కటాఫ్‌ తగ్గింది... పోటీ పెరిగింది | Major change in engineering seat allocation | Sakshi
Sakshi News home page

కటాఫ్‌ తగ్గింది... పోటీ పెరిగింది

Jul 21 2025 1:57 AM | Updated on Jul 21 2025 1:57 AM

Major change in engineering seat allocation

ఇంజనీరింగ్‌ సీట్ల కేటాయింపులో భారీ మార్పు 

నాన్‌–లోకల్‌ ఎత్తివేతే కారణమంటున్న నిపుణులు 

10 వేల లోపు ర్యాంకు వరకూ సీటు పక్కానే..  

ఆ పై ర్యాంకర్లు ఆచితూచి అడుగేయాల్సిందే

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ ట్రెండ్‌ పూర్తిగా మారిపోయింది. మొదటి రౌండ్‌లో ఈసారి ప్రధాన కాలేజీల్లో కటాఫ్‌ బాగా తగ్గింది. దీంతో మంచి ర్యాంకర్లకే కోరుకున్న చోట సీట్లు వచ్చాయి. మిగతా రౌండ్లలోనూ ఇదే విధంగా ఉండే అవకాశం ఉంది. 5 వేల ర్యాంకు దాటిన తర్వాత పోటీ తీవ్రంగా ఉంది. ఉస్మానియా, జేఎన్టీయూహెచ్‌ సహా అన్ని టాప్‌ కాలేజీల్లోనూ గతేడాదితో పోలిస్తే కటాఫ్‌ ర్యాంకులు భారీగా తగ్గాయి. 

2024లో ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో కంప్యూటర్‌ కోర్‌గ్రూప్‌లో 1,850 ర్యాంకు వచ్చిన బాలురకు జనరల్‌ కేటగిరీలో సీటు వచ్చింది. ఈ ఏడాది కటాఫ్‌ 1,221 ర్యాంకు వద్దే ఆగిపోయింది. జేఎన్టీయూహెచ్‌లో ఇదే బ్రాంచీలో గతేడాది 873 ర్యాంకు కటాఫ్‌గా ఉంటే, ఈ ఏడాది 625తోనే ఆగిపోయింది. ఇతర ప్రధాన ప్రైవేటు కాలేజీల్లోనూ ఇదే పరిస్థితి ఉంది.  

నాన్‌–లోకల్‌ ఎత్తివేతతో..! 
ఇంజనీరింగ్, అగ్రి, ఫార్మా ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఈఏపీసెట్‌)లో ఈ ఏడాది మార్పులు చోటు చేసుకున్నాయి. రాష్ట్ర విభజన నాటి నుంచి ఉన్న నాన్‌–లోకల్‌ కోటాను ఈసారి నుంచి ఎత్తివేశారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులు తెలంగాణలోని స్థానిక ఇంజనీరింగ్‌ కాలేజీల్లో సీట్లు పొందే వీల్లేకుండా పోయింది. ఏపీ నుంచి దాదాపు 75 వేల మంది ఏటా ఈఏపీసెట్‌లో పోటీ పడేవారు. 

వారితో కలుపుకుని 2.10 లక్షల మంది వరకు ఇంజనీరింగ్‌ సెట్‌లో అర్హత సాధించేవారు. ఈసారి 2,07,190 మంది ఇంజనీరింగ్‌ సెట్‌ రాస్తే, 1,51,779 మంది మాత్రమే అర్హత సాధించారు. ఏటా 5 వేల లోపు ర్యాంకు వచ్చిన విద్యార్థులు రాష్ట్ర కాలేజీల్లో తక్కువగానే చేరేవారు. వీరికి జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్‌డ్‌లోనూ మంచి ర్యాంకులు వస్తాయి కాబట్టి జాతీయ ఇంజనీరింగ్‌ కాలేజీలకు వెళ్లేవారు. 

అక్కడ మంచి బ్రాంచీలో సీటు రానివాళ్లే రాష్ట్ర కాలేజీల్లో చేరేవారు. 10 వేల పైన ర్యాంకులు వచ్చిన ఏపీ విద్యార్థులు కూడా తెలంగాణలో పోటీపడటంతో కటాఫ్‌ పెరిగేది. ఈసారి రాష్ట్ర విద్యార్థులే పోటీ పడటం, వాళ్లు ఇతర రాష్ట్రాలకు వెళ్లే ఆస్కారం లేకపోవడంతో పోటీ తీవ్రంగా ఉండి కటాఫ్‌ ర్యాంకులు తగ్గాయని నిపుణులు చెబుతున్నారు.  

సీట్లు పక్కానే... ర్యాంకే కీలకం 
రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కాలేజీల్లో కన్వీనర్‌ కోటా కింద 83,054 సీట్లున్నాయి. ఇందులో 58,742 సీట్లు కంప్యూటర్‌ సైన్స్, దానికి అనుబంధంగా ఉండే ఎమర్జింగ్‌ కోర్సుల్లోనే ఉన్నాయి. తొలి రౌండ్‌లో ఇందులో 57,042 సీట్లు కేటాయించారు. సీఎస్‌ఈ బ్రాంచీలో ఓపెన్‌ కేటగిరీ కింద టాప్‌ కాలేజీల్లో 5 వేల లోపు ర్యాంకు వరకే సీట్లు వచ్చాయి. 

జోసా కౌన్సెలింగ్‌ అన్ని రౌండ్లూ పూర్తవ్వడంతో ఈఏపీసెట్‌లో సీటు వచ్చిన విద్యార్థులు కాలేజీల్లో చేరతారు. అయితే, టాప్‌ 25 కాలేజీల్లో సీఎస్‌ఈ సీటు వచ్చినప్పటికీ 2 వేల మంది వరకూ ఇతర రాష్ట్రాలు, యాజమాన్య కోటా సీట్లతో కాలేజీలు మారే వీలుంది. 

కాబట్టి 20 వేల పైన ర్యాంకు వచ్చిన విద్యార్థులకు తర్వాతి రౌండ్లలో మంచి కాలేజీలు, బ్రాంచీల్లో సీట్లు వస్తాయని అంటున్నారు. తెలంగాణ విద్యార్థుల మధ్యే పోటీ కాబట్టి, 30 వేల ర్యాంకు వరకు సీఎస్‌సీ బ్రాంచీలో జనరల్‌ కేటగిరీ వారికి సీటు లభిస్తుందని చెబుతున్నారు. కాలేజీ ఏదైనా ఫర్వాలేదు... సీఎస్‌ఈ మాత్రమే అనుకునే వారికి ఈ ఛాన్స్‌ వస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.  

కటాఫ్‌లు భారీగా మారాయి 
గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఇంజనీరింగ్‌ సీట్ల కటాఫ్‌ పూర్తిగా మారాయి. స్థానికులే పోటీ పడటం దీనికి ప్రధాన కారణం. మంచి ర్యాంకులు వచ్చిన వారికే కోరుకున్న సీట్లు దక్కాయి. గతంలో మాదిరి మిగతా రౌండ్లలో సీట్లు వస్తాయన్న నమ్మకంతో విద్యార్థులు ఉండొద్దు. వచ్చిన సీటులో జాయిన్‌ అవ్వాలి. ఆ తర్వాత పరిస్థితిని బట్టి బ్రాంచీ, కాలేజీ మార్చుకోవడమే మంచిది. 
– ఎంఎన్‌ రావు, గణిత శాస్త్ర సీనియర్‌ అధ్యాపకులు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement