం అనేది ఒక ముఖ్యమైన ఎజెండాగా మనం ముందుకెళ్ళాలి. అబద్దాన్ని నిజం అని చంద్రబాబు, టీడీపీ చేస్తున్న ప్రచారం బలంగా తిప్పికొట్టాలి.
..ఐటీ వింగ్‌లో క్రియాశీలకంగా ఉన్నవారినందరినీ ఒక గ్రిడ్ కిందకు తీసుకువచ్చి అందరినీ మమేకం చేయాలి. పార్టీలోని అన్ని కమిటీల నిర్మాణంపై సీరియస్‌గా దృష్టిపెట్టాలి, వారి బాధ్యతలు, నిర్వర్తించాల్సిన విధులపై అవగాహన కల్పించాలి. మనమంతా ఒక ఆర్గనైజ్డ్ టీమ్‌గా ముందుకెళ్ళాలి. దానికి తగిన విధంగా మనం సిద్ధం కావాలి. రాష్ట్రస్థాయిలో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటుచేసుకుని అన్ని విభాగాలు సమన్వయం చేసుకోవాలి. అందరూ ఫోకస్‌తో కష్టపడి పనిచేసి పార్టీ మెకానిజంలో భాగస్వాములవ్వాలి’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు.