ఏదోలా చంద్రబాబు.. లోకేష్‌ల ఆశీస్సులతో టిక్కెట్ తెచ్చుకుని ఎంపీగా అయితే గెలిచాడు కానీ గెలిచిన నాటి నుంచి సుఖం లేదు నిద్ర లేదు ప్రశాంతత లేదు అన్నట్లుగా తయారైంది కేశినేని చిన్ని (శివనాథ్) పరిస్థితి. ఎటు చూసినా ఆయన గౌరవం తగ్గించే పరిణామాలు జరుగుతున్నాయి తప్ప ఆయన్ను తన పరిధిలోని ఎమ్మెల్యేలు కూడా గౌరవంగా చూడడం లేదు. ఇదేలా ఉంటుండగానే తన సొంత అన్న మాజీ ఎంపీ కేసినేని నాని ఏకంగా తనపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేయడం చిన్నికి మరింత పెద్ద తలనొప్పి తెచ్చి పెట్టింది.
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఏకంగా తనపై ధ్వజం ఎత్తడం రూ.ఐదు కోట్లు తీసుకొని టికెట్ ఇచ్చానని చెప్పడం దీంతోపాటు.. గంజాయి, లిక్కర్, మైనింగ్ వంటి ఇతరత్రా అక్రమ వ్యాపారాలన్నీ తన అనుచరులే చేస్తున్నారని చెప్పడం వంటి పరిణామాలు పార్టీలో కేశినేని చిన్ని పరపతిని గణనీయంగా తగ్గించాయి. అసలు చిన్ని ఎవరు అంటే పేకాట డెన్ నడిపే పెద్ద జూదరి అంటూ పోలికపూడి శ్రీనివాస్ చేసిన కామెంట్ చిన్ని గౌరవాన్ని నేలమట్టం చేసింది.
తెలుగుదేశం పార్టీలో లోకేష్, చంద్రబాబుతో అత్యంత సాన్నిహిత్యం కలిగిన విజయవాడ ఎంపీ, కమ్మ సామాజికవర్గానికి చెందిన కేశినేని చిన్నిని పొలిటికల్ గా టచ్ చేయాలంటే ఎన్నో గట్స్ ఉండాలి. కానీ చిన్నిని పూచికపుల్ల మాదిరి తీసిపారేసిన కొలికపూడి పార్టీలో సంచలనం రేపారు. దీంతో ఇద్దరినీ పార్టీ క్రమశిక్షణ సంఘం ఎదుట హాజరుకావాలి ఆదేశించిన అధిష్టానం మంగళవారం సాయంత్రం ఆ ఇద్దరి నుంచి వివరణలు వాంగ్మూలాలు తీసుకుని బయటకు పంపించింది. అయితే ఆ ఇద్దరు కూడా తాము పార్టీకి విధేయులం అని.. తమకు పార్టీ ఒక దేవాలయం అయితే చంద్రబాబు.. లోకేష్ తమపాలిట దేవుళ్ళు అంటూ ఒకే స్క్రిప్ట్ చదవడంతో క్రమశిక్షణ సంఘం ఇదెక్కడి కోరస్ రా దేవుడా అని తలపట్టుకుంది.
ఇదిలా ఉండగా చిన్నిపై సొంత అన్న, మాజీ ఎంపీ నాని తుపాకీ ఎక్కుబెట్టారు. చిన్నికి చెందిన కంపెనీలు పలు ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డాయని మనీ తీవ్రమైన ఆర్థిక నేరాలు వెనుక చిన్ని హస్తం ఉందని ఆరోపిస్తూ నాని ఏకంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కు ఫిర్యాదు చేశారు. ఈ ఆర్థిక నేరాలన్నింటిపైన విస్తృతంగా దర్యాప్తు చేసి చిన్ని ప్రమేయాన్ని గుర్తించి చర్యలు తీసుకోవాలని నాని చేసిన ఫిర్యాదు ఇప్పుడు తెలుగుదేశంలో ప్రకంపనలు సృష్టిస్తుంది. తనపై సొంత అన్నయ్య ఇలా ఫిర్యాదు చేయాలని చిన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అలాగని ఏమీ చేయలేని పరిస్థితి.. దీంతో అటు కొలికపూడి శ్రీనివాస్ ఇటు సొంత అన్న నాని ఒకేసారి ఎటాక్ చేయడంతో ఎంపీ శివనాథ్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
-సిమ్మాదిరప్పన్న.


