
ఏప్రిల్ 1 నుంచి రెండోదశ.. తాత్కాలిక షెడ్యూల్ ప్రకటన త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్న ఎన్‌టీఏ
సాక్షి, హైదరాబాద్: జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి ఉమ్మడి ప్రవేశపరీక్ష (జేఈఈ మెయిన్–2026)ను వచ్చే ఏడాది జనవరి 21 నుంచి 30 వరకు నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రకటించింది. ప్రవేశపరీక్ష తొలిదశకు ఈ నెలలోనే ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని తెలిపింది. అలాగే ఏప్రిల్ ఒకటి నుంచి 10 వరకు రెండో దశను నిర్వహిస్తామని పేర్కొంది. రెండో దశ కోసం జనవరి చివరి వారంలో దరఖాస్తులు స్వీకరిస్తామని వివరించింది.
ఈ మేరకు తాత్కాలిక షెడ్యూల్ ప్రకటించింది. ఈలోగా విద్యార్థులంతా వారి ఆధార్ కార్డుల్లో తప్పులు సరిచేసుకోవాలని సూచించింది. అయితే నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తుల స్వీకరణ తేదీలను ఎన్‌టీఏ ఇంకా ఖరారు చేయలేదు. త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు అధికార వర్గాల సమాచారం. కాగా, దేశవ్యాప్తంగా విద్యార్థుల నుంచి వచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకున్న ఎన్‌టీఏ.. ఈసారి జేఈఈ మెయిన్ పరీక్ష కేంద్రాలను పెంచాలని నిర్ణయించింది.