సాక్షి, తాడేపల్లి: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై పోరాటం చేయాలని వైఎస్సార్‌సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన పార్టీ ముఖ్య నేతలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీలకులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జ్‌లు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. రచ్చబండ కార్యక్రమాలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోందన్నారు. ఈ నెల 12న అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగే ర్యాలీలను విజయవంతం చేయాలన్నారు. కలిసి వచ్చే పార్టీలను కలుపుకుని ముందుకు పోవాలని.. పార్టీ కమిటీలు, డేటా డిజిటలైజేషన్‌పై ప్రతి ఒక్కరూ సీరియస్‌గా దృష్టి పెట్టాలని ఆయన సూచించారు.
‘‘పార్టీ కార్యక్రమాలను సోషల్ మీడియా వేదికగా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. మెడికల్ కాలేజీలపై ప్రభుత్వం దిగివచ్చే వరకూ పోరాటం ఆగదు. స్థానిక సంస్థల ఎన్నికల నాటికి అంతా పకడ్బందీగా సిద్ధమవ్వాలి. ప్రజలకు మరింత చేరువయ్యేలా గొంతెత్తి నినదించాలి. ప్రతి ఒక్కరూ మొక్కుబడిగా కాకుండా చిత్తశుద్ధితో పనిచేయాలి’’ అని సజ్జల పేర్కొన్నారు.
సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకా ఏమన్నారంటే..
‘‘మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నియోజకవర్గాల్లో ఈ నెల 12న ర్యాలీలు జరుగుతాయి. ఇందుకు రాష్ట్ర స్థాయిలో పోస్టర్ రిలీజ్ కార్యక్రమం జరిగింది. దీనిపై రేపు అన్ని జిల్లాలలో జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎల్లుండి నియోజకవర్గ కేంద్రాల్లో అసెంబ్లీ ఇంఛార్జ్‌లు, ఆ తర్వాత మండల స్ధాయిలో పోస్టర్ రిలీజ్ కార్యక్రమాలు నిర్వహించాలి. పోస్టర్ రిలీజ్ తర్వాత ప్రెస్ మీట్‌లు నిర్వహించి మీడియాకు మన ఉద్దేశాన్ని వివరించాలి. కోటి సంతకాలు-రచ్చబండ కార్యక్రమంకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది.
..వైఎస్ జగన్ అభిప్రాయంతో ప్రజలు ఏకీభవిస్తున్నారు. పార్టీ అనుబంధ విభాగాలు కూడా ఇందులో తమ వంతుగా వివిధ వర్గాల ప్రజలను కలిసి ప్రజా స్పందనను సంతకాల రూపంలో విస్తృతంగా నమోదు చేస్తున్నారు. వచ్చే వారంలో కోటి సంతకాల సేకరణపై రివ్యూ చేద్దాం. ప్రభుత్వం దిగివచ్చే వరకూ మన పోరాటం ఆగదు. మనతో కలిసివచ్చే పార్టీలను ఆహ్వనిద్దాం. వివిధ కుల సంఘాలు, సివిల్ సొసైటీలను భాగస్వామ్యం చేద్దాం. మరింత ఫోకస్డ్‌గా పనిచేద్దాం.
..పార్టీ కమిటీల ఏర్పాటు, డేటా డిజిటలైజేషన్‌పై కూడా నాయకులు సీరియస్‌గా దృష్టిపెట్టాలి. వైఎస్ జగన్ వీటిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఇంటెన్సివ్ డ్రైవ్ లాగా చేయాలి. మనం ముందుగా అనుకున్న డెడ్ లైన్‌కల్లా అన్ని స్థాయిలలో కమిటీల నియామకాలు పూర్తవ్వాలి. సెంట్రల్ ఆఫీస్ నుంచి ఇచ్చిన గైడ్‌లైన్స్ ప్రకారం తక్షణమే ఫోకస్డ్‌గా పని చేయాలి. మండల, గ్రామ స్థాయి కమిటీలు నిర్ణీత టైంలైన్‌లోపు పూర్తి చేయాలి. డేటా ప్రొఫైలింగ్ అనేది పక్కాగా జరగాలి. అందుకు అవసరమైన సాఫ్ట్‌వేర్ ఇప్పటికే రూపొందించాం.
..పార్టీ కార్యక్రమాలను సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళదాం. నియోజకవర్గ డిజిటల్ మేనేజర్లతో సమన్వయం చేసుకోవాలి. ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరిగే సమయంలో మనం జాగ్రత్తగా పరిశీలించాలి, అలెర్ట్‌గా ఉండాలి. అందుకు అవసరమైన బూత్ లెవల్ ఏజెంట్లను సిద్ధం చేసుకుందాం. స్థానిక సంస్ధల ఎన్నికలు జరిగే నాటికి మనం అంతా పకడ్బందీగా సిద్ధమవ్వాలి. ప్రజలకు మరింత చేరువయ్యేందుకు మనం వారి తరుపున గొంతెత్తి నినదిస్తున్నాం. డిజిటల్ మీడియా వేదికగా మన వాణిని వినిపిద్దాం. ప్రతిఒక్కరూ మొక్కుబడిగా కాకుండా చిత్తశుద్ధితో పనిచేయాలి. కమిటీల నిర్మాణానికి అవసరమైన పరిశీలకులను అవసరమైతే తక్షణం నియమించాలి. కమిటీల ఏర్పాటు ఎంత ముఖ్యమో ఆ తర్వాత ఆ కమిటీలు అంతే ఉత్సాహంగా పనిచేయాలని వైఎస్ జగన్ సూచించారు’’ అని సజ్జల వివరించారు.


