
17వేల ‘ఉన్నత’ విద్యార్థులపై భారీ అధ్యయనం
క్లాసులో ఫోను వాడనివాళ్లు చదువులో సూపర్
అనేక దేశాల్లోని బడుల్లో స్మార్ట్‌ఫోన్‌పై నిషేధం
అమెరికాలో 35 రాష్ట్రాల్లో స్కూళ్లలో ‘నో ఫోన్’
స్మార్ట్‌ఫోన్ ఎంతగా మన దైనందిన జీవితంలో మమేకం అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర లేదు. కర్ణుడి కవచ కుండలాల్లా.. అది నిరంతరం మనతో ఉండాల్సిందే. కాలేజీ విద్యార్థులకుతోడు బడి ఈడు పిల్లల్లోనూ ఫోన్ వాడకం విపరీతంగా పెరిగింది. ఈ అలవాటే వారిని క్లాస్ రూముల్లోకి ఫోన్ తీసుకెళ్లేలా చేస్తోంది. తరగతి గదిలోకి ఫోన్ లేకుండా వెళ్లిన విద్యార్థులు విద్యాపరంగా మెరుగ్గా రాణించినట్టు తాజా అధ్యయనంలో తేలింది.
భారీ అధ్యయనం
పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలోని వార్టన్ స్కూల్ ప్రొఫెసర్ డాక్టర్ ఆల్ఫ్ సుంగు తన సహచరులతో కలిసి ఇటీవల భారత్‌లో ఓ వినూత్న అధ్యయనం చేపట్టారు. 10 ఉన్నత విద్యా సంస్థలలో చదువుతున్న 16,955 మంది విద్యార్థులను స్మార్ట్ ఫోన్ ఎలా ప్రభావితం చేసిందన్నదే ఆ అధ్యయన సారాంశం. తరగతి గదిలోకి ఫోన్ తీసుకుపోని విద్యార్థులు చదువుల్లో బాగా రాణించినట్టు ఆ అధ్యయనంలో తేలింది.
తక్కువ పనితీరు కనబరుస్తున్న, అలాగే సైన్స్, గణితం కాకుండా ఇతర సబ్జెక్టులను చదువుతున్న మొదటి సంవత్సరం విద్యార్థులు కూడా ఫోన్ వాడకపోవడం వల్ల ఎక్కువ ప్రతిభ చూపినట్టు డాక్టర్ సుంగు తెలిపారు. ఫోన్ నిషేధించడం వల్ల తరగతి గది ఫలితాలు మెరుగుపడతాయనడానికి బలమైన ఆధారాలను నివేదిక అందిస్తుందని నార్త్ కరోలినా విశ్వవిద్యాలయంలో కౌమార నిపుణులు అన్నే మాహెక్స్ చెప్పారు.
20 నిమిషాల సమయం!
యునెస్కో చేపట్టిన ‘2023 గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్’ నివేదిక ప్రకారం.. ‘కొన్ని సాంకేతిక పరిజ్ఞానాలు కొన్ని సందర్భాల్లో కొంతవరకు మాత్రమే అభ్యాసానికి తోడ్పడతాయి. తరగతి గదిలో స్మార్ట్‌ఫోన్ వల్ల చదువుకు అంతరాయం కలుగుతోంది. 14 దేశాల్లో ప్రీ–ప్రైమరీ నుండి ఉన్నత విద్య వరకు చదువుతున్న విద్యార్థులపై జరిపిన ఓ అధ్యయనంలో.. ఫోన్ చేతిలో ఉంటే విద్యార్థుల దృష్టి నేర్చుకోవడం నుండి మరలుతోందని తేలింది.
మొబైల్ ఫోన్ లో నోటిఫికేషన్స్ వస్తుంటే విద్యార్థులు తమ ఏకాగ్రతను కోల్పోతున్నారట. ఆ తరువాత.. విద్యార్థులు వారు నేర్చుకుంటున్న దానిపై తిరిగి దృష్టి పెట్టడానికి 20 నిమిషాల వరకు సమయం పడుతోందని మరో అధ్యయనంలో తేలింది. బెల్జియం, స్పెయిన్, యూకేలోని బడుల్లో స్మార్ట్‌ఫోన్లపై నిషేధం కారణంగా అభ్యాస సామర్థ్యాలు, ఫలితాలు మెరుగుపడినట్టు వెల్లడైంది’.
