సాక్షి హైదరాబాద్: నల్గొండ ఎక్స్ రోడ్–ఓవైసీ జంక్షన్ కారిడార్‌ను వచ్చేఏడాది ఏప్రిల్ నెలాఖరులోగా ప్రారంభించేలా పనులు త్వరతగతిన పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. నల్గొండ ఎక్స్ రోడ్–సైదాబాద్–ఐఎస్ సదన్–ఓవైసీ జంక్షన్ కారిడార్ పనుల పురోగతిని మంగళవారం ఆర్వీ కర్ణన్ అధికారులతో కలిసి పరిశీలించారు.
దక్షిణ హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీ సమస్యలను తగ్గించేందుకు ఈ కారిడార్‌ను నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా 2,530 మీటర్ల పొడవు గల ప్రధాన ఫ్లైఓవర్‌ను రూ.620 కోట్ల అంచనా వ్యయంతో EPC (Engineering, Procurement, Construction) విధానంలో నిర్మిస్తున్నారు. దీని పనుసు ఇప్పటివరకు సుమారు 80 శాతం పూర్తయ్యాయని ఈ సందర్భంగా కమిషనర్‌కు వివరించారు. వీటి వివరాలు తెలుసుకున్న కమిషనర్ కర్ణన్ మిగిలిన పనులను యుద్ధ ప్రాతిపాదికన పూర్తి చేయాలని తెలిపారు.
సైదాబాద్ నుంచి దోబీఘాట్ జంక్షన్ వరకు ఉన్న కీలక ప్రాంతంలో ట్రాఫిక్ డైవర్షన్‌కు అవసరమైన అనుమతులు తీసుకుని పనులు వేగంగా కొనసాగించాలని సూచించారు. అదేవిధంగా కారిడార్ ప్రారంభించిన అనంతరం ట్రాఫిక్ సజావుగా సాగేందుకు సర్వీస్ రోడ్ల నిర్మాణానికి అవసరమైన భూసేకరణను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్‌తో పాటు చార్మినార్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఈఈ బి. గోపాల్ ఇతర అధికారులు పాల్గొన్నారు.


