లబ్బీపేట(విజయవాడతూర్పు): కేంద్రప్రభుత్వం రవాణా వాహనాల ఫిట్‌నెస్ చార్జీలు పెంచడాన్ని నిరసిస్తూ ఈ నెల 9వ తేదీ అర్ధరాత్రి నుంచి 12 ఏళ్లు దాటిన రవాణా వాహనాలను నిలిపివేసి బంద్ పాటించనున్నట్లు ఆలిండియా మోటార్ ట్రాన్స్‌పోర్ట్ కాంగ్రెస్ సౌత్ జోన్ ఉపాధ్యక్షుడు వై.వి.ఈశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. తమిళనాడులోని వెల్లూరులో సోమవారం జరిగిన సౌత్ ఇండియా మోటార్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (సిమ్టా) సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
రైల్వే గూడ్స్, షిప్ యార్డులకు వెళ్లే వాహనాలు, పౌర సరఫరాలకు ఉద్దేశించిన పన్నెండు సంవత్సరాలకు పైబడిన రవాణా వాహనాలు కలిగి స్వయం ఉపాధి పొందుతున్న ఆపరేటర్లు ఈ బంద్‌లో పాల్గొననున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటివరకూ రూ.1340 ఉన్న ఒక్కో వాహనం ఫిట్‌నెస్ చార్జీలను ఏకపక్షంగా రూ.33 వేలకు పెంచుతూ కేంద్రప్రభుత్వం గత నెల 11న నోటిఫికేషన్ విడుదల చేసిందని పేర్కొన్నారు.
ఈ నిర్ణయం పాత లారీల యజమానులను ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టిందని, ఇప్పటికే దక్షిణ రాష్ట్రాల్లో వేలసంఖ్యలో లారీలు ఫిట్‌నెస్ చేయించుకోలేక నిలిచిపోయాయని తెలిపారు. పాత రేట్లనే కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, ఆ డిమాండ్ నెరవేరేవరకు 12 ఏళ్లకు పైబడిన లారీలు రోడ్లపై నడపకుండా ఆందోళన చేసేందుకు సిమ్టా సమావేశం తీర్మానం చేసినట్లు పేర్కొన్నారు. ఆ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, పాండిచ్చేరి, కేరళ రాష్ట్రాల లారీ యజమానుల సంఘాల నాయకులు పాల్గొన్నట్టు ఈశ్వరరావు తెలిపారు.


