చాలా మంది ఎన్నో ఖర్చులు పెడతారు. ఎన్నో వస్తువులు వెంట వెంటనే మార్చి కొత్తవి కొంటూ ఉంటారు కానీ నెలల తరబడి ఒకే టూత్ బ్రష్‌ను ఉపయోగిస్తుంటారు. ఇది ప్రమాదకరమంటున్నారు దంతవైద్యులు. ఒకేటూత్ బ్రష్‌ను దీర్ఘకాలం పాటు ఉపయోగించడం వల్ల నోటి ఆరోగ్యం క్షీణించి, బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతుంది. ఇంతకీ ఎంతకాలానికి ఒకసారి టూత్ బ్రష్‌ను మార్చాలి, బ్రష్‌ను ఎప్పుడెప్పుడు మార్చుతుండాలో తెలుసుకుందాం.
దంతవైద్యులు ప్రతి 2 నుండి 3 నెలలకు ఒకసారి టూత్ బ్రష్ మార్చాలంటారు. ఎందుకంటే టూత్ బ్రష్ పాతదైతే, దాని బ్రిజిల్స్ దెబ్బతింటాయి. ఇది బ్రష్ చేసేటప్పుడు చిగుళ్ళకు హాని కలిగిస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే మొత్తం ఆరోగ్యం కూడా మీ దంతాల ఆరోగ్యానికి సంబంధించినది. అందువల్ల, దంతాలను సరిగ్గా శుభ్రం చేయడం చాలా ముఖ్యం.
చాలా మృదువుగా లేదా విప్పి ఉన్న బ్రిస్టల్స్ దంతాలను సరిగ్గా శుభ్రం చేయలేవు. దాంతో దంతాలపైన పాచి పేరుకుపోతుంది ఇది దంత క్షయం, చిగురువాపు ఇతర నోటి ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. నోటి ఆరోగ్యం బాగుండక΄ోతే అది క్రమేణా హృద్రోగానికి, నోటి క్యాన్సర్‌కు తలుపులు తెరుస్తుంది.
దాంతోపాటు నోటి ఆరోగ్యం బాగుండకపోతే మొత్తం జీర్ణవ్యవస్థపైనే దాని ప్రభావం పడుతుందని, కాబట్టి కనీసం మూడు నెలలకోసారి అయినా బ్రష్ మార్చడం మంచిదని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. అదేవిధంగా వైరల్ ఫీవర్, తీవ్రమైన జలుబు, దగ్గుతో బాధపడినప్పుడు, టైఫాయిడ్ వంటి వాటి నుంచి కోలుకున్న వెంటనే కూడా బ్రష్ మార్చడం మంచిదని నిపుణుల సలహా.
(చదవండి: బాల స్టార్టప్... బ్రహ్మాండం!)


