సాక్షి హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి చిట్‌చాట్‌ల పేరుతో దాక్కోవడం కాదు దమ్ముంటే బయిటకొచ్చి కేసులపై మాట్లాడాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. మంగళవారం నల్గొండలో నిర్వహించిన బీర్ఎస్ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండేళ్లుగా రోజుకో కేసు అంటూ లీకులిస్తుందని ఆయన ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్ గర్జిస్తే కాంగ్రెస్ నేతలెవరూ సమాధానం చెప్పలేకపోయారని వారికి ఆ దమ్ములేదని కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పే సత్తా కాంగ్రెస్‌కు లేదని కేటీఆర్ మండిపడ్డారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం 90 శాతం పూర్తి చేస్తే మిగిలిన 10 శాతం పనులను ఈ ప్రభుత్వం అడ్డుకుంటోందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు నిజంగానే మేలు చేసి ఉంటే సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించేదని, కానీ ఓటమి భయంతో ఎన్నికలకు ప్రభుత్వం వెనకడుగు వేస్తోందని విమర్శించారు.
ముఖ్యమంత్రికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే సహకార ఎన్నికలు పెట్టాలని కేటీఆర్ సవాల్ విసిరారు. అర్జునుడు చిలుక కన్నును లక్ష్యంగా చేసుకున్నట్లు, బీఆర్ఎస్ కార్యకర్తల దృష్టి కూడా కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీల అమలుపైనే ఉండాలన్నారు. ఎన్ని కేసులు పెట్టినా, జైలుకు పంపినా భయపడకూడదని కార్యకర్తలను ఉద్దేశించి కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.
గత ఆదివారం జరిగిన బీఆర్ఎస్‌సీఎల్పీ భేటీలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కారు గుర్తుతో స్థానిక ఎన్నికలు జరిగి ఉంటే ఫలితాలు బీఆర్ఎస్‌కు మరింత అనుకూలంగా ఉండేవన్నారు. కాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు కేటీఆర్‌కు నోటీసులు ఇవ్వాలని సిట్ భావిస్తున్నట్లు సమాచారం. దానితో పాటు 2023లో బీఆర్‌ఎస్ హాయాంలో హైదరాబాద్‌లో జరిగిన ఫార్ములా వన్ రేసు అవినీతి కేసులో కేటీఆర్ ఏ1గా ఉన్నారు.


