- కొత్త హైకోర్టు పనుల వేగానికి వారాంత సమీక్షలు: ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్ ఆదేశాలు
- స్వతంత్ర ఇంజినీరింగ్ సంస్థ సేవలపై ప్రభుత్వ పరిశీలన
హైదరాబాద్: రాజేంద్రనగర్‌లో నిర్మాణంలో ఉన్న కొత్త హైకోర్టు సముదాయాన్ని గడువులో పూర్తిచేయాలన్న లక్ష్యంతో పనుల పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయాలని రవాణా, రోడ్లు–భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ప్రాజెక్టులో జాప్యాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, ఇకపై ప్రతి శనివారం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు సైట్‌లోనే వారాంత సమీక్షలు నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశాలకు కన్సల్టెంట్‌తో పాటు నిర్మాణ, ఎంఈపీ ఉపకన్సల్టెంట్లు తప్పనిసరిగా హాజరుకావాలని తెలిపారు.

పనుల వేగం పెరగాలంటే సాంకేతిక సిబ్బంది, ఉపకన్సల్టెంట్ల సంఖ్యను వెంటనే పెంచాలని ఆదేశించిన వికాస్‌రాజ్, ఒప్పంద పరిధిలోనే స్వతంత్ర ఇంజినీరింగ్ సంస్థను నియమించి సాంకేతిక సలహాలు తీసుకునే అంశాన్ని పరిశీలించాలని సీఈ (బిల్డింగ్స్)కు ఆదేశించారు.

డ్రాయింగ్‌లను నిర్ణీత షెడ్యూల్ ప్రకారం కనీసం రెండు నెలలు ముందుగానే సమర్పించాలని, అలా చేయడం వల్ల సామగ్రి కొనుగోలు, కార్మికుల సమీకరణ సకాలంలో జరిగే అవకాశం ఉంటుందని వివరించారు. డ్రాయింగ్‌ల జారీలో జాప్యం జరిగితే, ప్రాజెక్టు పురోగతికి భంగం కలగకుండా ప్రత్యామ్నాయ కన్సల్టెంట్‌ను నియమించే అధికారం ఇంజినీరింగ్ విభాగానికి ఉంటుందని హెచ్చరించారు.

ప్రాజెక్టు గడువు తప్పకుండా నిలబెట్టేలా శాఖ, కాంట్రాక్టర్, కన్సల్టెంట్ ముగ్గురూ సమన్వయంతో పనిచేయాలని ఆయన కోరారు. ఆర్కిటెక్చరల్ రూపకల్పన, ఎంఈపీ షాఫ్టులు తదితర అంశాలను సివిల్, ఎలక్ట్రికల్ ఇంజినీర్లు కలిసే సమీక్షించి, జాతీయ భవన నియమావళి (ఎన్‌బీసీ) ప్రమాణాలకు అనుగుణంగా తుది డ్రాయింగ్‌లను ధృవీకరించాలని స్పష్టం చేశారు.


