ఆనతి నీయరా! మహాశివరాత్రికి వైభవంగా ముస్తాబవుతున్న మహేశ్వరం | Maha Shivaratri 2025 celebration getting ready Maheswaram | Sakshi
Sakshi News home page

ఆనతి నీయరా! మహాశివరాత్రికి వైభవంగా ముస్తాబవుతున్న మహేశ్వరం

Feb 24 2025 3:11 PM | Updated on Feb 24 2025 4:32 PM

Maha Shivaratri 2025 celebration getting ready Maheswaram

నేటి నుంచి పలు ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు 

కీసర, మహేశ్వరం ఆలయాల్లో భారీ ఏర్పాట్లు 

చరిత్రకు ఆనవాళ్లుగా నిలుస్తున్నఈ ఆలయాలకు భక్తుల నుంచి విశేష ఆదరణ

ఆనతి నీయరా హరా.. సన్నుతి సేయగా.. సమ్మతి నీయరా దొరా.. సన్నిధి చేరగా.. నీ ఆన లేనిదే గ్రహింప జాలున వేదాల వాణితో విరించి విశ్వ నాటకం.. అన్నట్లు శివరాత్రి ఉత్సవాలకు నగరం చుట్టుపక్కల ఉన్న పలు శైవ క్షేత్రాలు ముస్తాబవుతున్నాయి. విద్యుత్‌ కాంతుల ధగధగలతో దేదీప్యమానంగా వెలుగులు చిమ్ముతున్నాయి. యాత్రికుల కోసం ఆయా ఆలయ కమిటీలు, దేవాదాయ శాఖ అన్ని రకాల ఏర్పాట్లనూ పూర్తి చేస్తున్నాయి. ముఖ్యంగా నగరానికి చేరువగా ఉన్న కీసరగుట్టలోని శ్రీభవానీ శివదుర్గ సమేత రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తుండడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేస్తోంది దేవాలయ కమిటీ. దీంతో పాటు మహేశ్వరం శివగంగ రాజరాజేశ్వర స్వామి ఆలయం కూడా మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది.. ఈ నేపథ్యంలో వీటి గురించిన మరిన్ని విశేషాలు..  – కీసర, మహేశ్వరం   

నగరానికి 35 కిలోమీటర్ల దూరంలో పచ్చని ప్రకృతి మధ్యన కీసరగుట్టలో కొలువుదీరిన శ్రీభవానీ శివదుర్గ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం శివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. యేటా శివరాత్రికి లక్షల సంఖ్యతో భక్తులు ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటారు. నేటి నుంచి మార్చి 1 వరకూ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.. సికింద్రాబాద్‌ నుండి కీసరగుట్టకు బస్సుసౌకర్యం ఉంది. ఇసీఐఎల్‌ నుండి 15 కిలోమీటర్ల ప్రయాణం. బ్రహోత్సవాల సందర్భంగా నగరం నలుమూలల నుంచి ఆర్టీసీ వారు 200 ప్రత్యేక బస్సులను నడుపుతారు. 

ఇదీ స్థలపురాణం.. 
కీసరగుట్టలో భక్తులచే పూజింపబడుతున్న శ్రీరామలింగేశ్వరుడు స్వయంగా శ్రీరామునిచే ప్రతిష్టించబడినట్లు ప్రతీతి. రావణుడు తపస్సు ద్వారా బ్రహ్మత్వంపొందాడు. రావణబ్రహ్మను హతమార్చినందువల్ల బ్రహ్మహత్యాదోషం అంటకుండా శ్రీరాముడు ఈ ప్రదేశంలో శివలింగార్చన చేయాలనుకుంటాడు. కాశీ నుంచి శివలింగం తెమ్మని హనుమంతుని పంపిస్తాడు. సమయం మించిపోతున్నా హనుమంతుడు రాకపోవడంతో శ్రీరాముడు ప్రార్థన ఆలకించిన శివుడు స్వయంగా లింగరూపంలో దర్శనమిస్తాడు. ఆ లింగాన్నే శ్రీరాముడు ప్రతిష్టించి పూజచేశాడని స్థలపురాణం చెబుతోంది. 

మూడు ప్రత్యేకతలు.. 
ఈ ఆలయానికి మూడు ప్రత్యేకతలున్నాయి. ఇక్కడి శివాలయం పశ్చిమాభిముఖంగా ఉంటుంది. గర్భగుడిలో శివలింగం సైకత లింగం (ఇసుకతో చేసినది)గా ప్రసిద్ధికెక్కింది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ శివాలయానికి ఎదురుగా హనుమంతుడిచే విసిరేయబడ్డట్టుగా చెబుతున్న శివలింగాలు చెల్లాచెదురుగా పడిఉంటాయి. గుట్ట పరిసర ప్రాంతాల్లో 107 శివలింగాలు ఉండగా.. చివరి లింగం నల్గొండ జిల్లా కొలనుపాకలో ఉంది. వీటికి భక్తులు తైలాభిషేకాలు చేస్తారు. వీటితోపాటు జైన విగ్రహాలు, గర్భాలయంలో అభిషేకం నీరు ఎటు వెళ్తాయో ఇప్పటికీ తెలియకపోవడం ఇక్కడి విశేషం. 

