breaking news
siva temples
-
ఆనతి నీయరా! మహాశివరాత్రికి వైభవంగా ముస్తాబవుతున్న మహేశ్వరం
ఆనతి నీయరా హరా.. సన్నుతి సేయగా.. సమ్మతి నీయరా దొరా.. సన్నిధి చేరగా.. నీ ఆన లేనిదే గ్రహింప జాలున వేదాల వాణితో విరించి విశ్వ నాటకం.. అన్నట్లు శివరాత్రి ఉత్సవాలకు నగరం చుట్టుపక్కల ఉన్న పలు శైవ క్షేత్రాలు ముస్తాబవుతున్నాయి. విద్యుత్ కాంతుల ధగధగలతో దేదీప్యమానంగా వెలుగులు చిమ్ముతున్నాయి. యాత్రికుల కోసం ఆయా ఆలయ కమిటీలు, దేవాదాయ శాఖ అన్ని రకాల ఏర్పాట్లనూ పూర్తి చేస్తున్నాయి. ముఖ్యంగా నగరానికి చేరువగా ఉన్న కీసరగుట్టలోని శ్రీభవానీ శివదుర్గ సమేత రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తుండడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేస్తోంది దేవాలయ కమిటీ. దీంతో పాటు మహేశ్వరం శివగంగ రాజరాజేశ్వర స్వామి ఆలయం కూడా మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది.. ఈ నేపథ్యంలో వీటి గురించిన మరిన్ని విశేషాలు.. – కీసర, మహేశ్వరం నగరానికి 35 కిలోమీటర్ల దూరంలో పచ్చని ప్రకృతి మధ్యన కీసరగుట్టలో కొలువుదీరిన శ్రీభవానీ శివదుర్గ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం శివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. యేటా శివరాత్రికి లక్షల సంఖ్యతో భక్తులు ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటారు. నేటి నుంచి మార్చి 1 వరకూ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.. సికింద్రాబాద్ నుండి కీసరగుట్టకు బస్సుసౌకర్యం ఉంది. ఇసీఐఎల్ నుండి 15 కిలోమీటర్ల ప్రయాణం. బ్రహోత్సవాల సందర్భంగా నగరం నలుమూలల నుంచి ఆర్టీసీ వారు 200 ప్రత్యేక బస్సులను నడుపుతారు. ఇదీ స్థలపురాణం.. కీసరగుట్టలో భక్తులచే పూజింపబడుతున్న శ్రీరామలింగేశ్వరుడు స్వయంగా శ్రీరామునిచే ప్రతిష్టించబడినట్లు ప్రతీతి. రావణుడు తపస్సు ద్వారా బ్రహ్మత్వంపొందాడు. రావణబ్రహ్మను హతమార్చినందువల్ల బ్రహ్మహత్యాదోషం అంటకుండా శ్రీరాముడు ఈ ప్రదేశంలో శివలింగార్చన చేయాలనుకుంటాడు. కాశీ నుంచి శివలింగం తెమ్మని హనుమంతుని పంపిస్తాడు. సమయం మించిపోతున్నా హనుమంతుడు రాకపోవడంతో శ్రీరాముడు ప్రార్థన ఆలకించిన శివుడు స్వయంగా లింగరూపంలో దర్శనమిస్తాడు. ఆ లింగాన్నే శ్రీరాముడు ప్రతిష్టించి పూజచేశాడని స్థలపురాణం చెబుతోంది. మూడు ప్రత్యేకతలు.. ఈ ఆలయానికి మూడు ప్రత్యేకతలున్నాయి. ఇక్కడి శివాలయం పశ్చిమాభిముఖంగా ఉంటుంది. గర్భగుడిలో శివలింగం సైకత లింగం (ఇసుకతో చేసినది)గా ప్రసిద్ధికెక్కింది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ శివాలయానికి ఎదురుగా హనుమంతుడిచే విసిరేయబడ్డట్టుగా