‘వాంఛనీయం కాదు’
పాఠశాలల్లో స్మార్ట్‌ఫోన్లను పూర్తిగా నిషేధించడం ఆచరణాత్మకం, వాంఛనీయం కాదని స్పష్టం చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఈ ఏడాది మార్చిలో మార్గదర్శకాలను విడుదల చేసింది. విద్యా ప్రయోజనాలు, తలెత్తే నష్టాలను దృష్టిలో పెట్టుకుని నియంత్రణ అవసరాన్ని నొక్కి చెప్పింది. ఈ నేపథ్యంలో.. స్కూల్ సమయంలో విద్యార్థులు స్మార్ట్‌ఫోన్ వాడకంపై స్పష్టమైన విధానాలను రూపొందించాలని ఢిల్లీ విద్యా శాఖ తన పరిధిలోని అన్ని పాఠశాలలను ఏప్రిల్‌లో ఆదేశించింది. విద్యార్థులు చదువుపై దృష్టి కేంద్రీకరించాలన్న ఏకైక లక్ష్యంతో ప్రపంచవ్యాప్తంగా కనీసం 40% జాతీయ విద్యా వ్యవస్థలలో తరగతి గదుల్లో సెల్‌ఫోన్లపై నిషేధాలు అమలవుతున్నాయి. మనదేశంలో మాత్రం స్మార్ట్‌ఫోన్ వినియోగానికి సంబంధించి ప్రస్తుతం స్పష్టమైన చట్టం/విధానం లేదు.
నో ఫోన్స్.. ఓన్లీ బుక్స్
అమెరికా ఫోన్లు నిషేధిస్తున్న రాష్ట్రాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2025 ఆగస్ట్ నాటికి 18 రాష్ట్రాలు ఈ విధానాన్ని అమలు చేస్తుండగా.. ప్రస్తుత విద్యా సంవత్సరంలో
మరో 17 రాష్ట్రాలు వచ్చి చేరాయి.
చైనా: ప్రైమరీ, సెకండరీ స్కూల్స్‌లో 2025 మార్చి నుంచి నిషేధం విధించారు. బోధనా కారణాల వల్ల ఫోన్ అవసరమైతే తల్లిదండ్రులు రాతపూర్వకంగా విద్యా మంత్రిత్వ శాఖకు దరఖాస్తు చేయాలి.
తజికిస్తాన్: 2009 నుంచి ప్రాథమిక, సెకండరీ, ఉన్నత విద్యా సంస్థలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది మొబైల్ ఫోన్ వాడకూడదు. గీత దాటితే జరిమానా తప్పదు.
బంగ్లాదేశ్: దేశవ్యాప్తంగా నిషేధాలు మొదట 2011లో అమలయ్యాయి. 2017లో బలోపేతం చేశారు.
రువాండా
2018 జూన్ నుంచే ప్రాథమిక, సెకండరీ పాఠశాలల్లో మొబైల్ ఫోన్స్ వాడకానికి అడ్డుకట్ట వేసింది.
ఫ్రాన్స్: 15 ఏళ్లలోపు విద్యార్థులు బడుల్లో ఫోన్ వాడకూడదు. 2018–2019 విద్యా సంవత్సరం నుండి నిబంధన అమలు.
బ్రెజిల్: ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులు స్మార్ట్‌ఫోన్ వాడకూడదని 2025 జనవరిలో జాతీయ చట్టాన్ని అమలులోకి తెచ్చింది. ఉపాధ్యాయుల అనుమతితో విద్యా ప్రయోజనాల కోసం లేదా అత్యవసర పరిస్థితులు ఉంటే ఉపయోగించవచ్చు.
ఇటలీ: ప్రైమరీ స్కూల్ విద్యార్థుల మొబైల్ ఫోన్ వాడకంపై నిషేధం ఉంది. 2025 కొత్త విద్యా సంవత్సరం నుండి హైస్కూల్ విద్యార్థులకూ వర్తింపజేశారు.
నెదర్లాండ్స్: ప్రాథమిక, సెకండరీ పాఠశాలల్లో మొబైల్ ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, టాబ్లెట్ పీసీలపై దేశవ్యాప్తంగా 2024 సెప్టెంబర్ నుండి నిషేధం.
న్యూజిలాండ్: పాఠశాల సమయంలో సెల్‌ఫోన్ వాడకూడదన్న నిబంధన దేశవ్యాప్తంగా 2024 ఏప్రిల్ నుంచి అమలైంది.