యూపీఎస్‌సీ ప్రయాణంలో ఎన్నో ప్రతికూలతలు, ఎదురుదెబ్బలు ఎదురైనా వెనక్కి తగ్గకుండా నిశ్శబ్ద పోరాటంతో ఐఏఎస్ సాధించింది పారి బిష్ణోయ్(Pari Bishnoi ). ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో తాను ఎదుర్కొన్న ఒత్తిడి, తన ప్రయాణంలో అత్యంత కష్టమైన దశ గురించి వివరించింది. యూపీఎస్‌సీలో మొదటి ప్రయత్నంలో విఫలం అయినప్పుడు రాజస్థాన్‌లోని తన స్వస్థలానికి వెళ్లింది పారి. ప్రపంచం నుండి తనను తాను దూరం చేసుకొని ఒంటరి ప్రపంచంలోకి వెళ్లిపోయింది.
తట్టుకోలేని ఒత్తిడిలో బాగా తినేది. దీంతో 30 కిలోలకు పైగా బరువు పెరిగింది! మానసిక భారంతో పాటు శారీరక భారం కూడా తనను భయపెట్టింది. దీంతో క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇచ్చింది. పొద్దుటే లేచి వ్యాయామాలు చేసి బరువు తగ్గింది. మనసు తేలిక పడింది. తేలిక పడిన మనసు తిరిగి లక్ష్యం వైపు దృష్టి సారించింది.
‘ఈసారి ఎలాగైనా సాధించాల్సిందే’ అని తనలోని ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంది. పరీక్ష ప్రిపరేషన్‌కు సంబంధించిన వ్యూహాన్ని మెరుగుపరుచుకుంది. దృఢనిశ్చయంతో అనుకున్నది సాధించింది.
పారి బిష్ణోయ్ షేర్ చేసిన వీడియో ఇప్పటికే పది లక్షల లైక్‌లను దాటింది.
(చదవండి: మందు పెట్టడం, కక్కించడం... రెండూ అపోహలే!)


