
రేపు నర్సీపట్నంలో వైఎస్ జగన్ పర్యటనతో శ్రీకారం
కూటమి సర్కారు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ
ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన 7 కొత్త ప్రభుత్వ కాలేజీలు
వివిధ దశల్లో మిగిలిన 10 మెడికల్ కాలేజీలు
ఏటా రూ.1,000 కోట్లు ఖర్చు పెడితే చాలు అవి సిద్ధం
అయినా ఆ దిశలో ఆలోచించని చంద్రబాబు ప్రభుత్వం
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారు కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేట్‌పరం చేయటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమానికి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. నర్సీపట్నం ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఈ నెల 9న తాను సందర్శిస్తానని.. అదే రోజు నుంచే ఉద్యమ కార్యాచరణకు శ్రీకారం చుడుతున్నట్లు ప్రకటించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించేందుకు ఈనెల 10వ తేదీన గ్రామ, వార్డు స్థాయిల్లో మొదలయ్యే రచ్చబండ కార్యక్రమం నవంబరు 22 వరకు కొనసాగుతుందని తెలిపారు.
ఈనెల 28న నియోజకవర్గ కేంద్రాల్లో, నవంబరు 12న జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా సేకరించే కోటి సంతకాల పత్రాలను నవంబరు 23న నియోజకవర్గాల నుంచి జిల్లా కేంద్రాలకు, నవంబరు 24న అక్కడి నుంచి విజయవాడకు తరలిస్తామన్నారు. అనంతరం గవర్నర్‌ను కలిసి అన్ని విషయాలు నివేదిస్తామన్నారు. సేకరించిన కోటి సంతకాల పత్రాలు గవర్నర్‌కు అందజేస్తామన్నారు.
మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ముఖ్యంగా కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ.. యథేచ్ఛగా సాగుతున్న నకిలీ మద్యం విక్రయాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలని సూచించారు. ప్రజలకు విస్తృత అవగాహన కల్పించేలా చొరవ చూపాలని ఆదేశించారు. సమావేశంలో వైఎస్ జగన్ ఏమన్నారంటే..
ప్రభుత్వమే ఎందుకు నిర్వహించాలంటే..?
మనం మన హయాంలో శ్రీకారం చుట్టిన 17 మెడికల్ కాలేజీల్లో 10 కళాశాలలను ప్రైవేటుకు కట్టబెడుతూ పేదలకు చంద్రబాబు తీవ్ర ద్రోహం చేస్తున్నారు. రాష్ట్రంలో 1923 నుంచి 2019 వరకు కేవలం 12 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉంటే మనం ఒక విజన్‌తో ఏకంగా 17 మెడికల్ కాలేజీలను ప్రభుత్వ రంగంలో తెచ్చాం. దీనిపై అందరూ ఆలోచన చేయాలని కోరుతున్నా. మీరు ప్రజల్లోకి వెళ్లినప్పుడు ఈ విషయాన్ని మాట్లాడమని కోరుతున్నా.
అసలు గవర్నమెంట్ ఎందుకు స్కూళ్లను నడుపుతుంది? ఎందుకు ఆస్పత్రులను నడుపుతుంది? ఎందుకు ఆర్టీసీ బస్సులను నడుపుతుంది? వాటిని ప్రభుత్వాలే ఎందుకు నడుపుతున్నాయి? ఎందుకంటే.. ప్రభుత్వాలు అవి చేయకపోతే ప్రైవేటు ఎక్స్‌ప్లాయిటేషన్ (దోపిడీ) జరుగుతుంది. ప్రభుత్వం కనుక ఆస్పత్రులను నడపకపోతే ప్రైవేటు ఆస్పత్రుల్లో దోపిడీతో ఏ పేదవాడికీ వైద్యం అందని దుస్థితి తలెత్తుతుంది. ప్రభుత్వం కనుక స్కూళ్లను నడపకపోతే.. నారాయణ, చైతన్య యాజమాన్యానికి ఫీజులు కట్టలేక పేదలు తమ పిల్లలను చదివించలేని పరిస్థితిలోకి వెళ్లిపోతారు. గవర్నమెంట్ ఆర్టీసీ బస్సులను నడపకపోతే.. ప్రైవేటు ఆపరేటర్ల దెబ్బకు ఎవరూ ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్లే పరిస్థితి ఉండదు. అందుకే గవర్నమెంట్ వీటన్నింటిలో ఎంటరవుతుంది. అందుకనే ప్రభుత్వం స్కూళ్లను, బస్సులను, హాస్పటళ్లను నిర్వహించాలి. లేదంటే ప్రైవేటు దోపిడీకి అడ్డూ అదుపూ ఉండదు.
జిల్లా మొత్తానికి హబ్‌గా..
