కొందరికి సమోసా ఇష్టమైతే కొందరికి పూరీ ఫేవరెట్టు. ఇంకొంతమంది పిజ్జా బర్గర్లంటే ్ర΄ాణం పెడతారు. అన్నీ హాటేనా, మరి స్వీటు సంగతో.... అంటే తడవకో గులాబ్‌జామూన్ గుటుక్కుమనిపించేవారికి, అదను దొరికితే చాలు... జిలేబీలు, లడ్డూల మీద దండయాత్ర చేసేవారికి కొదవేం లేదు. బాగానే ఉంది మరి.. వీటిని కరిగించడానికి... సారీ... అవి తినడం వల్ల మన ఒంట్లోకి వచ్చిపడే క్యాలరీలను కరిగించడానికి ఏం చేస్తున్నారు? తినడం వరకే కానీ క్యాలరీల కౌంటుతో మాకేం పని అంటారా? అదేం కుదరదు... మీరు ఒక్క సమోసా లేదా వడాపావ్ తింటే వంట్లోకి దాదాపు 250 క్యాలరీలు వచ్చి పడతాయి. వాటిని కరిగించాలంటే దాదాపు యాభై నిమిషాలు నడవాలి. అదే ఒక పిజ్జా ముక్కను కరిగించాలంటే కనీసం గంట సేపు వాక్ చేయాలి.
అన్నట్టు ఇవన్నీ మనం వేసిన కాకిలెక్కలేం కాదు... ముంబైకి చెందిన ఆర్థోపెడిక్ సర్జన్, స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ మనన్ వోరా తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో భారతదేశంలో అత్యంత ఇష్టమైన కొన్ని ఆహారాల కేలరీల సంఖ్య, వాటిని సమతుల్యం చేసుకోవడానికి మీరు ఎంత సమయం నడవాలి అనే దాని గురించి ఇటీవల వివరించారు.
‘మీరు చిప్స్ ప్యాకెట్ తింటుంటే, అది సుమారు 300 కేలరీలు వరకు చేరుతుందని, మీకు గంటకు పైగా నడక అవసరం‘ అని డాక్టర్ వోరా పేర్కొన్నారు. తీపి పదార్థాలు ఇష్టపడేవారికి,‘1 గులాబ్ జామున్‌లో 180 కేలరీలు ఉంటాయి, అంటే దాదాపు 35 నిమిషాల నడక‘ అని ఆయన చెప్పారు..
ఒక ప్లేట్ చోలే భతురే అంటే పూరీ, శనగల కూర 600 కేలరీలు ప్యాక్ చేస్తుంది, మీరు దాదాపు 2 గంటలు నడవాలి. అలాగని కడుపు మాడ్చుకోవాల్సిన పనేం లేదని, నచ్చిన వాటిని ఆస్వాదిస్తూనే వాకింగ్, రన్నింగ్, జాగింగ్ వంటి చిన్నపాటి ఎక్సర్‌సైజులతో వాటిని సమతుల్యం చేసుకోవడం మంచిదని ఆయన పేర్కొన్నారు.
(చదవండి: ఇదిగో ఏఐ... అదిగో పులి!)


