సాక్షి, వరంగల్: వరంగల్ జిల్లాలో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు చేపట్టారు. మాజీ మావోయిస్టు గాదె ఇన్నయ్య ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. జనగామ జిల్లా జాఫర్‌గఢ్ గాదె ఇన్నయ్య ఆశ్రమంలోనూ ఎన్‌ఐఏ సోదాలు చేపట్టింది. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై సోదాలు చేపట్టిన ఎన్‌ఐఏ అధికారులు.. గాదె ఇన్నయ్యతో పాటు యూట్యూబ్ ఛానల్‌పై కేసు నమోదు చేశారు. ఆదివారం.. నాలుగు వాహనాల్లో వచ్చిన ఎన్‌ఐఏ అధికారులు.. ఇన్నయ్యను అదుపులోకి తీసుకున్నారు.
ఇన్నయ్యను అరెస్ట్‌చేసేందుకు ఆశ్రమానికి వచ్చిన ఎన్‌ఐఏ అధికారులను చిన్నారులు అడ్డుకున్నారు. ఇటీవల మృతిచెందిన మావోయిస్టు నేత కాతా రామచంద్రారెడ్డి అలియాస్ వికల్ప్ అంత్యక్రియలకు ఇన్నయ్య హాజరయ్యారు. సంస్మరణ సభలో మావోయిస్టులకు అనుకూలంగా వ్యాఖ్యలు చేసి ప్రజలను ప్రేరేపించారని దర్యాప్తులో తేలింది. మావోయిస్టులకు అనుకూలంగా వ్యాఖ్యలు చేయడంతో పాటు ప్రధాని, కేంద్ర హోంమంత్రిపై ఇన్నయ్య అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇన్నయ్య అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టుకు తరలించినట్లు సమాచారం.


