
సాక్షి, హైదరాబాద్: ఏపీపై పడి పచ్చమూక దోచుకుని తింటుందంటూ వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఏపీ ప్రజలు కష్టాల్లో ఉన్నారని.. కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. ‘‘పేద విద్యార్థి వైద్య విద్యను అందించేందుకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మెడికల్ కాలేజీలు తెచ్చింది. అలాంటి మెడికల్ కాలేజీలను కూటమి సర్కార్ అంగట్లో పెట్టి అమ్ముతుందని సతీష్‌రెడ్డి దుయ్యబట్టారు.
రైతులకు రూ.25 వేల ఆర్థిక సహాయం అన్నారు. కనీసం ఇలాంటి ఒక హామీ ఇచ్చామన్న విషయం కూడా కూటమికి గుర్తు లేదు. ఫీజు రీఎంబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయకపోవడంతో విద్యా సంస్థలు నడపలేని పరిస్థితి. ఏపీలో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. వైఎస్ జగన్‌పై విష ప్రచారం చేయడమే కూటమి ఏజెండాగా పెట్టుకున్నారు. వైఎస్ జగన్ బంధువు అనిల్ రెడ్డి లిక్కర్ స్కామ్‌లో ఉన్నాడంటూ కూటమి ప్రభుత్వం లీకులు ఇస్తుంది. రాజ్ కసిరెడ్డి దగ్గర నుంచి తీసుకున్న నోట్లపై పెద్ద డ్రామా చేశారు. ఏపీలో యూరియా కొరత తీవ్ర స్థాయిలో ఉంది. కూటమి ప్రభుత్వం పలుకుబడి అంతా వైఎస్సార్‌సీపీ నేతల పై కక్ష సాధింపు చర్యల కోసం వాడుతున్నారు.’’ అంటూ సతీష్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘వైఎస్ భారతికి రెండు కంపెనీలలో వాటాలున్నాయని ఆంధ్రజ్యోతిలో రాశారు.. దీన్ని రాధాకృష్ణ నిరూపిస్తారా?.. నిరూపించకపోతే పరువు నష్టం దావా వేస్తాం. వైఎస్ భారతి నిరాడంబరంగా జీవిస్తున్నారు. స్వచ్ఛంద సంస్థకు ఎంతో సహాయం చేస్తున్నారు.’’ అని సతీష్‌రెడ్డి పేర్కొన్నారు. ‘‘మద్యం ఏరులైపారుతుంది. రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం రేట్లు పెంచారు. నాడు-నేడు పేరుతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సమూల మార్పు తీసుకువచ్చింది. రాష్ట్రంలో ఉన్న డిస్టరీలు అన్ని చంద్రబాబు హాయాంలో ఏర్పాటు చేసినవే.. చంద్రబాబు నీ అబద్దాలు ఆపు’’ అంటూ ఎస్వీ సతీష్‌రెడ్డి నిప్పులు చెరిగారు.
