ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌కు ఏజ్‌తో పనేమిటి! బెంగళూరుకు చెందిన ఇద్దరు బాలికలు, ఒక బాలుడు ‘ఎకోవాలా’ అనే స్టార్టప్‌ను ప్రారంభించి జిగురు, కత్తెర ఉపయోగించకుండా పర్యావరణహితమైన కాగితపు సంచులను తయారు చేస్తున్నారు. నెలకు రూ.10 రూపాయల సబ్‌స్క్రిప్షన్‌తో కస్టమర్‌లకు ప్రతి ఆదివారం ‘ఎకోవాలా’ నుంచి రెండు చేతిసంచులు అందుతాయి.
‘చిన్న వయసులో మంచి ఆలోచన చేశారు అని చాలామంది ప్రశంసిస్తున్నారు. సబ్‌స్క్రిప్షన్ ఉన్నవారు అదనపు బ్యాగ్‌లు అడగవచ్చు. వీటి గురించి తెలియని వారికి ఫ్రీ శాంపిల్ బ్యాగులు ఇస్తాం. ఇప్పటికంటే సబ్‌స్క్రిప్షన్‌ల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది’ అంటుంది ఫౌండర్‌లలో ఒక బాలిక.
‘ఇవి మేము తయారు చేసిన బ్యాగ్‌లు’ అంటూ ఉత్సాహంగా ఫొటోలకు పోజ్ ఇచ్చారు’ ఎకోవాలా యజమానులు. వీరి స్ఫూర్తిదాయకమైన ఫొటోను ‘ఎక్స్’లో షేర్ చేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా ‘ఎకోవాలా’ స్టార్టప్ గురించి ప్రశంస పూర్వక కామెంట్ రాశారు. ఎంతోమంది నెటిజనులు ‘ఎకోవాలా’ ఫౌండర్స్‌ను ప్రశంసించారు.
‘ఇది కేవలం స్టార్టప్ కాదు. నెలకు రూ.10కి మన ఇంటికి చేరువయ్యే పర్యావరణ బాధ్యతలలో ఒక పాఠం’ అని ఒకరు రాశారు. ‘ఈరోజుల్లో చాలామంది పిల్లలు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్‌కు అతుక్కుపోయి బుర్రకు పనిచెప్పడం లేదు. అలాంటి వారికి ఎకోవాలా ఫౌండర్స్ ఆదర్శంగా నిలుస్తారు’ అని మరో యూజర్ స్పందించారు.
(చదవండి: Pari Bishnoi Success Story: ఐఏఎస్ అయ్యాను ఇలా..! అదే నా గెలుపు మంత్ర..)


