 
													కార్తీక మాసంలో మహాశివుడిని భక్తితో పూజిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం, అలాగే కార్తీక మాసం అంటే పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైనది. అందుకే ఈ మాసం శివరాధనకు అంకితం. ఈ మాసంలో ఒక్కసారైనా శివాలయాలన్ని సందర్శించి, భక్తితో దీపారాధన చేస్తే మోక్షం లబిస్తుందని, కష్టాలన్నీ తొలగి, అన్నీ శుభాలే జరుగుతాయని విశ్వాసం. కార్తీక మాసంలో ఒక్క రోజులోనే పంచారామాలను ఒక్కరోజులోనే సందర్శించడం మరో విశేషం. ఈ సందర్బంగా తెలుగు రాష్ట్రాల్లో సందర్శించదగిన కొన్ని శివాలయాల గురించి తెలుసుకుందాం.
నిజానికి చెప్పాలంటే శివాలయం లేని గ్రామం ఉండదు. అయినా ప్రసిద్ధ శివాలయాలను, జ్యోతిర్లింగ పుణ్యక్షేత్రాలను దర్శించి తరించాలని భక్తులు భావిస్తారు.

అమరారామం: గుంటూరు జిల్లాలోని అమరావతిలో ప్రధాన దైవం అమరలింగేశ్వర స్వామి. అమరేంద్ర ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించినందున ఈ పేరు వచ్చింది. కృష్టా నది దక్షిణ ఒడ్డున ఉన్న బాల చాముండిక అమరలింగేశ్వర స్వామి భార్య. ఈ ఆలయం రెండు అంతస్తులను కలిగి ఉన్న భారీ శివలింగానికి ప్రసిద్ధి చెందింది.

ద్రాక్షారామం: తూర్పు గోదావరి జిల్లాలోని రామచంద్రపురం పట్టణానికి సమీపంలో ఉన్న ద్రాక్షారామంలో కొలువైన శివుడిని భీమేశ్వర స్వామి అని పిలుస్తారు. ఇక్కడ శివలింగాన్ని సూర్య భగవానుడు స్వయంగా ప్రతిష్టించాడని నమ్ముతారు.దీనిని దక్షిణ కాశి అని కూడా పిలుస్తారు. ఇక్కడి రాతి స్థంభాన్ని ఆలింగనం చేసుకుని భక్తితో మొక్కితే కోరిన కోర్కెలు తీరతాయని విశ్వాసం.

సోమారామం: భీమవరంలో ఉన్న సోమారామం పంచారామాలలో మూడవది. ఇక్కడ శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్టించాడట. ఇక్కడ శివుడిని పూజించడం ద్వారా చంద్రుడు తన పాపాలను పోగొట్టుకున్నాడని నమ్ముతారు. అందుకే దీనికి సోమారామం అని పేరు వచ్చింది. చంద్రుని దశల ఆధారంగా దాని రంగు మారుతూ ఉంటుంది. పౌర్ణమి సమయంలో , సోమారామంలోని శివలింగం తెల్లగాను, అమావాస్య కు నల్లగా మారుతుందట.

సామర్లకోట: తూర్పు గోదావరి జిల్లాలోని సామర్లకోటలోని కుమార రామ ఆలయం పంచారామాలలో చివరిది. వుడిని కుమార భీమేశ్వర స్వామిగా  కొలుస్తారు. ఇక్కడ శివలింగాన్ని కార్తికేయుడు ప్రతిష్టించాడని ప్రతీతి. పూర్తిగా సున్నపురాయితో తయారు చేసిన ఇక్కడి శివలింగం దాదాపు 16 అడుగుల ఎత్తు ఉంటుంది అలాగే ఈ ఆలయం 100 స్తంభాల మండపం, ప్రవేశ ద్వారం వద్ద ఉన్న ఏకశిలా నంది ప్రత్యేకం.

కోటప్పకొండ : అత్యంత ప్రసిద్ధ శైవ దేవాలయాలలో గుంటూరు జిల్లాలోని కోటప్ప కొండ  ఒకటి.  1587 అడుగుల ఎత్తులో ఉన్న ఒక కొండలో అత్యంత పురాతనమైన శివాలయం. శివుడిని త్రికూటేశ్వర స్వామి అని పిలుస్తారు.
కోటప్పకొండ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా నరసరావు పేటకు 15 కిలోమీటర్ల దూరంలో ఉండే కోటప్పకొండలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఇక్కడ శివయ్యను త్రికుటేశ్వరంగా, త్రికుటాచలేశ్వరుడు, త్రికోటేశ్వరునిగా కొలుస్తారు. ఈ కోటప్ప కొండను కాకులు వాలని కొండగా కూడా ఇది ప్రసిద్ధి.

శ్రీశైలం: నంద్యాల జిల్లాలో కొలువై ఉన్న శ్రీశైలం దేవస్థానం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి 179 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్ నుంచి వయా పాలమూరు జిల్లా నుంచి 229 కిలోమీటర్ల దూరంలో ఈ జ్యోతిర్లింగ పుణ్యక్షేత్రం ఉంది. ఈ దేవాలయాన్ని రెండో శతాబ్దంలో నిర్మించాని చెబుతారు. ఈ క్షేత్రంలో పాతాళగంగ, శిఖరేశ్వర దేవాలయం, సాక్షి గణపతి దేవాలయం, పాలధార, పంచధార వంటి సందర్శనీయ ప్రదేశాలు.

