న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు భారీ షాక్ తగిలింది. న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి, భారత సంతతికి చెందిన జోహ్రాన్ మమ్దానీ(34) విజయం సాధించారు. ఎన్నికల్లో ముందు నుంచి మెరుగైన ఆధిక్యంలో కొనసాగిన మమ్దానీ ఘన విజయం అందుకున్నారు. మమ్దానీ విజయం నేపథ్యంలో ఆయనకు పలువురు నేతలు అభినందనలు తెలిపారు.
మేయర్ ఎన్నికల్లో మమ్దానీకి 49.6 శాతం ఓట్లు(6,77,615) పోల్ అయ్యాయి. ప్రత్యర్థి క్యూమోకు 41.6 శాతం ఓట్లు(5,68,488) వచ్చాయి. దీంతో, దాదాపు లక్ష ఓట్లకు పైగా మెజార్టీతో మమ్దానీ విజయం సాధించారు. కాగా, ఒక ఉన్నత కుటుంబం నుంచి స్వయం ప్రకటిత ప్రజాస్వామ్య సోషలిస్ట్ అయిన మమ్దానీ భారత సంతతికి చెందిన తల్లిదండ్రులకు ఉగాండాలో జన్మించాడు. ఏడేళ్ల నుంచి అమెరికాలో ఉంటున్నారు. 2018లో సహజ పౌరసత్వం పొందారు. 2021 నుంచి న్యూయార్క్ చట్టసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు.
ఇక.. ఎన్నికల సందర్భంగా మంగళవారం ఓటర్లు భారీ సంఖ్యలో వచ్చారు. నగర ఎన్నికల బోర్డు తెలిపిన వివరాల ప్రకారం.. దాదాపు రెండు మిలియన్లకు పైగా ఓటర్లు ఓటు వేశారు. 1969 తర్వాత న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో ఇంత భారీ స్థాయిలో ఓటు వేయడం ఇదే మొదటిసారి.

కాగా, అక్టోబర్ 24, 28 మధ్య నిర్వహించిన మారిస్ట్ పోల్‌లో మమ్దానీ.. క్యూమో కంటే 16 పాయింట్లు ఆధిక్యంలో ఉన్నారని తెలిపింది. రిపబ్లిక్న్ కర్టిస్ సైవా అనే సంస్థ కూడా అతనికి 16 శాతం ఆధిక్యాన్ని అంచనా వేసింది. ఇదిలా ఉండగా.. వామపక్ష నేత అయిన జోహ్రన్ మమ్దానీపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల విరుచుకుపడ్డారు. ఆయన గెలిస్తే న్యూయార్క్ నగరం ఆర్థిక, సామాజిక విధ్వంసానికి గురవుతుందని, నగర మనుగడకే ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. మమ్దానీ వంద శాతం కమ్యూనిస్టు పిచ్చొడని ట్రంప్ దుయ్యబట్టడం తెలిసిందే. అయినప్పటికీ మమ్దానీ విజయం సాధించడం విశేషం.
BREAKING: Democratic Socialist Zohran Mamdani wins the New York City mayoral election, Decision Desk HQ projects pic.twitter.com/iphko44pmF
— Republicans against Trump (@RpsAgainstTrump) November 5, 2025
మమ్దానీ హామీ..
జోహ్రాన్ మమ్దానీ సామాజిక కార్యకర్త. ఉగాండాలో భారతీయ మూలాలున్న కుటుంబంలో జన్మించారు. తండ్రి ప్రొఫెసర్ మహ్మూద్ మమ్దానీ, తల్లి ప్రముఖ దర్శకురాలు మీరా నాయర్. భార్య రమా దువాజీ(rama duwaji). ఓ డేటింగ్ యాప్‌తో పరిచయమై.. ప్రేమ పెళ్లితో ఒక్కటయ్యారు. ఎన్నికల సందర్భంగా ఉచిత బస్సు ప్రయాణం హామీతో బాగా పాపులారిటీ సంపాదించుకున్నారు. అలాగే పిల్లల సంరక్షణ, సంపన్నులపై అధిక పన్నులు లాంటి హామీలతో ప్రచారంలో దూసుకెళ్లారు. బెర్నీ సాండర్స్, అలెగ్జాండ్రియా ఒకాసియో-కార్టెజ్ వంటి ప్రముఖులు ఇతనికి మద్దతుగా నిలిచారు. అయితే.. పాలస్తీనా మద్దతుతో పాటు పరిపాలనా అనుభవం లేమి వంటి అంశాలపై విమర్శలూ ఎదుర్కొన్నాడు.
‘గుజరాత్’పై మమ్దానీ వీడియో వైరల్
ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన 2002లో గుజరాత్‌లో జరిగిన ఘర్షణలపై మమ్దానీ చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అక్కడ ముస్లింలను అంతం చేసేందుకు కుట్ర జరిగిందని, చాలామందిని హత్య చేశారని మమ్దానీ ఆరోపించారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహులా మోదీ కూడా యుద్ధ నేరస్తుడేనంటూ మండిపడ్డాడు. మమ్దానీ వ్యాఖ్యలపై పలువురు భారతీయులతో పాటు అమెరికాలోని ప్రవాస భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు.



