ఓ చిన్న ఆసక్తి ఓ కొత్త ఆవిష్కరణకు దారి తీసింది. ఫలితంగా ‘... కడివెడైననేమి ఖరము పాలు’ అనే పద్యాన్ని కొత్తగా రాసుకోవాల్సిన రోజులొచ్చాయి. పూజా కౌల్ ప్రయోగాలు గాడిద పాలకు మహర్దశ నిచ్చాయి.
మహారాష్ట్రలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది పూజా కౌల్. స్నేహితులతో కలిసి ఓ రోజు షోలాపూర్‌కు బస్‌లో వెళ్లింది. విండో సీట్‌లో నుంచి బయటకు చూస్తున్నదల్లా ఒక్కసారిగా ఆలోచనల్లోనుంచి బయటకొచ్చింది.
గాడిదలు గుంపుగా వెళ్తున్నాయి. డ్రైవర్‌ని అడిగి బస్సాపించి వెళ్లి గాడిదల యజమానితో మాట్లాడింది. కుటుంబం అంతా పనుల కోసం వలస వెళ్తోంది. తమతోపాటు భవన నిర్మాణంలో బరువులు మోయడానికి గాడిదలను కూడా తోలుకెళ్తున్నారు. గాడిదలను పోషించుకుని జీవనం సాగించే లష్కర్ సామాజిక వర్గానికి ఇలా ఏటా పనుల కోసం వలస వెళ్లడం అలవాటే.
తన ప్రాజెక్ట్ వర్క్ ఇక్కడి నుంచే మొదలు పెట్టవచ్చనే ఆలోచన వచ్చిందామెకి. గాడిద పాలలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయని, విటమిన్‌లు, ఫ్యాటీ యాసిడ్‌లు, చర్మానికి చక్కటి పోషణనిస్తాయని, నిర్జీవంగా మారిన చర్మాన్ని ఆరోగ్యవంతం చేసి తేమగా ఉంచుతాయని తెలుసుకుంది. యాక్నే, ఇన్‌ఫ్లమేషన్ తగ్గించే లక్షణాలు కూడా ఈ పాలలో ఉన్నాయి. ఇవన్నీ తెలిసిన తర్వాత సౌందర్యపోషణ ఉత్పత్తుల ఆలోచనకు దారి తీసింది. వెంటనే ముంబయిలో హ్యాండ్‌మేడ్ సోప్ మేకింగ్ స్వల్పకాలిక కోర్సు చేసింది. ఇక ప్రయోగాలు మొదలుపెట్టాలి.
సబ్బుల తయారీతో మొదలు
గాడిద పాల కోసం వారితో మరింత స్నేహం పెంచుకోవడానికి పూజ రోజూ సాయంత్రం ఓ గంటసేపు వారు నివసించే ప్రదేశానికి వచ్చేది. ఆమె ఆలోచనను అర్థం చేసుకున్న తర్వాత లష్కరులు గాడిద పాలను ఇవ్వసాగారు. వెంటనే పూజకాలేజ్‌కు దగ్గరలో ఓ గది అద్దెకు తీసుకుంది. ఆమె దగ్గర గోవా టూర్ కోసం దాచుకున్న 26 వేల రూపాయలు మాత్రమే ఉన్నాయి. మరో 34 వేలు స్నేహితులు, బంధువుల నుంచి సేకరించింది.
కోర్సులో తెలుసుకున్న విషయాలకు తన పరిజ్ఞానాన్ని జోడించి సబ్బుల తయారీకి ప్రయోగాలు చేసింది. చేతుల మీద బొబ్బలు తేలాయి. చివరికి తొలి ప్రయత్నంగా 250 హ్యాండ్‌మేడ్ సబ్బులు తయారయ్యాయి. ప్రయోగాలను తాత్కాలికంగా నిలిపి ఢిల్లీకి వెళ్లి ఎగ్జిబిషన్‌లో ఒక టేబుల్ వేసుకుని వచ్చిన వారికి వాటిని పరిచయం చేయడం ప్రారంభించింది.
మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఆమెకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఆర్గానికా పేరుతో స్టార్టప్‌ను రిజిస్టర్ చేసి పూర్తిస్థాయిలో ప్రాజెక్టును విస్తరించింది. హ్యాండ్‌మేడ్ సబ్బుల నుంచి ఫేస్‌ప్యాక్‌లకు ప్రయోగాలు అభివృద్ధి చెందాయి. ప్రస్తుతం సన్‌స్క్రీన్, క్రీమ్‌లు, సీరమ్‌ల తయారీ కోసం ప్రయోగాలు చేస్తోంది. ఆమె ఉత్పత్తులకు కస్టమర్‌లు ఢిల్లీ నుంచి తమిళనాడు, కేరళ, కటకలకు విస్తరించారు. ఇది పూజ సక్సెస్ జర్నీ.
కడివెడు కాదు ఉగ్గుగిన్నెడు చాలు!
ఇక గాడిదల పోషణలో ఉపాధి పొందుతున్న వారి విషయానికి వస్తే... ఢిల్లీ, ఎన్‌సీఆర్, ఉత్తరప్రదేశ్‌లో ఉన్న 150 కుటుంబాలు ఇప్పుడు ఎటూ వలసపోకుండా పూజ ఇండస్ట్రీకి పాలను సరఫరా చేస్తూ దాదాపుగా నెలకు 15 వేల రూపాలయలను సంపాదిస్తున్నాయి. ఇంతకీ గాడిదపాల ధర ఎంతో తెలుసా? లీటరు 13 వందల రూపాయలు.
(చదవండి: Mumbai orthopaedic surgeon Reveals : ఒక సమోసా... యాభై నిమిషాల వాక్)