చెబుతున్న శివలింగాలు చెల్లాచెదురుగా పడిఉంటాయి. గుట్ట పరిసర ప్రాంతాల్లో 107 శివలింగాలు ఉండగా.. చివరి లింగం నల్గొండ జిల్లా కొలనుపాకలో ఉంది. వీటికి భక్తులు తైలాభిషేకాలు చేస్తారు. వీటితోపాటు జైన విగ్రహాలు, గర్భాలయంలో అభిషేకం నీరు ఎటు వెళ్తాయో ఇప్పటికీ తెలియకపోవడం ఇక్కడి విశేషం. మహేశ్వరం శివగంగ రాజరాజేశ్వర స్వామి ఆలయం మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. ఈ నెల 25 మంగళవారం నుండి మార్చి 1 శనివారం వరకూ ఉత్సవాలు జరుగనున్నాయని ఆలయ కమిటీ చైర్మన్ అల్లె కుమార్ గౌడ్ పేర్కొన్నారు. గంగలో శివుడు, పార్వతి ఉండడం ఇక్కడి ఆలయ విశేషం. బ్రహ్మోత్సవాలకు మహబూబ్‌నగర్, హైదరాబాద్, వికారాబాద్, మేడ్చల్‌తో పాటు ఇతర జిల్లాల నుంచి భక్తులు రానున్నట్లు తెలిపారు. నగరం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి చారి్మనార్ నుంచి 253ఎం, 253టి, 253కె, 253హెచ్, సికింద్రాబాద్ నుంచి 8ఏ, 253ఎం, జూబ్లీ బస్సు డిపో నుంచి 253ఎం బస్సుల సౌకర్యం ఉంది. దీంతో పాటు పలు డిపోల నుంచి ఆర్టీసి ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది.చరిత్రలోకి వెళితే.. తానీషా నవాబు వద్ద మంత్రులుగా చేసిన అక్కన్న మాదన్నలు 1672లో తమ పర్యటనలో భాగంగా శిథిలావస్థలోని శివగంగ రాజరాజేశ్వర ఆలయాన్ని పునరుద్ధరించాలని నిర్ణయించుకున్నారు. అప్పటి రాజధాని గోల్కొండ కోటకు పశ్చిమ భాగాన 37 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. ఎనిమిది సంవత్సరాల కాలంలో ఆలయ నిర్మాణం పూర్తి చేశారు. 1677లో ఈ ఆలయం పునర్నిర్మాణంలో ఉన్నప్పుడు శ్రీశైలం దర్శనానికి వెళ్లిన శివాజీ కూడా మార్గమధ్యలో రాజరాజేశ్వరస్వామిని దర్శించుకున్నట్లు చరిత్ర చెతుతోంది. ఆలయంపై 1687లో మొఘల్ సామ్రాజ్యానికి చెందిన ఔరంగజేబు తన సైన్యంతో దాడి చేసి గుడిని ధ్వంసం చేసినట్లు చెబుతుంటారు. నాటి శిథిలాలు ఇప్పటికీ ఉన్నాయి. శివగంగ చుట్టూ 16 శివాలయాలు ఉండటం దీని ప్రత్యేకత. చారిత్రక ప్రశస్తి.. కీసరగుట్ట ప్రాంతాన్ని క్రీ.పూ 4వ శతాబ్దం నుండి 6వ శతాబ్దం వరకూ విష్ణుకుండినుల పాలించినట్లు చారిత్రక ఆధారాలు లభ్యమయ్యాయి. పుట్టుకతో బ్రాహ్మణులైన క్ష్రతియులుగా వ్యవహరించిన విష్ణుకుండినులు కీసరగుట్టను విజయానికి చిహ్నంగా భావించి ఆయుధాగారంగా వృద్ధిచేశారు. విష్ణుకుండినులలో శ్రేష్టుడైన రెండో మాధవవర్మ నరమేధయాగం ఇక్కడే చేసినట్లు ఆధారాలు చెబుతున్నాయి. పురావస్తుశాఖ జరిపిన తవ్వకాల్లో ఆ కాలం నాటి అవశేషాలు, నాణేలు, మట్టిపాత్రలు, అలంకరణ వస్తువులు, రేకులు, రాజప్రాసాదాలు బయటపడ్డాయి.అన్ని ఏర్పాట్లూ చేశాం.. బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశాం. జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు ఏర్పడకుండా చర్యలు చేపట్టాం. పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, విద్యుత్, ఆరోగ్యం, పారిశుద్ధ్యం వంటి శాఖల సమన్వయంతో పనిచేస్తున్నాం. – అల్లె కుమార్, శివగంగ రాజరాజేశ్వర ఆలయ కమిటీ చైర్మన్, మహేశ్వరం -
