శ్రీకాళహస్తి(తిరుపతి జిల్లా): శ్రీకాళహస్తి జనసేన పార్టీ మాజీ ఇన్‌ఛార్జ్ కోటా వినుత (Vinutha Kota) డ్రైవర్ శ్రీనివాసులు (రాయుడు) హత్య కేసు దర్యాప్తు వేగవంతం చేశారు పోలీసులు. టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డికి నోటీసులిచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటికే బొజ్జల అనుచరుడు సుజిత్‌ను పోలీసులు విచారించగా, బొజ్జలను కూడా విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కోట వినూత హత్యకు టీడీపీ ఎమ్మెల్య బొజ్జల సుధీర్‌రెడ్డి స్కెచ్ వేసినట్లు కోట వినుత డ్రైవర్ రాయుడు హత్యకు ముందు తీసుకున్న సెల్ఫీ వీడియో ద్వారా బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బొజ్జలను విచారించే అవకాశాలు కనబడుతున్నాయి.
ఆ వీడియోలో ఏం చెప్పాడంటే..
ఆ వీడియోలో బొజ్జల సుధీర్‌రెడ్డి.. కోట వినూత దంపతులను హత్య చేసేందుకు రెండు సార్లు ఏ విధంగా కుట్ర చేశారు. ఆ కుట్రలు బెడిసి కొట్టడంతో తనకు భారీ మొత్తంలో డబ్బులు ముట్టజెప్పి కోట వినూత ఏకాంత వీడియోలు తీయాలని పురమాయించడం, కోట వినుత దంపతులు ఎప్పుడు ఎక్కడికి వెళుతున్నారు. ఏం చేస్తున్నారన్న సమాచారం తనకు ఇవ్వాలని బొజ్జల సుధీర్‌రెడ్డి తనని బెదిరించి, భయపెట్టినట్లు హత్య కావడానికి ముందు తీసుకున్న సెల్ఫీ వీడియోలో బయటపెట్టాడు రాయుడు.
జులై 10వ తేదీన కూవం నది కాలువులో తేలిన డ్రైవర్ రాయుడు శవం
జులై 10వ తేదీ చెన్నై కూవం నది కాలువ నుంచి గుర్తు తెలియని శవాన్ని అక్కడి పోలీసులు స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నివేదికలో హత్య అని గుర్తించారు. మృతుడి చేతిపై కోట వినుత, జనసేన సింబల్ పచ్చబొట్లు ఉండడంతో.. లోతుగా దర్యాప్తు చేశారు. ఆ మృతదేహం డ్రైవర్ రాయుడిదని నిర్ధారించారు. ఆ దిశగా పోలీసులు చేపట్టిన విచారణలో అప్పటి శ్రీకాళహస్తి(తిరుపతి) జనసేన ఇన్‌చార్జ్ వినుత దంపతులు జులై 8వ తేదీన అతన్ని హత్య చేసి కూవం కాలువలో పడేసినట్లు తేల్చారు. అనంతరం కోట వినుత దంపతులతో పాటు మరో ముగ్గురు వారి అనుచరుల్ని అరెస్ట్ చేశారు.
జనసేన తరఫున చాలా యాక్టీవ్‌గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే వినుత దంపతులు హత్య కేసులో అరెస్ట్ కావడం ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ఈ కేసులో ఆమె పేరు బయటకు రావడంతో ఆగమేఘాల మీద ఆమెను పదవి నుంచి తొలగించి.. పార్టీ నుంచి బహిష్కరించింది జనసేన. అయితే.. అరెస్ట్ తర్వాత మీడియా ముందు.. దీని వెనుక ఎవరెవరు ఉన్నారనేది త్వరలోనే బయటికి వస్తుందని కోట వినుత అనడం, ఆ తర్వాత కాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి పేరు బయటకు రావడంతో రాజకీయ వర్గాల్లో అలజడి రేపింది.



