
‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డిని ప్రశ్నిస్తున్న పోలీసులు
ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్నందుకు.. అక్రమ కేసులతో బాబు సర్కారు వేధింపులు
నకిలీ మద్యం మాఫియా ఆగడాలను బయటపెడుతున్నందుకే కక్ష సాధింపులు..
హైదరాబాద్‌లోని సాక్షి ప్రధాన కార్యాలయంలో రోజంతా పోలీసుల హల్‌చల్
నోటీసుల పేరుతో ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డికి వేధింపులు
నెల్లూరు బ్యూరో ఇన్‌చార్జ్, పాత్రికేయులపైనా వేధింపులు
పత్రికా స్వేచ్ఛపై ముప్పేట దాడి... రాజ్యాంగ హక్కుల అణచివేత
ప్రభుత్వ పెద్దలదే కుట్ర... పోలీసు బాస్‌ల పర్యవేక్షణ
సాక్షి, అమరావతి: టీడీపీ సిండికేట్ నకిలీ మద్యం దోపిడీని కప్పిపుచ్చేందుకు చంద్రబాబు సర్కారు పోలీసు జులుంతో బరి తెగిస్తోంది! రాజ్యాంగ హక్కులను కాలరాసేందుకు తెగబడుతోంది. నకిలీ మద్యం దారుణాలను వెలుగులోకి తెస్తున్న ‘సాక్షి’ పత్రికపై కక్ష సాధింపు చర్యలకు తెగిస్తోంది. మద్యం ప్రియుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న నకిలీ మద్యం మాఫియాపై పోరాడుతున్న ‘సాక్షి’పై అధికార మదంతో విరుచుకుపడుతోంది. నకిలీ మద్యం రాకెట్ దారుణాలను వెలుగులోకి తేకుండా కట్టడి చేయాలనే పన్నాగంతో బరితెగిస్తోంది. ఆర్టికల్ 19 (1) కింద రాజ్యాంగం ప్రసాదించిన పత్రికా స్వేచ్ఛ, భావ ప్రకటన హక్కులను పాశవికంగా కాలరాస్తూ కుతంత్రాలకు తెగబడుతోంది.
హైదరాబాద్‌లోని సాక్షి పత్రిక ప్రధాన కార్యాలయంలో ఏపీ పోలీసులు బుధవారం దాదాపు 10 గంటలపాటు హల్‌చల్ చేయడం... ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డిని విచారణ పేరుతో వేధించడం ప్రభుత్వ కుతంత్రానికి తార్కాణం. ఇక ఎస్సీఎస్‌ఆర్ నెల్లూరు జిల్లా బ్యూరో ఇన్‌చార్జిని కూడా వారం రోజులుగా వేధిస్తుండటం సర్కారు కుట్రలను బహిర్గతం చేస్తోంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, దోపిడీని బట్టబయలు చేస్తున్న ‘సాక్షి’ మీడియా గొంతు నొక్కేందుకు కూటమి ప్రభుత్వం సాగిస్తున్న కుట్రలు ఇలా ఉన్నాయి.
నకిలీ మద్యం దారుణాలను బట్టబయలు చేస్తున్నందునే...
రాష్ట్రంలో నకిలీ మద్యం మాఫియా యథేచ్ఛగా సాగిస్తున్న దోపిడీకి వ్యతిరేకంగా సాక్షి మీడియా పోరాడుతోంది. అమాయక ప్రజల ప్రాణాలకు పెనుముప్పు కలిగిస్తున్న నకిలీ మద్యం బాగోతాన్ని పూర్తి ఆధారాలతో వెలుగులోకి తెస్తూ ప్రజలను చైతన్య పరుస్తోంది. అనకాపల్లి జిల్లా రాంబిల్లి, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, తాజాగా అన్నమయ్య జిల్లా ములకలచెరువు, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలలో నకిలీ మద్యం మాఫియా దారుణాలను సవివరంగా వెల్లడించింది.