మన హయాంలో ప్రతి జిల్లాలో ఒక టీచింగ్ హాస్పటల్‌ను తెచ్చే ప్రయత్నం చేశాం. ఒక మెడికల్ కాలేజీ తీసుకొచ్చాం. ఒక మెడికల్ కాలేజీ రాకతో 8 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో ప్రైవేటు దోపిడీ ఆగిపోతుంది. ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, మెడికల్ స్టూడెంట్లు, నర్సింగ్ స్టూడెంట్లు టీచింగ్ హాస్పటల్లో పని చేస్తారు. రకరకాల విభాగాలతో సూపర్ స్పెషాలిటీ సేవలు అక్కడ అందుబాటులోకి వస్తాయి. తద్వారా పేద, మధ్యతరగతి వారికి ఉచితంగా వైద్యం అందుబాటులోకి వస్తుంది. ఇదే కాకుండా జిల్లా మొత్తానికి టీచింగ్ హాస్పటల్ ఒక హబ్‌గా పని చేస్తుంది. పేదవాడికి ఉచితంగా వైద్యం అందుతుంది. అందుకే ప్రివెంటివ్ కేర్ మన పాలనలో సువర్ణాధ్యాయంగా నిలిచింది.
మెడికల్ సీట్లు పెరిగేవి..
నేను ముఖ్యమంత్రి అయ్యే వరకు రాష్ట్రంలో అందుబాటులో ఉన్న మెడికల్ సీట్లు 2,360 మాత్రమే. మనం ఏర్పాటు చేసిన 17 మెడికల్ కాలేజీల ద్వారా మరో 2,550 సీట్లు అదనంగా అందుబాటులోకి వచ్చేవి. మొత్తంగా 4,900 మందికిపైగా డాక్టర్లు ప్రతి సంవత్సరం బయటికి వచ్చేవారు. అంతమంది డాక్టర్లు మన రాష్ట్రంలో అందుబాటులో ఉండే పరిస్థితి ఉత్పన్నమయ్యేది. అది కూడా మెడికల్ సీట్లలో 50 శాతం కోటా ఉచితం. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు కాబట్టి మిగిలిన 50 శాతం సీట్లు కూడా ప్రైవేటు మెడికల్ కాలేజీలతో పోలిస్తే తక్కువ ఫీజుకే విద్యార్థులకు అందుబాటులో ఉంటాయి. చంద్రబాబు ఇప్పుడు ప్రైవేటీకరణ ద్వారా పేద, మధ్యతరగతి విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారు. ఉచిత వైద్యం పేద, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో లేకుండా చేస్తున్నారు.
ఏడు కాలేజీలు పూర్తి చేశాం..
మన హయాంలో 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టి ఐదింటిని పూర్తి చేశాం. వాటితోపాటు పాడేరు మెడికల్ కాలేజీని కూడా కలిపితే 800 ఎంబీబీఎస్ సీట్లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చేశాయి. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల.. ఇలా ఐదు మెడికల్ కాలేజీలు మనం అధికారంలో ఉండగానే 2023–24లోనే ప్రారంభమయ్యాయి. మరో రెండు కాలేజీలు.. పాడేరు, పులివెందుల మెడికల్ కాలేజీలను కూడా ప్రారంభించేందుకు చంద్రబాబు రాకముందే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చేసింది. పులివెందుల మెడికల్ కాలేజీకి 50 మెడికల్ సీట్లు శాంక్షన్ అయితే.. మాకొద్దంటూ చంద్రబాబు అడ్డుకుని ఎన్‌ఎంసీకి లేఖ రాయించారు.
9 నుంచి కార్యాచరణ
కూటమి సర్కారు ప్రజా కంటక పాలనను నిలదీస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం. నర్సీపట్నం ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఈనెల 9న నేను స్వయంగా సందర్శిస్తా. ఆ రోజుతో ఈ కార్యాచరణ ప్రారంభమవుతుంది. మర్నాడు 10వ తేదీన గ్రామ, వార్డు స్థాయిల్లో రచ్చబండ కార్యక్రమం మొదలై నవంబరు 22 వరకు కొనసాగుతుంది. అక్టోబరు 28న నియోజకవర్గ కేంద్రాల్లోనూ, నవంబరు 12న జిల్లా కేంద్రాల్లోనూ ర్యాలీలు నిర్వహిస్తాం. రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన కోటి సంతకాల పత్రాలు నవంబరు 23న నియోజకవర్గాల నుంచి జిల్లా కేంద్రాలకు, 24న జిల్లా కేంద్రాల నుంచి విజయవాడకు తరలిస్తారు. అనంతరం గవర్నర్‌ను కలిసి అన్ని విషయాలు నివేదించి కోటి సంతకాల పత్రాలు అందజేస్తాం.
ఏటా రూ.1000 కోట్లు ఖర్చు చేయలేరా?
మనం దాదాపు రూ.3 వేల కోట్లు మెడికల్ కాలేజీలకు ఖర్చు చేశాం. ఇక మిగిలింది రూ.5 వేల కోట్లు. ఇన్ని లక్షల కోట్లు బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో సంవత్సరానికి రూ.1000 కోట్లు చొప్పున మిగిలిన మెడికల్ కాలేజీలను పూర్తి చేయడానికి ఖర్చు పెట్టలేరా? వాటిని పూర్తి చేయడానికి మన హయాంలోనే నాబార్డ్ ఫండింగ్ తీసుకువచ్చాం. సెంట్రల్ గవర్నమెంట్ అసిస్టెన్స్ ఫర్ ఇన్ఫాస్ట్రక్చర్ అనే పథకంలో మెడికల్ కాలేజీలను కూడా పెట్టించాం. 50 ఏళ్ల కాలానికి వడ్డీ లేని రుణం స్పెషల్ అసిస్టెన్స్ కింద ఇస్తారు. నేను చంద్రబాబును సూటిగా అడుగుతున్నా.
