సాక్షి, యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్టలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల మధ్య ఫ్లెక్సీ వార్ నడిచింది. మంత్రులకు సంబంధించిన ఫ్లెక్సీలను కాంగ్రెస్ నేతలు వైకుంఠ ద్వారం దగ్గర ఏర్పాటు చేయడంపై బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫ్లెక్సీలపై నిషేధం ఉన్నప్పటికీ ఏర్పాటు చేయడంపై మండిపడ్డారు. అక్కడున్న ఫ్లెక్సీలను చించేశారు.
వివరాల ప్రకారం.. కాంగ్రెస్ శ్రేణులు తాజాగా మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ పర్యటన సందర్భంగా వైకుంఠ ద్వారం వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మంత్రులకు స్వాగతం అంటూ ఫ్లెక్సీలను పెట్టారు. అయితే, ఫ్లెక్సీల ఏర్పాటు నిషేధం ఉన్నప్పటికీ ఎలా పెట్టారంటూ బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నించారు. అనంతరం, వైకుంఠ ద్వారం వద్ద బీఆర్ఎస్ నేతల బైఠాయించి నిరసనలు తెలిపారు. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు.. బీఆర్ఎస్ నాయకులను పీఎస్‌కు తరలించారు. కాగా, గతంలోనూ మంత్రుల పర్యటన సందర్భంగా ఇష్టారీతిన కాంగ్రెస్ కార్యకర్తల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేకు ఈవో మద్దతుగా ఉంటూ ఇలాంటి వాటిపై చర్యలు తీసుకోవడం లేదంటూ మండిపడ్డారు.
ఇదిలా ఉండగా.. యాదగిరిగుట్ట వైకుంఠ ద్వారం, ఆలయం చుట్టూ ఫ్లెక్సీల ఏర్పాటుపై గతంలోనే నిషేధం విధించారు. అయినప్పటికీ ఈ నిషేధాన్ని కాంగ్రెస్ నేతలు ఉల్లంఘించారు. కాగా, కాంగ్రెస్ శ్రేణుల ఓవరాక్షన్‌తో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురువుతున్నట్టు బీఆర్‌ఎస్ శ్రేణులు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో హిందూ సంఘాలు సైతం నిరసనలకు, ధర్నాలకు సిబ్బమైనట్టు తెలిపారు.


