ఆధునిక కృత్రిమ మేధ(AI) గాడ్ ఫాదర్‌ల్లో ఒకరిగా పరిగణించబడే ప్రముఖ కంప్యూటర్ సైంటిస్ట్ యాన్ లెకున్ మెటా (Meta) నుంచి తప్పుకుంటున్నట్లు ధ్రువీకరించారు. తన సొంత ఏఐ స్టార్టప్‌ను ప్రారంభించేందుకు 12 ఏళ్ల అనుబంధం తర్వాత లెకున్ మెటాకు వీడ్కోలు పలుకుతున్నారు. 65 ఏళ్ల లెకున్ తన లింక్డ్‌ఇన్ పోస్ట్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు.
‘మీలో చాలా మంది ఇటీవలి మీడియా కథనాల్లో విన్నట్లుగా నేను 12 సంవత్సరాల తర్వాత మెటాను విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాను. FAIR (ఫేస్‌బుక్ AI రీసెర్చ్) వ్యవస్థాపక డైరెక్టర్‌గా 5 సంవత్సరాలు, చీఫ్ AI సైంటిస్ట్‌గా 7 సంవత్సరాలు అందులో పని చేశాను’ అని ప్రకటించారు. లెకున్ 2013లో మెటాలో (అప్పటి ఫేస్‌బుక్) వ్యవస్థాపక డైరెక్టర్‌గా చేరారు.
లెకున్ నిష్క్రమణ గురించి చాలా కాలంగా పుకార్లు ప్రచారంలో ఉన్నాయి. కంపెనీలో ఇటీవలి అంతర్గత మార్పులు AI భవిష్యత్తుపై లెకున్ దృష్టికి మధ్య తేడాలున్నట్లు కొందరు చెబుతున్నారు. ఏఐ ఉత్పత్తులు, వాణిజ్య ప్రాజెక్టులపై మరింత దృష్టి పెట్టడానికి మెటా ఇటీవల తన ఏఐ బృందాలను పునర్వ్యవస్థీకరించింది. ఇందులో భాగంగా అలెగ్జాండర్ వాంగ్ నేతృత్వంలో సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ అనే కొత్త విభాగం సృష్టించారు. ఈ మార్పు కారణంగా గతంలో చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ క్రిస్ కాక్స్‌కు రిపోర్ట్ చేసిన లెకున్, ఇప్పుడు 28 ఏళ్ల వాంగ్‌కు రిపోర్ట్ చేయాల్సి వస్తుంది.
సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ ద్వారా ఒకప్పుడు మెటాలో ప్రధాన ఏఐ శాస్త్రవేత్తగా లెకున్ అనుభవించిన స్వాతంత్య్రం తగ్గిపోయిందనే వాదనలున్నాయి. అక్టోబర్‌లో మెటా 600 మంది ఉద్యోగులను తొలగించినప్పుడు ప్రభావితమైన వారిలో చాలా మంది లెకున్ ఏర్పాటు చేసిన ఫేస్‌బుక్ ఏఐ రీసెర్చ్(FAIR) నుంచే ఉన్నారు. ప్రస్తుతం లెకున్ అడ్వాన్స్‌డ్ మెషిన్ ఇంటెలిజెన్స్ (AMI) స్టార్టప్‌పై దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి: జీవిత బీమా వెనుక భారీ సంపద రహస్యం