తెలుగురాష్ట్రాల్లో కార్తీకశోభ
-
శైవ క్షేత్రాల్లో భక్తుల కిటకిట
-
శైవ క్షేత్రాల్లో భక్తుల కిటకిట
విజయవాడ: కార్తీకమాసం ఆఖరు సోమవారం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాల్లో భక్తులు కిటకిటలాడుతున్నారు. దీపోత్సవాలు నిర్వహించి ఈశ్వరుడిని దర్శించుకుని తరించారు. విజయవాడలోని కృష్ణానది దుర్గాఘాట్‌లో భక్తులు తెల్లవారుజామునుంచే పుణ్య స్నానాలు చేశారు. అరటి దొప్పలలో దీపారాధనలు చేశారు. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గామల్లేశ్వరస్వామి వార్లను దర్శించుకున్నారు. కృష్ణాజిల్లాలోని కోడూరు మండలం సంగమేశ్వరం, మచిలీపట్నం మండలం మంగినపూడిలో తెల్లవారుజామున సముద్ర స్నానాలకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. గుంటూరుజిల్లా బాపట్లలోని సూర్యలంక, ప్రకాశంజిల్లా చీరాల వాడరేవుల్లో భక్తులు సముద్ర స్నానాలు చేశారు. శైవక్షేత్రాలు శివనామస్మరణతో మారుమోగాయి. తిరుపతి కపిలతీర్థంలో భక్తులు బారులు తీరారు. గుంటూరుజిల్లా అమరావతి, కోటప్పకొండ, పశ్చిమగోదావరిజిల్లా భీమవరం, పాలకొల్లు, తూర్పుగోదావరిజిల్లాలోని దక్షారామం వంటి పంచారామాల్లో భక్తులు కార్తీక మాస పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు బారులు తీరారు. సోమవారం తెల్లవారుజాము నుంచే పాతాళ గంగలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తుండటంతో.. ఘాట్లకు పుష్కర శోభ సంతరించుకుంది. కరీంనగర్జిల్లా వేములవాడలో భక్తులు గుండంలో స్నానాలు చేసి రాజరాజేశ్వరస్వామిని దర్శించుకున్నారు. కొమురవెల్లిలలో కూడా భక్తులు దీపారాధనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి బాసర సరస్వతి అమ్మవారిని, ధర్మపురిలో నర్సింహస్వామి ఆలయాన్ని, కాళేశ్వరంలోని ఆలయాన్ని, వరంగల్ వేయిస్తంభాల ఆలయం, రామప్ప ఆలయాలను దర్శించుకున్నారు. మేడ్చల్ జిల్లా కీసర గుట్టలో పెద్ద ఎత్తున భక్తులు బారులుతీరారు. కీసర గుట్టపై కొలువైన రామలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తులు కిటకిట లాడుతున్నారు. తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనానికి బారులుతీరిన భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేక అలంకరణలతో రామలింగేశ్వర స్వామి ఆలయంలో కొత్త శోభను సంతరించుకుంది.