మెడికల్ కాలేజీల కోసం ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు ఇవ్వలేరా? సంవత్సరానికి రూ.1000 కోట్లు ఇవ్వలేరా? అమరావతిలో రూ.70 వేల కోట్ల పనులకు టెండర్లు పిలిచామని చెబుతున్నారు. ఇప్పుడున్న 50 వేల ఎకరాలు సరిపోవు. ఇంకో 50 వేల ఎకరాలు కావాలని అడుగుతున్నారు. మొదట 50 వేల ఎకరాలను డెవలప్ చేయడానికి చంద్రబాబు ఇచ్చిన రిపోర్టు ప్రకారమే కావాల్సింది రూ.లక్ష కోట్లు. కానీ ఇంతకు ముందు ఆయన ఖర్చు చేసింది చూస్తే రూ.4500 కోట్లు. అది అలా ఉండగానే మరో 50 వేల ఎకరాలు కావాలంటున్నారు.
అంటే అక్కడ మరో రూ.లక్ష కోట్ల ఖర్చుకు సిద్ధమయ్యారు. అంటే మొత్తం రూ.రెండు లక్షల కోట్లు అమరావతిలో పెట్టడానికి సిద్ధమయ్యారు. అలాంటిది రాష్ట్రంలో కొన్ని లక్షల మందికి కొత్త మెడికల్ కాలేజీలు ఉపయోగపడతాయి. అవి చిరస్థాయిగా నిలి్చపోయే విలువైన సంపద. ప్రైవేటు వారు పేదలను దోచుకోకుండా శ్రీరామరక్ష లాంటిది. అలాంటి వాటికి ఐదేళ్లలో కేవలం రూ.5 వేల కోట్లు ఖర్చు చేయలేరా? ఆశ్చర్యంగా ఉంది.
కార్యక్రమాల నిర్వహణ ఇలా..
ఈ కార్యాచరణలో భాగంగా ప్రతి గ్రామంలో విస్తృతంగా ప్రచారం చేస్తాం. మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడం వల్ల జరిగే నష్టాన్ని, సూపర్ సిక్స్ పేరుతో చంద్రబాబు ప్రజలకు చేస్తున్న మోసాలను వివరిస్తాం. అదే సమయంలో ఆ గ్రామంలో పార్టీ గ్రామ కమిటీలు, అనుబంధ సంఘాల అధ్యక్షుల నియామకాలు పూర్తి చేయాలి. మెడికల్ కాలేజీలకు సంబంధించి క్యూఆర్ కోడ్‌తో ముద్రించిన పాంప్లెట్లు, కోటి సంతకాల సేకరణ కోసం క్యూఆర్ కోడ్‌తో రూపొందించిన లెటర్ కాపీలను గ్రామ కమిటీలు, అనుబంధ సంఘాల అధ్యక్షులకు అందచేయాలి. ప్రతి నియోజకవర్గంలో దాదాపు 100 పంచాయతీలు ఉంటాయనుకుంటే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కనీసం 500 మందితో సంతకాలు సేకరిస్తాం.
ఆ బాధ్యతను కొత్తగా నియమించే గ్రామ కమిటీలు, అనుబంధ సంఘాలకు అప్పగిస్తాం. ఈనెల 10 నుంచి నవంబరు 22 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. మరోవైపు నియోజకవర్గాల్లో అన్ని వర్గాల వారితో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తాం. ప్రతి నియోజకవర్గం ఇన్‌చార్జీ రోజూ రెండు గ్రామాలను సందర్శించి సంతకాల సేకరణను పర్యవేక్షించి అక్కడే మీడియాతో మాట్లాడతారు. అక్టోబర్ 28న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీ నిర్వహించి, నియోజకవర్గ స్థాయి అధికారికి డిమాండ్ పత్రాన్ని అందచేస్తాం. అప్పుడు ఏదో ఒక నియోజకవర్గంలో నేను స్వయంగా ర్యాలీలో పాల్గొంటా.
నవంబర్ 12న జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించి కలెక్టర్లకు డిమాండ్ పత్రాలు అందచేయాలి. రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన కోటి సంతకాల పత్రాలు నవంబరు 23న నియోజకవర్గాల నుంచి జిల్లా కేంద్రాలకు, నవంబరు 24న జిల్లా కేంద్రాల నుంచి విజయవాడ తరలిస్తారు. తదుపరి గవర్నర్‌ను కలిసి అన్ని విషయాలు నివేదిస్తాం. కోటి సంతకాల పత్రాలూ ఆయనకు అందజేస్తాం.