‘చెట్టే కదా అని నరికివేయకండి. దానికి ప్రాణం ఉంది. శక్తి ఉంది. పదిమందికి మేలు చేసే గుణం ఉంది అని గ్రహించండి’ అంటున్న సత్తెయ్య కుప్పకూలిన చెట్లు తిరిగి లేచేలా, పచ్చదనంతో నవ్వేలా చేస్తున్నాడు. ట్రీ ట్రాన్స్‌లొకేషన్ విధానం ద్వారా చనిపోయిన చెట్లకుప్రాణం పోస్తున్నాడు...
అది అందరి బాధ్యత
మొక్కలు నాటడం, చెట్లను కాపాడుకోవడం అనేది ఏ ఒక్కరి బాధ్యతో కాదు. అది అందరి బాధ్యత. ‘నేను ఒక్కరిని తలచుకుంటే ఏం అవుతుంది!’ అని ఎవరికి వారు నిరాశపడడం కంటే ‘నాకు తోచింది నేను చేస్తాను’ అని ఎవరికి వారు అనుకుంటే సమాజానికి, పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది. ట్రీ ట్రాన్స్‌లొకేషన్‌కు సంబంధించిన అవగాహన పర్యావరణ ప్రేమికులకే కాదు సామాన్య ప్రజలకు కూడా ఉండాలి. – సుంకిసాల సత్తయ్య
తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా ఇటిక్యాల గ్రామానికి చెందిన సుంకిసాల సత్తయ్య పెద్ద చదువులు చదువుకోలేదు. ఇంటర్మీడియెట్ వరకు బైపీసీ చదువుకున్న సత్తయ్యకు చెట్లు, జీవవైవిధ్యం. పర్యావరణ విషయాలపై ఆసక్తి ఎక్కువ. ‘చెట్లు కూడా మనలాంటి జీవులే’ అంటాడు.
బతుకుదెరువు కోసం దుబాయ్ వెళుతూ వెళుతూ... ‘ఇప్పటిలాగే మీరు ఎప్పుడూ పచ్చగా వర్థిల్లాలి’ అని మనుషులకు చెప్పినట్లే చెట్లకు కూడా చెప్పి వెళ్లిపోయాడు. దుబాయ్‌కి వెళ్లి తిరిగి వచ్చిన సత్తయ్య తనకు ఇష్టమైన ఎన్నో చెట్లు నరికివేసి ఉండటాన్ని చూసి తల్లడిల్లిపోయాడు. నరికిన చెట్లను ఎలాగైనా బతికించాలని పట్టుదలగా ముందుకు కదిలాడు. సత్తయ్య బాధపడుతున్న తీరు, పట్టుదల కొద్దిమందికి ఆశ్చర్యంగా అనిపించింది.
‘చెట్లను కొట్టేయడం మామూలే కదా, ఎందుకు ఇంతలా బాధపడుతున్నావు?’ అని అడిగారు.‘చెట్టు మనిషి కాదు కదా!’ అని కూడా అన్నారు. అప్పుడు సత్తెయ్య ఇలా అన్నాడు... ‘తెలిసో తెలియకో మనిషి తప్పుచేస్తాడేమోగానీ చెట్టు ఎప్పుడూ తప్పు చేయదు. పదిమందికి ఉపకారమే చేస్తుంది. అలాంటి చెట్లను నరికితే బాధ కలగదా!
’చెట్టును బతికించడానికి చేయూత ఇవ్వండి...
‘అయ్యా ఇదీ పరిస్థితి. చెట్లను బతికించే పనిలో మీ చేయి కూడా ఉండాలి’ అని ఎంతోమంది రైతులు, దాతలను అడిగాడు. అలా వారి సహకారంతో ఎకరం భూమిలో ట్రీ ట్రాన్స్‌లొకేషన్ చేపట్టి సుమారు 40 మహావృక్షాలకు ప్రాణంపోశాడు. ఇది తెలంగాణలోనే మొట్టమొదటి ట్రాన్స్‌లొకేషన్. గ్రామంలోని వాగు పక్కన ఎకరం భూమిలో గత ఏడాది ఆగస్టులో చెట్లకు ప్రాణం పోసే కార్యక్రమం ప్రారంభం అయింది. సుమారు 30 చెట్లను బతికించారు. ట్రాన్స్‌లొకేషన్ చేసిన ఎకరం భూమిలో తనకు సహకరించిన చెన్నమనేని హిమవంతరావు, కాటిపల్లి నారాయణరెడ్డి, సుంకిసాల సత్తయ్య, కొక్కు శేఖర్, కొమ్ముల రాధ, సింగని వీరేందర్ పేర్లను ఆయా చెట్ల బోర్డులపై రాయించాడు.
ప్రతి పండుగ... మొక్కలు నాటే పండుగ
‘ఇక నా బాధ్యత పూర్తయింది’ అనుకోలేదు సత్తెయ్య. ‘మొక్కలు నాటాలి. నాటించాలి’ అని ప్రతిజ్ఞ తీసుకున్నాడు. గ్రామంలో ప్రతి ఒక్కరితో మొక్కలు నాటించాలనే లక్ష్యంతో ఎనిమిది వేల మొక్కల వరకు నాటించాడు. గ్రామంలో ఏ పండగ వచ్చినా మొక్కలు నాటేలా కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టాడు.
– నాగమల్ల శ్రీకర్, సాక్షి, రాయికల్, జగిత్యాల జిల్లా