రాజ్యాంగం కల్పించిన పత్రికా స్వేచ్ఛ హక్కుతో ‘సాక్షి’ బాధ్యతాయుతంగా వ్యవహరించడం ప్రభుత్వ పెద్దలకు కంటగింపుగా మారింది. నకిలీ మద్యం తాగిన అనంతరం సందేహాస్పద రీతిలో నలుగురు మృతి చెందడం రాష్ట్రంలో తీవ్ర కలకలం సృష్టించింది. ఆ వాస్తవాన్ని సాక్షి పత్రిక ప్రచురించటాన్ని కూటమి ప్రభుత్వ పెద్దలు సహించలేకపోయారు. నకిలీ మద్యం దందాను అరికట్టడంపై కాకుండా.. వాటిని వెలుగులోకి తెస్తున్న ‘సాక్షి’పై కక్ష సాధింపు చర్యలకు తెగబడ్డారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో ఎస్పీఎస్‌ఆర్ నెల్లూరు జిల్లాలో నెల్లూరు రూరల్, కలిగిరి, పల్నాడు జిల్లా నరసరావుపేటలో అక్రమంగా క్రిమినల్ కేసులు నమోదు చేశారు.
పత్రికలు ప్రచురించే కథనాలపై ఏదైనా అభ్యంతరం ఉంటే అధికారికంగా వివరణ (రిజాయిండర్) పంపించవచ్చు. ఇంకా కావాలనుకుంటే పరువు నష్టం దావా వేయవచ్చు. అందుకు రాజ్యాంగం అవకాశం కల్పించింది. దీనిపై న్యాయస్థానం తుది తీర్పును వెల్లడిస్తుంది. కానీ కూటమి ప్రభుత్వం రాజ్యాంగపరమైన నిబంధనలను పాటించాలన్న ఆలోచనే లేనట్లుగా కక్ష సాధింపు చర్యలకు తెగబడుతోంది. నిబంధనలకు విరుద్ధంగా సాక్షిపై క్రిమినల్ కేసులు నమోదు చేసింది.
ఐదు రోజులుగా వేధింపులు..
అనంతరం ప్రభుత్వం పోలీసులను నేరుగా రంగంలోకి దింపింది. ఈ క్రమంలో పోలీసులు ఐదు రోజులుగా నోటీసుల పేరుతో సాక్షి ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, ఎస్సీఎస్‌ఆర్ నెల్లూరు జిల్లా బ్యూరో ఇన్‌చార్జ్‌ను వేధిస్తున్నారు. ఈ నెల 12న తెల్లవారుజామునే విజయవాడ ఆటోనగర్‌లోని సాక్షి కార్యాలయానికి పోలీసులు చేరుకుని హడావుడి చేశారు. కార్యాలయం తాళాలు తెరవకముందే అక్కడకు వచ్చి నోటీసులు తీసుకోవాలని సిబ్బందిని వేధించారు. ఎడిటర్ హైదరాబాద్ కార్యాలయంలో ఉంటారని చెప్పినా వినిపించుకోకుండా సంబంధం లేని ప్రశ్నలతో బెదిరించేందుకు యత్నించారు.
ఇక ఎస్పీఎస్‌ఆర్ నెల్లూరు జిల్లా బ్యూరో ఇన్‌చార్జ్ మస్తాన్‌రెడ్డి నివాసానికి వెళ్లిన పోలీసులు భయానక వాతావరణం సృష్టించారు. ఈ నెల 11న సాయంత్రం 5 గంటలకు నెల్లూరు రూరల్ పోలీసులు, రాత్రి 8.30 గంటలకు కలిగిరి పోలీసులు వెళ్లి నోటీసుల పేరుతో హడావుడి చేశారు. అంతేకాదు.. 12వ తేదీ తెల్లవారు జామునే మరోసారి ఆయన నివాసంలో సోదాల పేరుతో పోలీసులు హంగామా చేశారు. వెంటనే విచారణ కోసం పోలీస్ స్టేషన్‌కు రావాలని ఒత్తిడి చేశారు. ఆరోగ్య సమస్యలతో డాక్టర్ అపాయింట్‌మెంట్ ఉన్నందున విచారణకు హాజరయ్యేందుకు పది రోజుల సమయం కావాలని ఆయన కోరారు.
