మెడికల్ కళాశాల ప్రైవేటీకరణపై చర్చ జరుగుతుండగా అడ్డుకున్న టీడీపీ
డెప్యూటీ మేయర్ శైలజ నుంచి మైకు లాక్కొన్న టీడీపీ కార్పొరేటర్
దాడి చేసేందుకు యత్నం
భవానీపురం 42 ప్లాట్ల కూల్చివేతపై నిలదీసిన వైఎస్సార్ సీపీ
చర్చ జరగకుండా గందరగోళం సృష్టించిన టీడీపీ
అభ్యంతరం చెబుతూ వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ల వాకౌట్
పటమట(విజయవాడతూర్పు): రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం పేద, మధ్యతరగతి కుటుంబాలపై సవతి ప్రేమ చూపుతోందని, వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నిర్మించిన 17 మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయటాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు వీఎంసీ కౌన్సిల్లో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీన్ని తట్టుకోలేని టీడీపీ సభ్యులు కౌన్సిల్ సాక్షిగా డెప్యూటీ మేయర్ అవుతు శైలజారెడ్డి నుంచి మైకు లాక్కొని, దాడికి పాల్పడ్డారు. సభ ఆద్యంతం టీడీపీ కార్పొరేటర్ల తీరుతో రసాభాసాగా మారింది. విజయవాడ నగర పాలక సంస్థ సాధారణ సర్వసభ్య సమావేశం గురువారం వీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో మేయర్ రాయన భాగ్యలక్ష్మి అధ్యక్షతన జరిగింది.
బాధితులకు న్యాయం చేయాలి..
పశి్చమ నియోజకవర్గంలోని 45వ డివిజన్‌లో 42 ఇళ్లను రాష్ట్రప్రభుత్వం తొలగించి ఆ కుటుంబాలను రోడ్డుపాలు చేసిందని వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు ధ్వజమెత్తారు. వారికి న్యాయం చేయాలని 179వ అంశంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. టీడీపీ కార్పొరేటర్లు యథాప్రకారం సభ జరగకుండా నినాదాలు చేస్తూ హడావుడి చేశారు. ఓ క్రమంలో కౌన్సిల్ కంట్రోల్ రూంలో మైక్‌లను ఆపేయాలని గట్టిగా కేకలు వేస్తూ సిబ్బందిని, సభ సాక్షిగా బెదిరింపులకు గురి చేశారు. అక్కడ ఇళ్లు నిర్మించిన వారందరూ వీఎంసీ నుంచి ఇంటి నిర్మాణ ప్లాన్‌ను పొందారని, వారికి వీఎంసీ రెవెన్యూ విభాగం నుంచి పన్నులు కూడా వేశారని, తాగునీరు, డ్రెయినేజీ సదుపాయాలు కూడా కల్పించి ఇప్పుడు అర్ధాంతరంగా ఇళ్లను కూల్చివేసి తమకేమీ తెలీదని స్థానిక ఎమ్మెల్యే మాట్లాడటం విడ్డూరంగా ఉందని వైఎస్సార్ సీపీ సభ్యులు విమర్శించారు. సుప్రీంకోర్టు కూడా ఈ నెల 31వ వరకు గడువు విధించినప్పటికీ అంత తొందరగా ఇళ్లను తొలగించటం వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని ఆరోపించారు. పభుత్వం బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేస్తూ తీర్మానం చేశారు.
కమిషనర్‌కు నోటీసు..
27వ డివిజన్‌లో వీఎంసీ సాధారణ నిధులతో నిర్మించిన కమ్యూనిటీ హాలుకు స్వాతంత్య్ర సమరయోధురాలు చిట్యాల(చాకలి) ఐలమ్మ పేరు పెడుతూ గతంలో కౌన్సిల్ తీర్మానం చేసింది. అయితే ఆ పేరు తొలగించారు. దీంతో స్థానిక కార్పొరేటర్ కొండాయిగుంట మల్లీశ్వరి మళ్లీ అదే పేరు పెడుతూ బోర్డు పెట్టాలని ప్రతిపాదించగా.. టీడీపీ కార్పొరేటర్లు అడ్డుకున్నారు. దీనిపై కమిషనర్‌ను వివరణ కోరగా ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టామని, ప్రభుత్వ ఆదేశాల మేరకు వీఎంసీనే బోర్డు తొలగించిందని అన్నారు. కౌన్సిల్‌ను, కౌన్సిల్ తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అవమానిస్తోందని, దీనిపై కమిషనర్‌కు సభా ఉల్లంఘనల కింద వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు డీసెంట్ నోట్ ఇచ్చారు. ఆ సమయంలో కూడా టీడీపీ కార్పొరేటర్లు లేచి సభలో పెద్దపెద్దగా నినాదాలు చేస్తూ గందరగోళ వాతావరణాన్ని సృష్టించారు. చంద్రబాబు ప్రభుత్వానికి బీసీలన్నా, పేదలన్నా, మధ్య తరగతన్నా గిట్టదని, ఈ క్రమంలోనే నగరాభివృద్ధిని, వీఎంసీ కౌన్సిల్ మర్యాదను ఖాతరు చేయటంలేదని వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు ఆరోపించారు. స్పందించిన కమిషనర్ శుక్రవారం ఉదయం నాటికి కమ్యునిటీ హాలుకు చిట్యాల(చాకలి) ఐలమ్మ బోర్డు పెడతామని ప్రకటించారు.
తీర్మాన పత్రాల చించివేత..
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ రద్దు తీర్మానాన్ని అడిషనల్ కౌన్సిల్ అజెండా సెక్షన్ 88కే ప్రకారం సభ్యులు సభ మధ్యలో అజెండాలోని 178 అంశంగా మేయర్ రాయన భాగ్యలక్ష్మి మెజారిటీ సభ్యుల ఆమోదంతో ప్రవేశపెట్టారు. దీన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ కార్పొరేటర్లు సభలో గందరగోళాన్ని సృష్టించేందుకు యతి్నంచారు. తీర్మాన పత్రాలను చించివేశారు. ఈ సమయంలో మాట్లాడుతున్న డెప్యూటీ మేయర్ అవుతు శైలజారెడ్డి నుంచి మైక్ లాక్కొనేందుకు యతి్నంచారు. టీడీపీ కార్పొరేటర్ ముమ్మనేని ప్రసాద్ డైరెక్షన్‌లో ఇతర టీడీపీ కార్పొరేటర్‌లు రెచ్చిపోయారు. ఆయన చేసిన సైగలతో టీడీపీ కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణి ఓ అడుగు ముందుకేసి, డెప్యూటీ మేయర్‌పై దాడి చేసే యత్నం చేశారు. డెప్యూటీ మేయర్ అదే స్థాయిలో ప్రతిఘటించారు. వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్‌లు సైతం ఆమె అండగా నిలబడ్డారు. ఈ క్రమంలో టీడీపీ కార్పొరేటర్లు పలుమార్లు అదుపుతప్పి మేయర్ పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు. వెంటనే మార్షల్స్ కల్పించుకుని పోడియం వద్దకు వచ్చిన వారిని అక్కడి నుంచి పంపేశారు.


