చంద్రమా మనసో జాతః – చంద్రుడు (సృష్టికారకుడైన) విరాట్ పురుషుడి మనసు నుండి పుట్టాడు – అని ఋగ్వేద వాక్యం. అందుకే, సముద్రపు ఆటుపోట్లకూ, అమా వాస్య – పూర్ణిమలకూ ఉన్న సంబంధం లాగే, భూమి మీద మనుషుల మనసుల పని తీరు తీవ్రతకూ, ఆకాశంలో చంద్రబింబం వృద్ధి క్షయాలకూ కాదనలేని సంబంధం కనిపిస్తుంది. మానసిక రోగ చికిత్సా నిపుణులు కూడా మద్దతునిచ్చే మాట ఇది.
నిండు పున్నమి దినాలలో మనిషి మనసుకు చురుకు ఎక్కువ. పున్నమి నాళ్ళలో, అటు రసభావాల వైపుగానీ ఇటు ఆధ్యాత్మికత వైపుగానీ మనసు ఎప్పటికంటే ఎక్కువ తీవ్రతతో స్పందిస్తుంది. అందుకే సాధకులకూ, భక్తులకూ, యోగులకూ పౌర్ణమి ప్రత్యేక విశిష్టత గల తిథి. అది మంత్రోపదేశాలకూ, ఉపాసనలకూ, తీవ్రమైన ధ్యానాలకూ మహత్తరమైన ముహూర్తం. పున్నమి అంటేనే పొంగిపోయే మనసు, శరత్కాల పూర్ణిమ అంటే మరీ ఉరకలెత్తు తుంది. శివకేశవులిరువురి అర్చనకూ సమానంగా ప్రశస్తమైనది కార్తిక పౌర్ణమి. ఆ పర్వ దినాన, మనసు పరుగునూ, చురుకునూ మంత్ర జపాల వైపు, ఇష్టదేవతారాధన వైపు మళ్ళిస్తే మరింత ఫలప్రాప్తి పొందవచ్చునని పెద్దల మాట.
కార్తిక పూర్ణిమ మనుషులకే కాదు, దేవతలకు కూడా పవిత్రమైన పర్వదినమని పురాణాలు చెబున్నాయి. ఆస్తికావళికి ఆధ్యాత్మిక రాజధాని అయిన కాశీ క్షేత్రంలో, కార్తిక పూర్ణిమను ‘దేవ దీపావళి’గా పరిగణిస్తారు. వారణాసిలో గంగా తీరాన అన్ని ఘాట్‌లనూ దీపాలతో అలంకరించటంతో, గంగ ఒడ్డు లోకాతీతంగా ప్రకాశిస్తుంది. దేవతలు వారణాసికి వచ్చి గంగామాతను ఘనంగా అర్చించి వెళతారని ఆస్తికుల విశ్వాసం. కార్తిక దీపాలూ, జ్వాలాతోరణాలు, దేవ దీపావళుల లాంటి నైమిత్తిక సంప్రదాయాలతోనూ; అర్చనలూ, జపతపాలూ, అభిషేకాలూ, ధానధర్మాలతోనూ, ఆస్తికులు తమ మనసుకు నచ్చిన మార్గంలో, తమతమ ఇష్ట దేవతలను కొలుచుకొని, విశేషమైన అనుగ్రహం పొందటానికి అనుకూలమైన రోజు కార్తిక పూర్ణిమ. అలాగే, సాధకులు తమలో అనవరతం ప్రకాశించే ఆత్మజ్యోతి వైపు దృష్టి కేంద్రీకరించేందుకూ అది అనువైన రోజు.
– ఎం. మారుతి శాస్త్రి