మహేశ్వరం శివగంగ రాజరాజేశ్వర స్వామి ఆలయం మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. ఈ నెల 25 మంగళవారం నుండి మార్చి 1 శనివారం వరకూ ఉత్సవాలు జరుగనున్నాయని ఆలయ కమిటీ చైర్మన్‌ అల్లె కుమార్‌ గౌడ్‌ పేర్కొన్నారు. గంగలో శివుడు, పార్వతి ఉండడం ఇక్కడి ఆలయ విశేషం. బ్రహ్మోత్సవాలకు మహబూబ్‌నగర్, హైదరాబాద్, వికారాబాద్, మేడ్చల్‌తో పాటు ఇతర జిల్లాల నుంచి భక్తులు రానున్నట్లు తెలిపారు. నగరం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి చారి్మనార్‌ నుంచి 253ఎం, 253టి, 253కె, 253హెచ్, సికింద్రాబాద్‌ నుంచి 8ఏ, 253ఎం, జూబ్లీ బస్సు డిపో నుంచి 253ఎం బస్సుల సౌకర్యం ఉంది. దీంతో పాటు పలు డిపోల నుంచి ఆర్టీసి ప్రత్యేక  సర్వీసులు నడుపుతోంది.

చరిత్రలోకి వెళితే.. 
తానీషా నవాబు వద్ద మంత్రులుగా చేసిన అక్కన్న మాదన్నలు 1672లో తమ పర్యటనలో భాగంగా శిథిలావస్థలోని శివగంగ రాజరాజేశ్వర ఆలయాన్ని పునరుద్ధరించాలని నిర్ణయించుకున్నారు. అప్పటి రాజధాని గోల్కొండ కోటకు పశ్చిమ భాగాన 37 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. ఎనిమిది సంవత్సరాల కాలంలో ఆలయ నిర్మాణం పూర్తి చేశారు. 1677లో ఈ ఆలయం పునర్‌నిర్మాణంలో ఉన్నప్పుడు శ్రీశైలం దర్శనానికి వెళ్లిన శివాజీ కూడా మార్గమధ్యలో రాజరాజేశ్వరస్వామిని దర్శించుకున్నట్లు చరిత్ర చెతుతోంది. ఆలయంపై 1687లో మొఘల్‌ సామ్రాజ్యానికి చెందిన ఔరంగజేబు తన సైన్యంతో దాడి చేసి గుడిని ధ్వంసం చేసినట్లు చెబుతుంటారు. నాటి శిథిలాలు ఇప్పటికీ ఉన్నాయి. శివగంగ చుట్టూ 16 శివాలయాలు ఉండటం దీని ప్రత్యేకత.  

చారిత్రక ప్రశస్తి.. 
కీసరగుట్ట ప్రాంతాన్ని క్రీ.పూ 4వ శతాబ్దం నుండి 6వ శతాబ్దం వరకూ విష్ణుకుండినుల పాలించినట్లు చారిత్రక ఆధారాలు లభ్యమయ్యాయి. పుట్టుకతో బ్రాహ్మణులైన క్ష్రతియులుగా వ్యవహరించిన విష్ణుకుండినులు కీసరగుట్టను విజయానికి చిహ్నంగా భావించి ఆయుధాగారంగా వృద్ధిచేశారు. విష్ణుకుండినులలో శ్రేష్టుడైన రెండో మాధవవర్మ నరమేధయాగం ఇక్కడే చేసినట్లు ఆధారాలు చెబుతున్నాయి. పురావస్తుశాఖ జరిపిన తవ్వకాల్లో ఆ కాలం నాటి అవశేషాలు, నాణేలు, మట్టిపాత్రలు, అలంకరణ వస్తువులు, రేకులు, రాజప్రాసాదాలు బయటపడ్డాయి.

అన్ని ఏర్పాట్లూ చేశాం.. 
బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశాం. జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు ఏర్పడకుండా చర్యలు చేపట్టాం. పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్, విద్యుత్, ఆరోగ్యం, పారిశుద్ధ్యం వంటి శాఖల సమన్వయంతో పనిచేస్తున్నాం. 
– అల్లె కుమార్, శివగంగ రాజరాజేశ్వర ఆలయ కమిటీ చైర్మన్, మహేశ్వరం  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement