సాక్షి, జగిత్యాల: జగిత్యాలలో రాజకీయం మరోసారి వేడెక్కింది. ఎమ్మెల్యే సంజయ్‌పై మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి సంచలన ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి, శ్రావణికి ఎమ్మెల్యే సంజయ్ కౌంటరిచ్చారు. వంద కోట్ల భూకబ్జా ఆరోపణలపై క్లారిటీ ఇచ్చారు.
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘భూమి కబ్జా వ్యవహారానికి నాకేం సంబంధం లేదు. మంచాల కృష్ణ నా మిత్రుడు కావచ్చు. అంత మాత్రాన ఆరోపణలు చేయడమేంటి?. నియోజకవర్గంలో నాకు అందరూ మిత్రులే. 75 ఏళ్ల క్రితం జరిగిన విషయాన్ని లాగి నాపై బురద చల్లడం తగదు. శ్రావణి చైర్‌పర్సన్‌గా ఉన్నప్పుడే మంచాల కాంప్లెక్స్ ప్రారంభం చేసింది. ఎంపీ ఎన్నికల సమయంలో జీవన్ రెడ్డి.. మంచాల కృష్ణ ఇంటికెళ్లి శాలువా కప్పించుకోలేదా?. జగిత్యాల ప్రజలు చైతన్యవంతులు. నిజాలు తెలుసు కాబట్టే నన్ను రెండోసారి ఎమ్మెల్యేగా గెలిపించారు’ అని చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉండగా.. జగిత్యాలలో సంచలనంగా మారిన రూ.100 కోట్ల భూకబ్జా ఆరోపణలపై భోగ శ్రావణి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తాను మున్సిపల్ చైర్‌పర్సన్ గా ఉన్నప్పుడు పెట్రోల్ పంపు భూ కబ్జా విషయంపై మాట్లాడితే తనను టార్గెట్ చేశారన్నారు. మున్సిపల్ చైర్‌పర్సన్ పదవికి రాజీనామా చేయడానికి పెట్రోల్ పంపు వ్యవహారణమే కారణమని తెలిపారు. యావర్ రోడ్డు విస్తరణకై తొలి ప్రయత్నంగా మాస్టర్ ప్లాన్ ప్రకారం డివైడర్ నిర్మిస్తున్న సందర్భంలో ఐదు ఫీట్లు ఆర్‌అండ్‌బీ ఆఫీస్ సైడ్ అలైన్మెంట్ చేయించినట్లు తెలిపారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం డివైడర్ కడితే పెట్రోల్ పంపు విషయం బయటకు వస్తుందని తనపై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. ఓ దశలో మొదలుపెట్టిన డివైడర్ నిర్మాణాన్ని సైతం మార్చి కట్టేలా చేశారని.. కబ్జాలకు పాల్పడిన వారిని కాపాడేందుకు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తనను నడిరోడ్డుపై నిలబెట్టి.. ఇది మా వ్యక్తిగత విషయమని.. ఈ విషయంలో నువ్వు తలదూర్చొద్దంటూ ఒత్తిడి తీసుకువచ్చారన్నారు. పెట్రోల్ పంప్‌కి అన్ని అనుమతులు ఉన్నట్లయితే ఆ రోజు తనపై ఎమ్మెల్యే సంజయ్ తనపై ఒత్తిడికి తీసుకురావడానికి కారణం ఏంటని ఆమె ప్రశ్నించారు.
అన్ని నిజాలు తెలిసినా ఎమ్మెల్యే సంజయ్ తెర వెనుక రాజకీయాలు చేస్తున్నారు. 1948 సెప్టెంబర్ 17న నిజాం పాలనా ముగిసి.. 1949 ఇండియన్ స్టాంప్ యాక్ట్ అమల్లోకి వస్తే 1952లో అసలు అమలులో లేని కిబాల ద్వారా స్థలం ఎలా కొన్నారో అర్థం కావడం లేదన్నారు. ఈ విషయంలో ఇప్పటికే అధికారులపై రాజకీయ ఒత్తిడి ఉందని.. సందేహాత్మకంగా ఉన్న కిబాల పత్రాన్ని అందరి సమక్షంలో ట్రాన్స్‌లేట్ చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. తాను చైర్‌పర్సన్‌గా ఉన్నప్పుడు ఈ వ్యవహారానికి సంబంధించి ఎలాంటి రికార్డులు మున్సిపల్‌లో లభించలేదని తెలిపారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న జీవన్ రెడ్డి ఇప్పటికైనా ఈ వ్యవహారంపై మాట్లాడడం హర్షించదగ్గ విషయమన్నారు. మున్సిపల్ ప్రభుత్వ భూముల రక్షణకై పార్టీలకు అతీతంగా కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. అవసరమైతే మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో జేఏసీ ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు.