సరేనని వెళ్లిన పోలీసులు మళ్లీ అదే రోజు అర్ధరాత్రి మళ్లీ మస్తాన్‌రెడ్డి నివాసానికి రావడం గమనార్హం. రాత్రి 11.15 గంటలకు నెల్లూరు రూరల్ పోలీసులు, అర్ధరాత్రి 1.20 గంటలకు కలిగిరి పోలీసులు ఆయన నివాసానికి వచ్చి రాద్ధాంతం చేశారు. పది రోజుల సమయం ఇవ్వడం కుదరదని.. మర్నాడే అంటే 13వతేదీ ఉదయమే విచారణకు రావాలని మళ్లీ నోటీసులు ఇచ్చారు. 13న ఉదయం 10.30 నుంచి 2.30 గంటల వరకు నెల్లూరు రూరల్ పోలీసులు ఆయన్ను విచారించారు. ఏమాత్రం సంబంధం లేని 62 ప్రశ్నలు అడిగారు. ఇక సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు కలిగిరి పోలీసులు విచారించారు. 67 ప్రశ్నలు అడగటం గమనార్హం. అంతటితో పోలీసులు శాంతించలేదు. ఈ నెల 17న మళ్లీ విచారణకు రావాలని బుధవారం సమాచారం ఇచ్చారు.
ప్రభుత్వ పెద్దల కుట్రే.. పోలీస్ బాస్‌ల పర్యవేక్షణ
సాక్షి పత్రిక, ఎడిటర్, పాత్రికేయులపై అక్రమ కేసుల కుట్రను ప్రభుత్వ పెద్దలే నడిపిస్తున్నారన్నది స్పష్టమవుతోంది. ఉన్నత స్థాయి ఆదేశాలు, ఒత్తిడితోనే పోలీసులు ఐదు రోజులుగా వేధింపులకు పాల్పడుతున్నారు. హైదరాబాద్‌లోని సాక్షి ప్రధాన కార్యాలయంలో సోదాలు, విచారణకు వచి్చన పోలీసులకు ఎస్పీఎస్‌ఆర్ నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత వేజండ్ల ఏకంగా 30 సార్లు ఫోన్ కాల్స్ చేసినట్లు తెలుస్తోంది. అంటే పోలీసు వేధింపులను ఉన్నత స్థాయిలో ఎంత నిశితంగా పర్యవేక్షిస్తున్నారన్నది స్పష్టమవుతోంది. అంటే సాక్షి పత్రిక, ఎడిటర్, పాత్రికేయులపై అక్రమ కేసుల కుట్ర అంతా ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే సాగుతోందన్నది తేటతెల్లమవుతోంది.
హైదరాబాద్ కార్యాలయంలో పోలీసుల హల్‌చల్...
మరోవైపు హైదరాబాద్‌లోని సాక్షి ప్రధాన కార్యాలయంపై పోలీసులు దాడి చేసినంత పని చేశారు. ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డికి వాట్సాప్‌లో ముందుగా నోటీసులు పంపారు. అసలు వాట్సాప్‌లో నోటీసులు పంపవద్దని సుప్రీంకోర్టు స్పష్టంగా ఆదేశించినా, దాన్ని నిర్భీతిగా ఉల్లంఘించి మరీ వాట్సాప్‌లో నోటీసులు పంపించారు. నెల్లూరు రూరల్, కలిగిరి పోలీసులు బుధవారం హైదరాబాద్‌లోని సాక్షి ప్రధాన కార్యాలయానికి వచ్చారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు కార్యాలయంలో హడావుడి చేసి పాత్రికేయులను బెదిరించే రీతిలో వ్యవహరించారు.
అంటే సాక్షి పత్రిక గొంతు నొక్కేందుకు కూటమి ప్రభుత్వం ఎంత కక్ష పూరితంగా వ్యవహరిస్తోందన్నది స్పష్టమవుతోంది. ఈ క్రమంలో బుధవారం నోటీసుల జారీ, విచారణ పేరుతో సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డిని వేధించారు. ప్రచురించిన వార్తా కథనానికి సంబంధించి అన్ని ఆధారాలు ఇవ్వాలని, న్యూస్ సోర్స్ చెప్పాలని, మరింత సమాచారం కోసం రేపు విచారణకు రావాలని అందులో పేర్కొన్నారు. 12 గంటల సమయం ఇచ్చి రేపు హాజరు కావాలన్నారు. పోలీసుల ప్రశ్నావళికి సమాధానం చెప్పేందుకు పది రోజుల సమయం కావాలని ఎడిటర్ ధనంజయరెడ్డి వారితో పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్‌లో విచారణకు వచ్చేందుకు ఈ నెల 29 వరకు గడువు కోరారు.