ఛాయ సోమేశ్వర స్వామి : నల్లగొండ జిల్లాలోని ఛాయ సోమేశ్వర స్వామి ఆలయం. దీన్ని ఇక్ష్వాకు వంశస్తులు 11, 12వ శతాబ్దంలో నిర్మించారట. ఈ గుడిలోని శివ లింగం ప్రతిరోజూ శాశ్వతమైన నీడను కలిగి ఉంటుంది. అందుకే ఈ గ ఇక్కడి శివుడికి ఛాయా సోమేశ్వరుడనే పేరు వచ్చింది.

రామప్ప దేవాలయం: తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచ వారసత్వ సంపద  గుర్తింపు తెచ్చుకున్న ముఖ్యమైన దేవాలయం. తెలంగాణలోని ములుగు జిల్లా పాలంపేట గ్రామంలో ఉంది. అత్యున్నతమైన వాస్తు, శిల్ప సంపదతో ఎనిమిదో శతాబ్దంలో నిర్మించిన  ఆలయం. రామప్ప గుడిగా పిలిచే రుద్రేశ్వర స్వామి ఆలయం ఓరుగల్లును పరిపాలించిన కాకతీయ రాజులు నిర్మించారు.

యాగంటి : కర్నూలు జిల్లాలోనే మరో ప్రముఖ శివాలయం ఉంది. 5వ శతాబ్దంలో నిర్మించారని ప్రతీతి. పార్వతీ పరమేశ్వరులు అర్ధనాదీశ్వర రూపంలో ఒకే రాతితో చెక్కిన విగ్రహ రూపంలో దర్శనమివ్వడం ఇక్కడి ప్రత్యేకత. అంతేకాదు శివయ్యను లింగ రూపంలో కాకుండా విగ్రహ రూపంలో  కొలవడం మరో ప్రత్యేకత.  అలాగే యాగంటి నంది ప్రతీ ఏడాదీ కొంచెం  కొంచెం పెరుగుతుందని చెబుతారు.

ఆలంపూర్ నవ బ్రహ్మ. : జోగుళాంబ-గద్వాల జిల్లాలో నవబ్రహ్మగా పిలిచే ఈ తొమ్మిది దేవాలయాల శ్రేణిని చాళుక్యులు నిర్మించారు. పురాణాల ప్రకారం ఒకసారి బ్రహ్మ శివుని కోసం తపస్సు చేస్తాడు. శివుడు అనుగ్రహించి ప్రపంచ సృష్టించడానికి కావలసిన శక్తులు బ్రహ్మకు ప్రసాదిస్తూ ఆశీర్వాదిస్తాడు. అందువల్ల శివునికి బ్రహ్మేశ్వరుడు అని కూడా పిలుస్తారు. బ్రహ్మ ఉపసర్గ మొత్తం కుమార, అర్క, వీర, బాల, స్వర్గ, గరుడ, విశ్వ, పద్మ, తారక బ్రహ్మ అనే తొమ్మిది ఆలయాలున్నాయి.

సంగమేశ్వరుడు : కర్నూలు జిల్లాలో సప్త నదుల మధ్య కొలువై ఉన్న సంగమేశ్వర ఆలయం ప్రత్యేకత. సప్తనదీ సంగమంగా పిలువబడే శివయ్య ఏడాదిలో కేవలం వేసవి కాలంలో మాత్రమే భక్తులకు దర్శనమిస్తాడు. వేల ఏళ్లనాడు ఆలయంలో ప్రతిష్టించిన వేప లింగం ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉండటం విశేషం.

వేములవాడ రాజన్న: రాజన్న సిరిసిల్లాల జిల్లాలో వేములవాడ దేవస్థానంలో కొలువై ఉన్న శివాలయం నిర్మాణం, ఆధ్యాత్మిక పవిత్రత రెండింటికీ ప్రసిద్ధి చెందింది. దక్షిణ కాశీగా పేరొందిది. ఇక్కడి ధర్మ గుండం జలాల్లో తప్పనిసరిగా పవిత్ర స్నానం చేయాలని పెద్దలు చెబుతారు.

కీసర : లింగ స్వరూపుడైన మహాశివుడు రాముని కోరి క మేరకు శ్రీరామలింగేశ్వరస్వామిగా ఉద్భవించిన అపురూప శైవక్షేత్రమే కీసరగుట్ట. శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయం పశ్చిమ అభిముఖంగా ఉండటం ఇక్కడ విశేషం.
ఇవి కొన్ని శివాలయాలు మాత్రమే. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మరెన్నో శివాలయాలు, పవిత్రమైనవిగా, భక్తులు కోర్కెలు తీర్చే కొంగుబంగారం విలసిల్లుతున్నాయి. భక్తుల ఆదరణకు నోచుకున్నాయి.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
