
సాక్షి, శ్రీకాకుళం: మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించి చంద్రబాబు ప్రభుత్వం ఘోర తప్పిదం చేస్తోందని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడ లేని విధంగా ఒకేసారి వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీలు తెచ్చారన్నారు. పేద, మధ్య తరగతి ప్రజల ఆరోగ్యానికి వైఎస్ జగన్ అధిక ప్రాధాన్యత ఇచ్చారని ధర్మాన పేర్కొన్నారు.
పేద, మద్యం తరగతి కుటుంబాల్లో ఒకరికి ఆరోగ్యం పాడైనా అప్పుల పాలవుతున్నారు. ఆరోగ్యశ్రీ, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పేద, మధ్య తరగతి వారి కోసమే. వైద్య విద్యను అధిక ఖరీదు చేస్తే పేదలు ఎలా చదువుకోగలరు?. కోట్లు పెట్టి మెడికల్ సీట్లు కొన్నవారు ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచిస్తారా?. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తక్షణమే చంద్రబాబు మార్చుకోవాలి’’ అని ధర్మాన ప్రసాదరావు డిమాండ్ చేశారు.
‘‘నాణ్యమైన విద్య ఒక్కటే సమసమాజాన్ని స్థాపించగలదు. సమ సమాజాన్ని స్థాపనే లక్ష్యంగా వైఎస్సార్‌సీ హయాంలో విద్య, వైద్యానికి ప్రాధాన్యత ఇచ్చాం. రాజ్యాంగం ఏం చెప్పేది కూడా కూటమి పాలకులకు తెలియదా?. విద్య, వైద్యం ప్రైవేటీకరణ ప్రజలకు అంగీకారం కాదు. వైద్య రంగంలో వైఎస్ జగన్ చేసిన సేవలను శత్రువులైనా అంగీకరించాల్సిందే. పలాస కిడ్నీ ఆసుపత్రి, ిసెర్చ్ సెంటర్ వైఎస్ జగన్ పాలనకు గొప్ప నిదర్శనం’’ అని ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు.