కేసుల నమోదు పద్ధతి కాదు..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాక్షి పత్రిక ఎడిటర్‌పై వరుసగా కేసులు నమోదుచేయడం ఆక్షేపణీయం. ఏదైనా వార్త, కథనంలో తప్పున్నట్లైతే అందుకు సంబంధించిన వివరణ ఇవ్వాలని, లేదా ఎడిటర్స్ గిల్డ్, ప్రెస్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేయాలి. కానీ, ఎడిటర్‌ను లక్ష్యంగా చేసుకుని కేసులు నమోదుచేయడం పద్ధతికాదు.
– తెలకపల్లి రవి, సీనియర్ సంపాదకులు
పత్రికా స్వేచ్ఛను హరించడమే..
పత్రికలో ఒక వార్త ప్రచురిస్తే ఆ వార్తకు సంబంధించి ‘న్యూస్ సోర్స్’ను వెల్లడించాలని పోలీసులు బలవంతం చేయలేరు. ఎడిటర్ ధనంజయ్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకుని వరుసగా కేసులు నమోదుచేయడం పత్రికా స్వేచ్ఛను హరించడమే.
– డాక్టర్ పి. విజయబాబు, సీనియర్ సంపాదకులు
ఈ సంస్కృతి మంచిది కాదు
పత్రికలో కానీ.. ప్రసార మాధ్యమాల్లో కానీ ఏవైనా వార్తలు ప్రచురించినప్పుడు... వారి మనోభావాలు దెబ్బతిన్నాయని భావిస్తే కౌంటర్ వివరణ ఇవాలి. న్యాయపోరాటం చేయాలి. అంతేగానీ ఇలా బెదిరింపు ధోరణిలో వ్యవహరించడం సరికాదు. గతంలో ఇలాంటి సంస్కృతి లేదు.
– గంట్ల శ్రీనుబాబు, జాతీయ జర్నలిస్టుల సంఘం (ఎన్‌ఏజె) కార్యదర్శి
దాడులు సిగ్గుచేటు
హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలం కావడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రభుత్వ వైఫల్యాలపై వార్తలు రాస్తున్న జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించడమే కాకుండా సాక్షి కార్యాలయాలపై దాడులు చేయడం అత్యంత దుర్మార్గం, సిగ్గుచేటు.
– అంజిరెడ్డి, వైఎస్సార్‌సీపీ ఇంటలెక్చువల్ వింగ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రొండా
కలంపై జులుం తగదు..
పత్రికా స్వేచ్ఛ రాజ్యాంగం కలి్పంచిన హక్కు. సాక్షి కార్యాలయాలపై దాడులు, ఎడిటర్‌పై కేసులు అప్రజాస్వామికం. వీటికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇటువంటి దాడులను అన్ని ప్రజా సంఘాలు, జర్నలిస్టుల సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. కలంపై జులుం తగదు.
– ఉల్లాకుల నీలకంఠేశ్వర యాదవ్, సీనియర్ జర్నలిస్ట్, కలింగవార్త ఎడిటర్, రాజాం
అప్రజాస్వామికం
ప్రభుత్వ విధానాలపై వార్తలు రాస్తున్నారనే అక్కసుతో సాక్షి మీడియాపై పోలీసులతో సోదాలు, దాడులు చేయించడం అప్రజాస్వామికం. ప్రజా వ్యతిరేక పాలనపై ప్రతిపక్ష పార్టీలు, సమాచార మాధ్యమాలు గొంతుకను వినిపించే హక్కు లేకుండా చేయాలని చూడటం నియంత పాలనే.
– జి.శాంతమూర్తి, ఇండియన్ ఇంటిలెక్చ్యువల్ ఫోరం వ్యవస్థాపకుడు, గుంటూరు