శాంటా తాత వస్తాడు అడిగినవన్నీ ఇస్తాడు... అని పిల్లలు అనుకోవడం ఆనవాయితీ.తల్లిదండ్రులే ఏ అర్ధరాత్రో వారి దిండ్ల వద్ద ఆ కానుకలు పెట్టి ఆశ్చర్యపరచడమూ ఆనవాయితే.కాని శాంటాలు రాని ఇళ్లుంటాయి.శాంటా బహుమతులు అందని పిల్లలుంటారు. ఈ క్రిస్మస్ వేళ పేద పిల్లలకు, హోమ్స్‌లో ఉండే నిరాధార పిల్లలకు మీరే శాంటాలుగా కానుకలు ఎందుకు ఇవ్వకూడదు? అవి అవి అందుకున్న వారి ముఖాల్లో నక్షత్ర కాంతిని ఎందుకు చూడకూడదు?
శాంటా క్లాజ్‌కు దేశం లేదు.... ప్రాంతం లేదు... భాష లేదు... అందరు పిల్లలకూ శాంటా తాత ఇష్టం. తాత తెచ్చే కానుకలు ఇష్టం. అందుకే క్రిస్మస్ వస్తుందనగా తమ కోరికలన్నీ కాగితం పై రాసి జాగ్రత్తగా డబ్బాలో వేసి పెట్టడమో, ఫ్రిజ్‌కు ఉన్న అయస్కాంతం కింద వేళ్లాడగట్టడమో,పోస్ట్‌బాక్స్‌లో వేయడమో చేస్తారు. ఎప్పుడెప్పుడు శాంటా వస్తాడా... కానుకలు ఇస్తాడా అని ఉద్వేగంగా ఎదురు చూస్తారు.
క్రిస్మస్ ముందు రోజు రాత్రి తప్పకుండా శాంటా వస్తాడని పిల్లల నమ్మకం. ‘జింగిల్ బెల్స్... జింగిల్ బెల్స్... జింగిల్ ఆల్ ద వే’ అని పాడుకుంటూ, మువ్వలు గలగలలాడుతున్న రైన్‌డీర్‌ల బండి ఎక్కి, కానుకల మూటతో శాంటా వచ్చి ఒక్కో పిల్లవాడికి/పాపకు ఇవ్వాల్సిన గిఫ్ట్ ఇచ్చి వెళతాడని వాళ్లు భావిస్తారు. అంతేనా? మంచి నడవడిక చూపినందుకు, బాగా చదువుకుంటున్నందుకు ‘మెచ్చుకోలు పత్రం’ కూడా ఇచ్చి వెళతాడు. ఏదైనా చెడ్డ అలవాటు ఉంటే మానుకోమని హెచ్చరిస్తాడు కూడా.
అలా అని విశ్వసించే పిల్లలు క్రిస్మస్ రోజు కళ్లు తెరిచి తమ దిండ్ల పక్కనే ఉన్న బహుమతులు చూసుకుని కేరింతలు కొడతారు. శాంటా ఇచ్చాడని మురిసి΄ోయి పక్కింటి పిల్లలకు చూపిస్తారు. శాంటా లేఖను పదే పదే చదువుకుంటారు. ఇది వారి మురిపమైన అమాయక ప్రపంచం. ఆ ప్రపంచంలో వారిని ఉంచేందుకు తల్లిదండ్రులు/ బంధువులు రహస్యంగా కానుకలు ఏర్పాటు చేస్తారు. ఇలా సీక్రెట్ శాంటాలుగా కన్నబిడ్డలకే కాదు... మనసులోని చిన్న చిన్న కోరికలు కూడా నెరవేరని స్థితిలో ఉన్న పిల్లలకు కూడా కావచ్చు.
సీక్రెట్ శాంటా నెట్‌వర్క్స్
మన దేశంలో అనేక స్వచ్ఛంద సంస్థలు ‘సీక్రెట్ శాంటా నెట్‌వర్క్స్’ కలిగి ఉన్నాయి. ఇవి తమ వెబ్‌సైట్స్‌లో అండర్ ప్రివిలేజ్డ్ పిల్లలు అంటే పేద బస్తీల్లో, హాస్టళ్లలో, అనాథ గృహాలలో ఉన్నవారు కోరిన కోరికలను ఉంచుతారు. వాటిని చూసి ఆ కోరిక నెరవేర్చేందుకు సాయం చేయవచ్చు. లేదా ఆ గిఫ్ట్‌ను స్వయంగా అందే ఏర్పాటు చేయవచ్చు. శాంటా పంపినట్టే ఈ పిల్లలకు ఆ గిఫ్ట్స్ అందుతాయి. ఇలాంటి పని కోసం వలెంటీర్లుగా పని చేసే విద్యార్థినీ విద్యార్థులు ఉన్నారు. ‘భూమి’, ‘హోమ్‌లెస్ కేర్ ఫౌండేషన్’, ‘లిటిల్ హార్ట్ ఫౌండేషన్’, ‘ది లెప్రసి మిషన్ ట్రస్ట్ ఇండియా’... వంటి సంస్థలు సీక్రెట్ శాంటాలుగా క్రిస్మస్ సమయంలో పేద పిల్లల ముఖాన చిర్నవ్వులు చిందించే ఏర్పాటు చేస్తున్నారు. నగరాలన్నింటిలోనూ ఇంకా అనేక సంస్థలు పని చేస్తున్నాయి. ఇంటర్నెట్ ద్వారా ఎంచుకుని సహాయం చేయవచ్చు.
చిన్న కానుక... ఎంతో సంతోషం:
క్రిస్మస్ డిసెంబర్ ఆఖరున వస్తుంది. కాబట్టి స్వెటర్లు, ఉన్ని టోపీలు, రగ్గులు ఇవ్వొచ్చు. స్కూలు బ్యాగులు, నోట్‌బుక్స్, షూస్, హైజీన్ కిట్స్... ఇవన్నీ వారికి ఆనందాన్ని ఇచ్చేవే. బొమ్మలు, బట్టలు చెప్పనక్కర్లేదు. కేక్స్, చాక్లెట్లు తప్పనిసరిగా ఉండాలి. ‘నీకు మంచి భవిష్యత్తు ఉంది. నువ్వు చాలా మంచి పిల్లాడివి’ అని రాసిన శాంటా లేఖ వారికి వేయి ఏనుగుల బలం ఇస్తుంది. మనం నివసిస్తున్న చోట హౌస్ హెల్ప్‌గా పని చేసే వారి పిల్లలకు, వాచ్‌మెన్, సెక్యూరిటీ గార్డ్స్ పిల్లలకు సీక్రెట్ శాంటాగా బహుమతులు పంపితే ఆ తర్వాత ఆ పిల్లల రియాక్షన్ తెలుసుకుంటే ఎంతో సంతృప్తిగా ఉంటుంది.
శాంటా కథ ‘మంచికి ప్రతిఫలం ఉంటుంది’ అని చెబుతుంది. పిల్లల్లో ఈ విశ్వాసం నింపడం ముఖ్యం. అండర్ ప్రివిలేజ్డ్ పిల్లల్లో మన కోసం కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది... మనకూ బహుమతులు ఉంటాయి అనే భరోసా కల్పించడం వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. క్రిస్మస్ చెట్టు, తార, బెల్స్... ప్రేమను పంచమనే చెబుతాయి. చిన్నపిల్లలకు ప్రేమను పంచడానికి మించిన ఆనందం లేదు.


