
యూత్‌లో 31% మందికే డిగ్రీ, ఆపై చదువులు
మిగిలిన వారంతా ఇంటర్/డిప్లొమాకే పరిమితం
ఉన్నత చదువులకు పల్లె యువత చాలా దూరం
నిరక్షరాస్యులుగా 1.3 కోట్ల మంది యువత
పదిలో ముగ్గురే.. అవును మీరు చదువుతున్నది నిజమే. దేశంలో పది మంది యువతలో ముగ్గురు మాత్రమే డిగ్రీ, ఆపై వరకు చదువుకున్నారు. మిగిలిన వారంతా ఇంటర్/డిప్లొమాకే పరిమితమవుతున్నారు. దేశంలో 15–29 సంవత్సరాల మధ్య వయస్సు గల యువత సుమారు 42 కోట్ల మంది ఉన్నారు. మొత్తం జనాభాలో వీరి వాటా దాదాపు 29%. వీరిలో సుమారు కోటికిపైగా నిరక్షరాస్యులు ఉన్నారు.
ఒక వ్యక్తి ఆలోచనలను తీర్చిదిద్దడంలో సహాయపడే కీలక అంశాల్లో విద్య ఒకటి. ముఖ్యంగా యువత.. దేశంలో ఉత్పాదక శక్తులుగా, విలువైన మానవ వనరులుగా, వినూత్న పౌరులుగా మారడానికి వీలు కల్పించే ఆయుధం కూడా అదే. అలాంటి విద్య.. ప్రత్యేకించి ఉన్నత విద్య మనదేశంలో ఇప్పటికీ గ్రామీణులకు అందని ద్రాక్షలానే ఉంది.
అక్షరాస్యత స్థాయులు స్థిరంగా పెరుగుతున్నప్పటికీ దేశవ్యాప్తంగా సమాజంలోని అన్ని వర్గాలకు అందుబాటులో ఉన్న విద్య నాణ్యత ఇప్పటికీ ఆశించిన స్థాయిలో లేదని ‘పీపుల్ రీసెర్చ్ ఆన్ ఇండియాస్ కంజ్యూమర్ ఎకానమీ’ (పీఆర్‌ఐసీఈ) విడుదల చేసిన ‘నావిగేటింగ్ ది యూత్ ఫ్రాంటియర్’ అనే పరిశోధనా పత్రం వెల్లడించింది. ఈ విషయంలో పట్టణాలకు, పల్లెలకు మధ్య అసమానత స్పష్టంగా కనిపిస్తోందని తెలిపింది.

ఉన్నత చదువులు పట్టణాలకే..
దేశవ్యాప్తంగా 2024–25 నాటికి మొత్తం యువతలో 24% మంది.. అంటే సుమారు 9.9 కోట్ల మంది డిగ్రీ పూర్తి చేశారు. వీరిలో గ్రామీణ ప్రాంతాల వారి వాటా 52 శాతం. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పట్టా దాదాపు 3 కోట్ల మంది అందుకున్నారు. వీరిలో 66 శాతం పట్టణవాసులే కావడం గమనార్హం. ఇతర ఉన్నత చదువులు చదివిన 20 లక్షల మంది యువతలో పట్టణ ప్రాంతాలవారు ఏకంగా 85 శాతం ఉన్నారు.

అంటే ఉన్నత చదువులు పట్టణాలకే పరిమితం అవుతున్నట్టు స్పష్టం అవుతోంది. మొత్తం యువతలో ప్రాథమిక విద్య అభ్యసించిన వారు 7.3 కోట్లు (17%), మెట్రిక్ 7.6 కోట్లు (18%), ఇంటర్ 9.3 కోట్లు (22%), టెక్నికల్/డిప్లొమా చేసినవారు 3.6 కోట్లు (9%) ఉన్నారు. యూత్‌లో 3% అంటే 1.3 కోట్ల మంది నిరక్షరాస్యులుగా మిగిలిపోయారు. ప్రాంతాలవారీగా చూస్తే డిగ్రీ, ఆపై చదువులు చదివిన వారు దక్షిణాది రాష్ట్రాల్లో అధికంగా ఉన్నారు.